కేసీఆర్ క‌న్ఫ్యూజ్ చేశారా...క్లారిటీ ఇచ్చారా?

కేసీఆర్ క‌న్ఫ్యూజ్ చేశారా...క్లారిటీ ఇచ్చారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్‌ఎస్‌పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తాజా ప్ర‌క‌ట‌న ఆ పార్టీ నేత‌ల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో జ‌రిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో చేసిన ప్రకటనతో క్లారిటీ ఇస్తున్న‌ట్లు కేసీఆర్ చెప్పిన‌ప్ప‌టికీ...అది క‌న్ఫ్యూజ్ చేసే విధంగానే ఉందంటున్నారు. ముఖ్యంగా టికెట్ల కేటాయింపులో కేసీఆర్ నిర్ణ‌యాన్ని ఆ పార్టీ నేత‌లు అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో నలుగైదుగురికి తప్ప సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తనతో పాటు మంత్రుల్లో సమర్థులైన వారిని ఢిల్లీకి తీసుకెళ్తానని సీఎం కేసీఆర్‌ చెప్పడం టీఆర్‌ఎస్‌పార్టీలో కొంతమందిని కలవరానికి గురిచేస్తోంది. 2019 ఎన్నికలపై ఎవరు పోటీ చేస్తారన్న దానిపైనే అధికారపార్టీ నేతలకు సృష్టత లేకుండా పోయింది. సిట్టింగుల్లో ఎంతమందికి మళ్లీ టికెట్లు వస్తాయి. ఆశావహుల్లో ఎవరికి సీట్లు ఇస్తారన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో ఆరోపణలు వచ్చిన వారిని మాత్రమే పక్కన పెడతారా? ఒక గ్రూపునకు న్యాయం చేసి, మరో గ్రూపు మద్దతుదారులకు చెక్‌ చెబుతారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని చెప్పడంతో పాటు కొంతమందికి టికెట్లు ఇవ్వబోమని సీఎం కేసీఆర్‌ చెప్పడంతో ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. నలుగైదుగురికి టికెట్లు ఇవ్వబోమని అనడంతో, వారు ఎవరై ఉంటారన్నది ఆసక్తి నెలకొంది. జ‌నగాం, మహబూబాబాద్‌, మేడ్చల్‌, మంథని ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్లు ఇవ్వరన్న ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు ఇంకా ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని కొంతమంది సిట్టింగులకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు అని కూడా తెలుస్తోంది. ఇదిలావుండగా సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తే తాము ఏమై పోవాలని ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. టికెట్టు వస్తుందన్న ఆశతో టీఆర్‌ఎస్‌లో చేరామని, ఇప్పుడేమి కావాలని ప్రశ్నిస్తున్నారు. నల్లగొండ, భూపాలపల్లి, జనగాం వంటి నియోజకవర్గాల్లో ఆశావహులు ఎదురుచూ స్తున్నారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే, పార్టీలో ఉంటున్న తాము ఏమి కావాలని గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా ఎంపీలు వినోద్‌కుమార్‌, కవిత, మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌ వంటి ఎంపీలు అసెంబ్లీకి వచ్చేందుకు ఉత్సాహ చూపుతున్నారు. కేసీఆర్‌ ప్రకటన వల్ల కొంతమంది ఎమ్మెల్యేలకు నష్టం వాటిల్లినా, ఆయన అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జాతీయ రాజ‌కీయాల‌పై క‌న్నువేసిన నేప‌థ్యంలో ఢిల్లీకి కేసీఆర్‌తో పాటు వెళ్లే సమర్థులైన మంత్రులు ఎవరై ఉంటారని కూడా గులాబీ నేతల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇదే విషయమై సోమవారం ఒకరిద్దరు ఎమ్మెల్యేలను అడగగా, తమ నాయకుడు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్‌ మాటను జవదాటబోమన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English