సామాన్యుల్లో క‌ల‌క‌లం..ఆంధ్రాబ్యాంక్‌లో భారీ స్కాం

సామాన్యుల్లో క‌ల‌క‌లం..ఆంధ్రాబ్యాంక్‌లో భారీ స్కాం

బ్యాంకింగ్ స్కాంల పరంప‌ర‌లో మ‌రో కొత్త స్కాం తెర‌మీద‌కు వ‌చ్చింది. అందులో అంశాలు కార్పొరేట్ వ‌ర్గాలను సైతం షాక్‌కు గురిచేసేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.ఆంధ్రా బ్యాంక్‌తో సహా వివిధ బ్యాంకింగ్‌ సంస్థల నుంచి నుంచి వేలాది కోట్ల రుణాలను అక్రమ పద్ధతుల్లో స్వీకరించిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ వాటిని తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో గత ఏడాది సీబీఐ ఈ విషయమై కేసు నమోదు చేసింది. వృత్తిరీత్యా చార్టర్డ్‌ అకౌంటెంటైన ఆంధ్రా బ్యాంక్‌ మాజీ డైరెక్టర్ ప్ర‌కాశ్‌ గార్గ్‌ 2009 అక్టోబరు వరకు దాదాపు మూడేళ్ల‌ పాటు బ్యాంకు బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగారు.

2008-09 మధ్య కాలంలో ఆయన స్టెర్లింగ్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి భారీ మొత్తంలో లంచాలను స్వీకరించి బ్యాంకు నుంచి వారికి రుణాలు మంజూరయ్యేందుకు పని చేసినట్టుగా విచారణ సంస్థలు గుర్తించాయి. స్టెర్లింగ్‌ గ్రూపునకు రుణ లబ్ది చేకూర్చేందుకు వీలుగా అనూప్‌ వారి నుంచి రూ.2కోట్లను స్వీకరించినట్లు ఈడీ తాజాగా పేర్కొంది. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వెలుగు చూస్తోన్న స్కామ్‌ల ప్రభావంతో ఇప్పటికే కుదేలైన ఆంధ్రాబ్యాంక్‌ షేర్లు సోమవారం మరింతగా పతనమయ్యాయి.

తాజా ఈడీ విచారణలో షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి. 2011లో ఇన్‌ కంట్యాక్స్‌ అధికారులు సీజ్‌ చేసిన డైరక్టర్‌ డైరీలో చేతన్‌ జయంతిలాల్‌ సందేశారా, నితిన జయంతిలాల్‌ సందేశారా అనే స్టెర్లింగ్‌ బయోటెక్‌ డైరక్టర్లు ఇతనికి 15.2 మిలియన్ల మేర డబ్బు చెల్లించినట్లు ఎంట్రీలు ఉన్నాయని తేలింది. దీంతో ఆయనపై మరో చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. 2016 ముగింపు నాటికి స్టెర్లింగ్‌ గ్రూపు కంపెనీలు బ్యాంకుల నుంచి రూ.5383 కోట్ల మేర రుణాలను స్వీకరించాయని.. ఆ తరువాత సదరు రుణాలన్నీ నిరర్థక ఆస్తులుగా మారిపోయినట్టుగా సీబీఐ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది.

మరోవైపు ఇదే విషయమై హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇస్తూ.. స్టెర్లింగ్‌ గ్రూపు కంపెనీలు తీసుకున్న రూ.1,150 కోట్ల రుణాలకు మాత్రమే తాము లీడ్‌ బ్యాంక్‌గా వ్యవహరించినట్టుగా పేర్కొంది. 2015 నుంచి ఈ సంస్థలకు ఇచ్చిన రుణాలను తాము నిరర్థక ఆస్తులుగా పరిగణిస్తూ తగిన సర్దుబాట్లు చేశామని బ్యాంక్‌ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ మోసాన్ని గత డిసెంబరులోనే గుర్తించిన తాము భారతీయ రిజర్వు బ్యాంకునకు, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది.

గతంలో స్టెర్లింగ్‌ బయోటెక్‌లో రూపంలో వెలుగు చూసిన దాదాపు రూ.5,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)  అనూప్‌ ప్రకాశ్‌ గార్గ్‌పై తాజాగా మరో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ వార్తల నేపథ్యంలో ఈ బ్యాంక్‌ స్టాక్‌ 15 ఏండ్ల కనిష్టానికి పడిపోయింది. మనీ లాండరింగ్‌ ఆరోపణలతో గార్గ్‌పై ఈ కేసు నమోదు అయింది.

దీంతో ఇన్వెస్టర్లు ఆంధ్రా బ్యాంకు షేర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈడీ చార్జ్‌షీచ్‌ నేపథ్యంలో ఆంధ్రాబ్యాంక్‌ షేర్లు సోమవారం ఒక్కరోజే దాదాపు 6.7 శాతం మేర కుంగి రూ.35.95కు పడిపోయాయి. 2003 తరువాత ఆంధ్రాబ్యాంక్‌ షేరు ఇంత తక్కువ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మొత్తం 2018 ఏడాదిలో ఇప్పటి దాకా 41 శాతానికి పైగానే పతనమవడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు