ఢిల్లీ రాజ‌కీయాల్ని ఇక్క‌డ నుంచే న‌డిపిస్తారా కేసీఆర్‌?

ఢిల్లీ రాజ‌కీయాల్ని ఇక్క‌డ నుంచే న‌డిపిస్తారా కేసీఆర్‌?

జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌నున్న విష‌యాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్ప‌టం తెలిసిందే. ఎలాంటి సందేహాలు అక్క‌ర్లేద‌ని..తాను జాతీయ రాజ‌కీయాల సంగ‌తి చూడ‌నున్న విష‌యాన్ని ఇప్ప‌టికే ప‌లుమార్లు స్ప‌ష్టం చేసిన కేసీఆర్ తాజాగా మ‌రింత క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కేంద్రం వైపు దృష్టి పెట్ట‌ట‌మంటే.. రాష్ట్రం సంగ‌తేంది? ఎవ‌రికి సీఎం పీఠం అప్ప‌జెబుతారు?  లాంటి సందేహాలు ఇప్పుడు చాలామందిలో ఉన్నాయి.

కొంద‌రు ఉత్సాహ‌వంతులైతే.. కేటీఆర్ పేరును తెర మీద‌కు తీసుకొచ్చి.. ఆయ‌న్ను ప‌ద‌విలో కూర్చోబెడ‌తార‌న్న మాట‌ను వాద‌న‌ను వినిపిస్తున్నారు. అయితే.. అలాంటి చాన్సే ఇప్ప‌ట్లో లేద‌న్న విష‌యాన్ని చెప్పేశారు కేసీఆర్. 2019 వ‌ర‌కు తానే ముఖ్య‌మంత్రిన‌ని చెప్పేశారు. అంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌న్న మాట‌.
 
ముఖ్య‌మంత్రిగా ఉంటూ జాతీయ రాజ‌కీయాల్లో చురుగ్గా పాలు పంచుకోవ‌టం ఎలా? అన్న సందేహం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఆ విష‌యం మీద తానేం చేయ‌నున్న విష‌యాన్ని చెప్పేశారు కేసీఆర్‌. రాష్ట్రం నుంచే ఢిల్లీ రాజ‌కీయాల్ని న‌డిపించ‌నున్న‌ట్లు చెప్పారు. విజ‌న్ ఉన్న నేత కోసం దేశమంతా ఎదురుచూస్తుంద‌న్న ఆయ‌న‌.. రాజ‌కీయాల్లో మార్పు కోసం.. ప్ర‌గ‌తి కోస‌మే దేశ రాజ‌కీయాల్లోకి అడుగు పెడుతున్న‌ట్లు చెప్పారు.

రాష్ట్రం నుంచే ఢిల్లీ రాజ‌కీయాల సంగ‌తి చూస్తాన‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేయ‌టంపై ప‌లువురు ఇది సాధ్య‌మేనా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అలాంటివాళ్లంతా మ‌ర్చిపోతున్న విష‌యం ఏమిటంటే.. సెక్ర‌టేరియ‌ట్ ముఖం చూడ‌కుండానే రాష్ట్ర పాల‌న‌ను గ‌డిచిన నాలుగేళ్ల నుంచి కేసీఆర్ చేస్తున్నార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అంతేనా.. ఎర్ర‌వ‌ల్లిలోని వ్య‌వ‌సాయ క్షేత్రం నుంచి.. క్యాంప్ ఆఫీస్ నుంచి రాష్ట్ర వ్య‌వ‌హారాల్ని చ‌క్క‌బెట్టే కేసీఆర్‌.. ఇప్పుడు రాష్ట్రం నుంచి జాతీయ రాజ‌కీయాల్ని న‌డిపిస్తాన‌ని చెప్ప‌టం చూస్తే.. కేసీఆర్ వ‌ర్కింగ్ స్టైల్లో ఎలాంటి మార్పులు లేవ‌ని చెప్పాలి. అదే కేసీఆర్ అయిన‌ప్ప‌డు.. వ‌ర్క్ స్టైల్లో మార్పు ఎందుకు వస్తుంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు