మూర్తిగారు కడిగేశారుగా..

మూర్తిగారు కడిగేశారుగా..

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు సినిమాల ప్రదర్శనకు ఫీజు పేరిట భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని.. వాళ్లు ఆ ధరల్ని 75 శాతం తగ్గించడంతో పాటు వచ్చే ఏడాది నుంచి అసలు ఫీజే లేకుండా సినిమా ప్రదర్శనకు అవకాశమివ్వాలని.. తమ డిమాండ్లకు ఒప్పుకునే వరకు సినిమాలు ఇచ్చే ప్రసక్తే లేదంటూ థియేటర్లను మూత వేయించి సమ్మెకు దిగారు టాలీవుడ్ నిర్మాతలు.

ఎన్ని వారాలైనా మెట్టు దిగేది లేదన్నట్లుగా మాట్లాడారు నిర్మాతలు. కానీ వారం తిరిగే సరికి సమ్మె వీగిపోయింది. అలాగని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ధరలేమైనా భారీగా తగ్గించారా అంటే అదేమీ లేదు. నామమాత్రంగా రూ.2 వేలు మాత్రమే ధర తగ్గించారు. మరి సమ్మె ఏమేరకు విజయవంతమైందో మన నిర్మాతలకే తెలియాలి.

ఐతే ఈ వ్యవహారంపై అందరూ సైలెంటుగా ఉన్నారు కానీ.. సీనియర్ దర్శక నిర్మాత నారాయణమూర్తి మాత్రం నిర్మాతల తీరును కడిగేశారు. సమ్మె వల్ల ఏం సాధించారని నిర్మాల్ని ప్రశ్నించారు. డీఎస్పీలు సమ్మెకు ముందు అన్నట్లుగానే నామమాత్రంగా రూ.2 వేలు మాత్రమే ధర తగ్గించారని.. అలాంటపుడు సమ్మె వల్ల ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు.

‘‘ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి ఉపయోగించే బ్రహ్మాస్త్రం బంద్‌. అదిక్కడ నిష్ప్రయోజనమైంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో మాత్రం బంద్‌ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఐక్యత కొరవడినందున థియేటర్లు తెరుచుకున్నాయి. సెలవుల్లో పెద్ద సినిమాలు ఎక్కుగా విడుదలవుతాయి. చిన్న సినిమాలకి ఆస్కారం ఉండదు. ఏప్రిల్‌ నెలలో సెలవులు కాబట్టి అప్పుడు పెద్ద సినిమాల విడుదలకి సిద్ధం అయ్యారు. ఈలోగా మార్చిలో అయినా సినిమాలను విడుదల చేసుకుందామని చిన్న నిర్మాతలు సిద్ధమైతే, దురుద్దేశంతో బంద్‌ను ప్రకటించారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులలోని కొందరు ఈ డిజిటల్‌ ప్రొవైడర్స్‌ కంపెనీల్లో భాగస్వాములుగా ఉంటున్నారు. వాళ్లు బతికితే సరిపోదు. చిత్రపరిశ్రమలోని వారంతా బతకాలి. కేవలం రూ.2 వేలకే సినిమాలను ప్రదర్శించే డిజటల్‌ కంపెనీలున్నాయి. కానీ వాటిని రానియ్యకుండా  గుత్తాధిపత్యం సాగిస్తున్న కంపెనీలు అడ్డుపడుతున్నాయి’’ అని నారాయణ మూర్తి అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు