బాబు క్లారిటీఃబీజేపీతో ఒరిగిందేమీ లేదు

బాబు క్లారిటీఃబీజేపీతో ఒరిగిందేమీ లేదు

బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అదనంగా ఒరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్యనేతల వద్ద అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఆ పార్టీపై ఎదురు దాడికి దిగింది. టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. బీజేపీపై ధ్వజమెత్తారు.

రాజీనామాలు చేసిన మరుసటి రోజే ఆ పార్టీని ఏకిపారేశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చించుకునేందుకు ఓ వ్యూహ కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేశారు. కమిటీలో యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులతో పాటు మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, సలహాదారులు పరకాల ప్రభాకర్, కుటుంబరావు ఉన్నారు. పరిణామాలను ఎప్పటికప్పడు నిశితంగా గమనించాలని కమిటీకి చంద్రబాబు ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌తో చంద్ర‌బాబు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల మాకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదని అన్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం అలాగే ఉంది. అందువల్ల బీజేపీతో కలిసినంత మాత్రాన మాకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు అని బాబు స్పష్టంచేశారు.

రాష్ర్టానికి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే బీజేపీతో చేతులు కలిపామని బాబు చెప్పారు. కేంద్రం చేయాల్సిన కొన్ని కీలక పనులు ఇంకా ఉన్నందున మరికొంత కాలం ఎన్డీయేలోనే కొనసాగాలని నిర్ణయించినట్లు బాబు తమ ఎంపీలతో అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ పరంగా ఎలా ముందుకు పోవాలో నిర్ణయించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని వేశారు.

అయితే బాబు విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ప్రత్యేక హోదాతో ప్రత్యేకంగా వచ్చేదేమీ లేదని, ప్రత్యేక ప్యాకేజీయే బెటరని గతంలో అన్న బాబు.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మాట మార్చారని బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి విమర్శించారు. రాజధాని కోసం కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. విజయవాడ, గుంటూర్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఎందుకు ఆగిపోయాయని ప్రశ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English