మోడీ చేతికి ఏపీ మంత్రుల రాజీనామా లేఖ‌లు

మోడీ చేతికి ఏపీ మంత్రుల రాజీనామా లేఖ‌లు

అనుకున్న‌ట్లే జ‌రిగింది. ఏపీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న విధానాల‌పై అసంతృప్తితో ఉన్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌మ మంత్రులు కేంద్రం నుంచి త‌ప్పుకుంటార‌ని.. త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తార‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందుకు త‌గ్గ‌ట్లే కొద్దిసేప‌టి క్రితం (గురువారం సాయంత్రం 6.10గంట‌లు) ప్ర‌ధాని నివాసానికి వెళ్లిన ఏపీకి చెందిన కేంద్ర‌మంత్రులు ఇద్ద‌రు (అశోక్ గ‌జ‌ప‌తిరాజు.. సుజ‌నా చైద‌రి)లు త‌మ రాజీనామా లేఖ‌ల్ని ప్ర‌ధాని మోడీ చేతికిచ్చారు.

2014 మోడీ స‌ర్కారు కొలువు తీరిన వేళ‌లోనే.. అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు త‌న కేబినెట్‌లో స్థానం ఇచ్చారు. అనంత‌రం జ‌రిగిన విస్త‌ర‌ణ‌లో సుజ‌నాకు కేంద్ర‌మంత్రివ‌ర్గంలో స‌హాయ మంత్రిగా అవ‌కాశం ల‌భించింది. ప్ర‌ధానికి త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా లేఖ‌ల్ని ఇచ్చేందుకు నేత‌లు ఇద్ద‌రు త‌మ వ్య‌క్తిగ‌త వాహ‌నాల్ని వినియోగించ‌టం గ‌మ‌నార్హం.

కేంద్ర‌మంత్రి ప‌ద‌వులకు త‌మ పార్టీ నేత‌లు రాజీనామా చేస్తున్న విష‌యాన్ని నిన్న (బుధ‌వారం) సాయంత్రం నుంచి మోడీ దృష్టికి తీసుకెళ్ల‌టానికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. అయితే ప్ర‌ధాని మోడీ లైన్లోకి రాలేదు. తాము బుధ‌వారం రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యం నుంచి ప్ర‌ధాని మోడీని సంప్ర‌దించే ప్ర‌య‌త్నం చేసినా.. ఫ‌లితం లేకుండా పోయిన‌ట్లుగా టీడీపీ సీనియ‌ర్ నేత కాల్వ శ్రీ‌నివాసులు వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే.. పార్టీ నేత‌లంతా క‌లిసి కేంద్ర క్యాబినెట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌న్న నిర్ణ‌యం తీసుకోవ‌టంతో ఆ విష‌యాన్ని నిన్న రాత్రి ప‌ద‌కొండు గంట‌ల వేళ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ప్ర‌క‌టించ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉద‌యం ప్ర‌ధాని మోడీ అపాయింట్ మెంట్ తీసుకున్నారు ఇద్ద‌రు మంత్రులు. అయితే..రాజ‌స్థాన్ లో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మంలో హాజ‌ర‌య్యేందుకు ప్ర‌ధాని మోడీ వెళ్ల‌టం.. సాయంత్రం తిరిగి వ‌చ్చిన వెంట‌నే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో ఫోన్లో మాట్లాడ‌టం జ‌రిగింది. దాదాపు ఇరవై నిమిషాలు వీరి మ‌ధ్య ఫోను సంభాష‌ణ జ‌రిగింద‌ని చెబుతున్నారు. త‌మ నేత‌లు రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితి గురించి.. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. త‌మ మంత్రుల్ని కేంద్ర క్యాబినెట్ నుంచి ఉప‌సంహ‌రించుకోవ‌టానికి దారి తీసిన ప‌రిస్థితుల్ని మోడీకి చంద్ర‌బాబు వివ‌రించినట్లు చెబుతున్నారు. అశోక్.. సుజ‌నాకు సాయంత్రం ఆరు గంట‌ల వేళ అపాయింట్ మెంట్ ఇవ్వ‌టం.. ఆ స‌మ‌యానికి వెళ్లిన ఇద్ద‌రూ ప్ర‌ధాని మోడీని క‌లిసి ఆయ‌న చేతికి త‌మ రాజీనామా లేఖ‌ల్ని అందించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు