బాబు నిర్ణ‌యంతో జ‌గ‌న్ సంతోషం!

బాబు నిర్ణ‌యంతో జ‌గ‌న్ సంతోషం!

త‌ప్పులు మాన‌వ స‌హ‌జం. అందుకు నేత‌లు మిన‌హాయింపులు కావు. తెలివైనోడు.. స‌మ‌ర్థుడు త‌ప్పులు చేస్తాడు కానీ.. చేసిన త‌ప్పుల్ని అస్స‌లు చేయ‌డు. కానీ.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హార‌మే వేరుగా ఉంటుంది. రాజ‌కీయాల‌పై క‌నీస అవ‌గాహ‌న ఉన్నోళ్ల చేసేంత విశ్లేష‌ణ జ‌గ‌న్ చేయ‌రా? అన్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.

మోడీ స‌ర్కారు ప్ర‌వేశ పెట్టిన పూర్తిస్థాయి చివ‌రి బ‌డ్జెట్ లో ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు భంగం వాటిల్లేలా ఉండ‌టంపై వెనువెంట‌నే రియాక్ట్ కావాల్సి ఉన్నా కాలేదు. ఎప్పుడైతే ఏపీ అధికార‌ప‌క్షం విమ‌ర్శ‌లు మొద‌లెట్టిందో.. ఆ వెంట‌నే స‌ర్దుకున్న జ‌గ‌న్ బ్యాచ్‌.. ఆ విష‌యం మీద దృష్టి పెట్ట‌టం తెలిసిందే. ఎన్నిక‌లు ఏడాదికి వ‌చ్చేసిన నేప‌థ్యంలో అనూహ్య రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌న్న చిన్న విష‌యాన్ని జ‌గ‌న్ మిస్ అయ్యార‌ని చెప్పాలి. పాద‌యాత్ర‌తో వ‌చ్చే మైలేజీతో రాజ్యాధికారం వ‌చ్చేస్తుంద‌న్న భ్ర‌మ‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు చెబుతారు.

తాను పాద‌యాత్ర మొద‌లెట్టి వంద రోజులు దాటినా.. సొంత మీడియాలో త‌ప్పించి మిగిలిన ఏ మీడియాలోనూ పెద్దగా ప్ర‌చారం రావ‌టం లేద‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ ప‌రివారం గుర్తించ‌న‌ట్లుగా ఉంది. అదే స‌మ‌యంలో హోదా విష‌యంలో ఏపీ ప్ర‌జ‌ల రియాక్ష‌న్‌.. జైట్లీ బ‌డ్జెట్ లో ఏపీకి ఏమీ కేటాయించక‌పోవ‌టంపై ఆంధ్రోళ్లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తించ‌టంలోనూ త‌ప్పు జ‌రిగింద‌ని చెబుతారు.

జ‌నంలో అంత‌కంత‌కూ పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించిన చంద్ర‌బాబు.. హోదాపై త‌న వాద‌న‌ను వినిపించ‌టం.. ఆ అంశంపై ఒత్తిడిని అంత‌కంత‌కూ పెంచ‌ట‌మే కాదు.. ఏపీ అసెంబ్లీలో తాను మాట్లాడ‌టం ద్వారా కేంద్రంపై ప్రెజ‌ర్ ను పెంచేశారు. దీంతో.. జైట్లీ మీడియా స‌మావేశం పెట్టేసి ఏపీకి ఏమీ రాద‌ని తేల్చేశారు.

జైట్లీ త‌న వాద‌న‌ను వినిపించిన గంట‌ల వ్య‌వ‌ధిలోనూ బాబు దూకుడును ప్ర‌ద‌ర్శిస్తూ.. కేంద్రంలో త‌మ మంత్రులు మంత్రి ప‌ద‌వుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఓప‌క్క హోదా విష‌యంపై త‌మ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడ‌తాన‌ని టైం చెప్పిన త‌ర్వాత వేగంగా చోటు చేసుకున్న ప‌రిణామాలుగా చెప్పాలి. హోదా సాధ‌న విష‌యంలో త‌న పాత్ర అంత‌కంత‌కూ త‌గ్గిపోవ‌టం జ‌గ‌న్ ను విప‌రీతంగా వేధిస్తోంది. వాస్త‌వానికి పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభ‌మైనంత‌నే త‌న ఎంపీల‌తో రాజీనామాలు చేయించినా స‌రిపోయేది. లేనిప‌క్షంలో పెద్ద ఎత్తున నిర‌స‌న చేప‌ట్టినా ఫ‌లితం మ‌రోలా ఉండేది. కానీ.. బాబు దూకుడుతో జ‌గ‌న్ వెన‌క‌ప‌డిపోయిన ప‌రిస్థితి.

ఇలాంటివేళ‌.. త‌న ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేశారు జ‌గ‌న్‌. తాజాగా ఆయ‌న రియాక్ట్ అయిఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు విచిత్ర‌మైన స‌వాల్ విసిరారు. కేంద్రం మీద తాము ఈ నెల 11న అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించామ‌ని.. తాము ప్ర‌వేశ పెట్టే అవిశ్వాస తీర్మానానికి టీడీపీ నేత‌లు మ‌ద్ద‌తు ఇస్తారా? అని  ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌వేళ చంద్ర‌బాబు రేపు (శుక్ర‌వారం) అవిశ్వాసం పెట్టినా తాను సిద్ధ‌మ‌న్న‌ట్లు జ‌గ‌న్ వెల్ల‌డించారు. మ‌రి.. ముందే ఆ తెలివి ఏమైపోయింద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలో ఉన్న ఆయ‌న మాట్లాడుతూ.. తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి క‌లిసి రావాల‌న్నారు. ఒక‌వేళ చంద్ర‌బాబు సిద్ధ‌ప‌డితే రేపు అయినా అవిశ్వాసం పెట్ట‌టానికైనా తాను సిద్ధ‌మ‌న్నారు. హోదా సాధ‌న‌లో త‌మ‌తో క‌లిసి చిత్త‌శుద్ధితో పోరాటం చేయాలాని జ‌గ‌న్ సూచ‌న చేశారు.

నాతో క‌లిసి పోరాటం చేయాల‌ని అడిగే బ‌దులు.. అంద‌రం క‌లిసి పోరాటం చేస్తాం.. విప‌క్షంగా మేం ఎక్క‌డికైనా మీతో వ‌స్తాం.. హోదా వ‌ర‌కూ అంతా ఒక్క‌టేన‌న్న మాట జ‌గ‌న్ నోటి నుంచి వ‌స్తే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. హోదా సాధ‌న విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ జ‌గ‌న్ చేసిన త‌ప్పులు ఇక‌నైనా స‌రి చేసుకుంటే ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి..జ‌గ‌న్ లాంటి నేత చెవికి ఇలాంటి సూచ‌న‌లు త‌ల‌కెక్కుతాయా? అన్న‌దే అస‌లు ప్ర‌శ్న‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు