శౌర్యా.. సాయిపల్లవి మాటలు విన్నావా?

శౌర్యా.. సాయిపల్లవి మాటలు విన్నావా?

షూటింగ్ స్పాట్లో తోటి ఆర్టిస్టులతో లేదా టెక్నీషియన్లలో చిన్న చిన్న విభేదాలు రావడం సహజం. అలాంటి విషయాల గురించి మీడియా ముందు మాట్లాడకుంటేనే బెటర్. కానీ నాగశౌర్య మాత్రం ‘కణం’ సినిమాలో తన హీరోయిన్ సాయిపల్లవి పట్ల వ్యతిరేకతను మీడియా ముందు చూపించేశాడు. సాయిపల్లవిపై విమర్శలు గుప్పించాడు.

ఒక టీవీ కార్యక్రమంలో మిమ్మల్ని ఇరిటేట్ చేసిన ఆర్టిస్టు ఎవరంటే సాయిపల్లవి పేరు చెప్పాడు. దీనిపై పెద్ద చర్చే నడిచింది. కొందరు శౌర్య వ్యాఖ్యల్ని తప్పుబడితే.. మరికొందరేమో సాయిపల్లవి ఎంత ఇబ్బంది పెట్టి ఉండకపోతే శౌర్య అలా మాట్లాడతాడని అన్నారు.

కట్ చేస్తే సాయిపల్లవి మాత్రం శౌర్య వ్యాఖ్యల్ని నెగెటివ్‌గా తీసుకోలేదు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా దీనిపై సాయిపల్లవిని ప్రశ్నిస్తే.. తాను ఎవరినీ హర్ట్ చేయాలని అనుకోనని.. శౌర్య వ్యాఖ్యలపై బాధపడుతున్నానని.. అతను చాలా గొప్ప ఆర్టిస్టు అని అంది. శౌర్య మాత్రం సాయిపల్లవితో విభేదాల్ని కారణంగా చూపించి చెన్నైలో జరిగిన ఈ చిత్ర ఆడియో వేడుకకు.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా దూరంగా ఉండిపోయాడు. ఐతే ఇదేమీ మనసులో పెట్టుకోకుండా సాయిపల్లవి శౌర్య గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడటం విశేషం.

శౌర్య గొప్ప నటుడని.. సినిమాలో అతను ఇచ్చిన హావభావాల్ని తాను ఇవ్వలేకపోయానని ఆమె కితాబివ్వడం విశేషం. గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి.. శౌర్య గురించి ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. మొత్తంగా సాయిపల్లవి చాలా హుందాగా వ్యవహరిస్తుంటే.. శౌర్య మాత్రం ఆమెపై ఓపెన్‌గా విమర్శలు గుప్పించడమే కాక సినిమా ప్రమోషన్లకు కూడా రాకుండా సంకుచితంగా వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయం కలుగుతోంది జనాల్లో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు