కేసీఆర్ చెప్పిన ఆ 2 పాయింట్లు.. బ్లాక్ బ‌స్ట‌ర్స్‌!

కేసీఆర్ చెప్పిన ఆ 2 పాయింట్లు.. బ్లాక్ బ‌స్ట‌ర్స్‌!

మాట్లాడేవాడే మొనగాడు. కాబ‌ట్టి కేసీఆర్ మొన‌గాడు. విష‌యం లేకుండా కేసీఆర్ ఎక్క‌డా మాట్లాడడు. విష‌యం దొరికేదాకా మీడియాకు ముందుకు రాడు అని కూడా అనొచ్చు. కేసీఆర్ ఇంత‌వ‌ర‌కు పెట్టిన ప్రెస్ మీట్ల‌లో దాదాపు 90 శాతానికి పైగా హిట్టే. ప్రతి దాంట్లో ఏదో ఒక సంచ‌ల‌నం ఉండే ఉంటుంది. కానీ... నిన్న పెట్టిన ప్రెస్‌మీట్ మోస్ట్ ఇంపార్టెంట్‌. ఎందుకంటే.. మోడీ వ్య‌తిరేకులు దేశంలో చాలా మంది ఉన్నా ప్ర‌జామోదం ఉన్న నాయ‌కులెవ‌రూ మోడీకి పెద్ద‌గా వ్య‌తిరేకంగా లేరు. లౌకిక వాదులు, ర‌చ‌యితలు, వామ‌ప‌క్ష పార్టీలు ఇలాంటి పెద్ద‌గా సంచల‌నం కాని వ్య‌క్తులు వ్య‌తిరేకించ‌డ‌మే గాని జ‌నాల్లో క్రేజు ఉన్న సాలిడ్ రాజ‌కీయ నేత‌లెవ‌రూ ఇంత‌వ‌ర‌కు మోడీని ఏక‌పక్షంగా వ్య‌తిరేకించ‌లేదు. స‌రే ఈ విషయం ప‌క్క‌న పెడితే నిన్న‌టి ప్రెస్ మీట్లో ఎన్నో సంచ‌ల‌నాలు ఉన్నా... ఓ రెండు విష‌యాలపై కేసీఆర్ కామెంట్లు బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచాయి. అవి ఒక‌టి బ్ర‌హ్మ‌పుత్ర‌, రెండు ఏపీకి ప్ర‌త్యేక హోదా.

బ్ర‌హ్మ‌పుత్ర‌..
భార‌త‌దేశం వ్య‌వ‌సాయ దేశం. కానీ క‌ర‌వుతో, పేద‌రికంతో ఎందుకు బాధ‌ప‌డుతోంది. నిజానికి ఇది మ‌నం ఎదుర్కొంటున్న దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌. ప్ర‌కృతి విప‌త్తుల మీద వేసి నేరం త‌ప్పించుకుంటే ఎవ‌డికి లాభం? ఇలాంటి స‌మ‌స్య‌కు తాత్కాలిక ఉప‌శ‌మ‌నాలు క‌లిగించ‌డానికే ఇంత‌కాలం అన్ని పార్టీలు మొగ్గుచూపాయి. అస‌లు ప‌రిష్కారం గురించి మాట్లాడ‌టం కాదు క‌దా, దాని ఆలోచ‌న కూడా ఎవ‌రి మైండ్లో లేదు ఇంత‌వ‌ర‌కు. కానీ కేసీఆర్ ఆ పాయింట్ ను చాలా సీరియ‌స్‌గా ట‌చ్ చేశారు. నిన్న‌టి ప్రెస్‌మీట్లో బ్ర‌హ్మ‌పుత్ర న‌ది ప్ర‌స్తావ‌న తెచ్చిన కేసీఆర్ దానిపై  కొత్త వివ‌ర‌ణ ఇచ్చారు.
*మ‌న దేశంలో మంచి నీటిలో మ‌నం వాడుకుంటున్న‌ది కేవ‌లం 30 శాతమేనట‌. ఇలా చేస్తే కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి. ఉత్తర చైనా నుంచి.. దక్షిణ చైనాకు 2400 కిలోమీటర్లు పొడ‌వునా కాలువ‌లు త‌వ్వి, అవ‌స‌ర‌మైన చోట పైపులు వేసి అంత దూరం 1600 టీఎంసీలు తీసుకెళ్తున్నారు. వాళ్ల‌కంటే నీళ్లు మ‌న‌కు ఎక్కువున్నాయి. ఒక్క బ్రహ్మపుత్ర, గంగా నదిలో కలిపి 40 వేల టీఎంసీలు ఉన్నాయి. బ్ర‌హ్మ‌పుత్ర ప్ర‌పంచ నదుల్లో నీటి ల‌భ్య‌త‌లో ప‌దో స్థానంలో ఉంది. వాటిని వినియోగిస్తే దేశంలో కరువు ఎట్లుంటది? ఎందుకు జరగడం లేదు మరి? తాగునీళ్లు రావు. సాగునీళ్లు రావు. కరెంటు ఉండదు* అంటే కేసీఆర్ ప్ర‌స్తావించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. నిజానికి అస్సాం నుంచి రాజ‌స్తాన్‌కు 2400 కిలోమీట‌ర్లే. అస్సాం నుంచి ఒడిసాకు 1500 కిలోమీట‌ర్లే. బీహార్‌కు కూడా వెయ్యికిలోమీట‌ర్లే. గుజ‌రాత్‌కు 2900 కిలోమీట‌ర్లే. గంగ‌-బ్ర‌హ్మ‌పుత్ర‌ను క‌లిపి ఈ  ప్రాంతాల‌కు నీరిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది.
*విదేశీ మారక నిల్వల్లో ప్రపంచంలోనే చైనా నంబర్‌ వన్‌గా ఎలా నిలబ‌డింది. అదీ ఆసియా ఖండమే. అక్కడ ఉన్నవాళ్లు మనుషులే. ఇదంతా ఎలా సాధ్యమైంది? అవసరమైన చట్టాలు తెచ్చుకున్నారు. అవసరమైన మార్పులు చేసుకున్నారు. 25-30 ఏళ్లలో ఇంత ప్రబలమైన శక్తిగా బలపడ్డారు. మనకు సాధ్యం కాదా? మనం మనుషులం కాదా? మ‌నోళ్లు ఏరోజైనా ఇట్లాంటి ప‌నికొచ్చే చ‌ట్టాల‌పై ఆలోచిస్తారా? రాజ‌కీయ ఆధిప‌త్య ఆలోచ‌న త‌ప్ప ఇంకో ఆలోచ‌నే లేదు మ‌నోళ్ల‌కి 70 ఏండ్ల‌లో ఏం చేశార‌య్యా?* అని కేసీఆర్ ఏకిపారేశారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా..
స‌మకాలీన రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్లు ఎంచుకోవ‌డ‌మే కాదు, వాటిపై క్లారిటీగా మాట్లాడ‌టం కూడా కేసీఆర్‌కు అల‌వాటే. కేంద్రం మూగనోము వ‌ల్ల ఏపీలో పార్టీలు-ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్న తీరు గురించి కేసీఆర్ బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు.  *ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పార్టీలు జనానికి స్పష్టత ఇవ్వరు. కేంద్రంలో ఉన్న వారు కూడా జనానికి స్పష్టత ఇవ్వదు. ఏందండీ ఇది తమాష కాకపోతే ? ఈ దాగుడు మూత‌ల‌కు సూక్ష్మ‌మేంది? ఇదిగో దీనికోసమే భారత రాజకీయాలు మారాలని నేను చెబుతున్నా. ఈ దురదృష్టకరమైన, దిక్కుమాలిన పరిస్థితులు ఉండకూడదనే చెబుతున్నా. ఏం చెప్పినా కుండ బద్దలు కొట్టినట్లు ప్రజలకు చెప్పాలి. దాన్ని అమలు చేయాలి. మోదీగారు అన్నారా ప్రత్యేక హోదా ఇస్తానని. అంటే ఇచ్చి తీరాలి. అనలేదా నేను అనలేదు ఇవ్వను అని చెప్పాలి. రోజూ అక్కడ ప్రజలు ఆవేదన పడుడు. పార్టీలు ఆవేదన పడుడు. ఏందిది? ఇంత గందరగోళం ఏ దేశంలో అయినా ఉంటుందా?* అని కేసీఆర్ మాట్లాడిన తీరు ఏపీ ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా కేసీఆర్‌పై దృష్టిసారించేలా చేసింది. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్స‌య్యింది అని అనుకునే ప‌రిస్థితి.  జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సులో మాటను కేసీఆర్ ప‌ర్‌ఫెక్టుగా అడిగి కేంద్రాన్ని క‌డిగేశార‌ని కేసీఆర్‌కు సోష‌ల్ మీడియాలో అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

ఏది ఏమైనా రాజ‌కీయాల్లో మాట తీరు ఉన్న‌వారికి మిగ‌తా వారి కంటే రెండు ఓట్లు ఎక్కువే ప‌డ‌తాయి. ఆ జాబితాలో కేసీఆర్ ఎపుడూ ముందుంటాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు