చంద్రబాబు సంచలన నిర్ణయానికి కారణమైన జైట్లీ ప్రసంగం

చంద్రబాబు సంచలన నిర్ణయానికి కారణమైన జైట్లీ ప్రసంగం

కేంద్రం అదరలేదు, బెదరలేదు.. కనీసం కరగలేదు. చంద్రబాబు ఎంత అరచిగీపెట్టినా ఆర్థిక మంత్రి తన పాత పాడడం మానలేదు.  ఏపీ పట్ల సానుభూతి ఉందంటూ మొసలి కన్నీరు కారుస్తూ ఏమీ ఇవ్వబోమని చెప్పేశారు. అంతేకాదు.. పుండు మీద కారం చల్లినట్లుగా సెంటిమెంట్లను అపహాస్యం చేశారు. సెంటిమెట్లు, రాజకీయ ఆందోళనలకు నిధులు రాలవని విస్పష్టంగా తేల్చేశారు. చంద్రబాబు అడిగినవన్నీ ఇచ్చామన్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు విభజన హామీలపై స్పష్టతకు రెండు రోజుల గడువు ఇచ్చిన విషయాన్ని విలేకరుల ప్రస్తావిస్తే  అది తనకు సంబంధించిన విషయం కాదని చెప్పారు. తెలుగుదేశం ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్నది కదా అని ప్రశ్నిస్తే అది వాళ్లిష్టం అని ముక్తాయించారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తామని రాహుల్ ప్రకటించిన విషయంపై స్పందిస్తూ తాము అధికారంలో ఉన్నామనీ, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని చెప్పారు.

ఇంకా ఆయనేమన్నారంటే..

* ప్రత్యేక హోదా అనేదే ఇప్పుడు లేదు. ఈ రోజు ఉదయం ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం చాలా ఉందని చెప్పగా.. సాయంత్రం జైట్లీ అసలు ప్రత్యేక హోదా అనేదే ఇప్పుడు లేదని స్పష్టం చేశారు.

* ప్రత్యేక హోదాకన్నా అధిక ప్రయోజనాలను కల్పిస్తాం. రెవెన్యూ లోటును పూడ్చాలని మాత్రమే విభజన చట్టంలో ఉంది.

*  ఆందోళనలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

*  ప్రత్యేక హోదా తప్ప.. దానికి సమానంగా కేంద్ర పథకాలకు.. విదేశీ రుణాల చెల్లింపునకు 90-10 నిష్పత్తిలో నిధులు ఇస్తామని జైట్లీ చెప్పారు. దీని ప్రకారం ఇతర రాష్ర్టాలతో పోల్చితే ఏపీకి 30 శాతం మేర నిధుల లబ్ధి చేకూరుతుంది.

* గతంలో ప్రత్యేక హోదా అనేది ఈశాన్య.. మూడు పర్వత ప్రాంత రాష్ర్టాలకు మాత్రమే ఇచ్చారు.

*  ఇతర రాష్ర్టాలకు కేంద్ర పథకాలకు 60 శాతం నిధులను కేంద్రం ఇస్తుండగా ఏపీకి దాన్ని 90 శాతానికి పెంచాం. ప్రత్యేక హోదాతో ఇన్ని నిధులు రావు.

* 14వ ఆర్థిక సంఘం నివేదిక కూడా ఏపీకి ప్రత్యేక హోదా అవసరంలేదని ఉంది.

*  ఏపీ కోసం ఎస్పీవీ వంటి సంస్థలు ఏర్పాటు చేయాలని దానికి 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది. ఇప్పటికే ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.4 వేల కోట్లు చెల్లించాం. మరో 138 కోట్లు చెల్లించాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు