కేసీఆర్‌కు ఎందుకంత రెస్పాన్సు వచ్చిందంటే..

కేసీఆర్‌కు ఎందుకంత రెస్పాన్సు వచ్చిందంటే..

దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్న బీజేపీ హవా కొనసాగుతోంది. చిన్నచిన్న ప్రతికూలతలు ఎదురవుతున్నా తెలివిగా వాటిని జయిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల పరాభవం తప్ప ఏమాత్రం కోలుకోలేకపోతోంది. అంతేకాదు.. బీజేపీని ఎదిరించడానికి సొంత బలాన్ని, సొంత నాయకత్వాన్ని నమ్ముకోలేకపోతోంది.

బీజేపీని ఎదిరించే దమ్మున్న నేత ఎవరున్నారా అని భూతద్దం పెట్టి వెదుకుతోంది. దీంతో బీజేపీని వ్యతిరేకించే ఇతర పార్టీలు, కాంగ్రెస్ అనుకూల పార్టీలు కూడా కాంగ్రెసే ఏమీ చేయలేనప్పుడు మనమేం చేస్తాం అన్నట్లుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ అనే పిల్లి మెడలో గంట కట్టేదెవరు? అని పార్టీలన్నీ చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం, టీఆరెస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటన దేశంలో మోడువారిన బీజేపీయేతర రాజకీయ పక్షాల ఆశలకు చిగురు తొడిగింది.

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చరిత్ర ఏంటి.. ఆయన బలం ఎంత.. అసలు తెలుగు నేలనే ఆయన రాజకీయ స్టాండ్ ఎన్ని రకాలుగా మారింది.. విశ్వసనీయత ఎంత? వంటివేమీ ఆలోచించకకుండా కొన్ని ఇతర రాష్ట్రాల పార్టీలు ఆయనతో టచ్‌లోకి వస్తున్నాయి.

నిజానికి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయన దేశాన్ని ఉద్దరించేందుకో.. లేదంటే జాతీయ రాజకీయాల్లో వెలగబెట్టాలన్న కోరికతో చేసింది కాదని.. తెలంగాణ రాజకీయాల్లో ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి మెరుగుపడడానికి, అందరి దృష్టినీ ఆకర్షించి తన ఇమేజి పెంచుకుని, జనం ఆశలు పెంచి లబ్ధి పొందే ప్రయత్నమే కానీ అంతకుమించి మరేమీ కాదని తెలుస్తోంది.  

అదే సమయంలో కాంగ్రెస్ సహా ఇతర బీజేపీయేతర పార్టీలన్నీ కూడా అన్ని రకాల అవకాశాలనూ పరీక్షించి చూస్తున్నాయి . ఇప్పటికే కన్హయ్య కుమార్.. జిగ్నేశీ మేవానీ వంటివారిని ప్రయోగించిన విపక్షాలకు, ఇతర పార్టీలకు కేసీఆర్ మాట చెవులకు ఇంపుగా వినిపించింది.

ఇంతమందిని ముందు పెట్టి ప్రయత్నాలు చేశాం.. ఇక కేసీఆర్ ఏమైనా మోదీ మెడలో గంట కడతారేమో గోడ చాటున ఉండి చూద్దాం అన్నట్లుగా పలు పార్టీలున్నాయి. ఆ క్రమంలోనే కేసీఆర్‌ను హీరోలా చూస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు