డిపాజిట్ కోల్పోయిన చోట ఏకంగా ప‌వ‌ర్‌!

డిపాజిట్ కోల్పోయిన చోట ఏకంగా ప‌వ‌ర్‌!

టార్గెట్ చేసింది మొద‌లు.. సాధించే దాకా వ‌దిలిపెట్ట‌ని ప‌ట్టుద‌లతో ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న దానికి నిలువెత్తు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాలు. క‌మ్యునిస్టుల కంచుకోట‌గా ఉన్న చోట బీజేపీ లాంటి పార్టీ ఏకంగా అధికారాన్ని తెచ్చుకోవ‌టం అంత తేలికైన విష‌యం కాదు. అందునా.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా మ‌చ్చ లేని మాణిక్ స‌ర్కార్ లాంటి నేత ఉన్న‌ప్ప‌టికీ విజ‌యం సాధించారంటే అందుకు కార‌ణంగా.. టార్గెట్ ను ఏదోలా సాధించాల‌న్న ప‌ట్టుద‌లే.

త్రిపుర కోట‌పై కాషాయ‌జెండా ఎగుర‌వేయాల‌న్న త‌ప‌న బీజేపీకి ఎప్ప‌టి నుంచో ఉంది. ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం ద‌క్క‌ని ప‌రిస్థితి. 2013లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త్రిపుర‌లో బీజేపీ మొత్తం 50 స్థానాల‌కు పోటీ చేస్తే.. 49 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా ద‌క్క‌ని దుస్థితి.

అదే స‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో 55 స్థానాల్లో క‌మ్యూనిస్టులు పోటీ చేస్తే ఏకంగా 49 స్థానాల్లో ఘ‌న విజ‌యం సాధించారు. ఇక‌.. కాంగ్రెస్ 48 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్ని సొంతం చేసుకుంది.  ఈశాన్య భార‌తం మీద దృష్టి పెట్టిన బీజేపీ.. అభివృద్ధి మంత్రాన్ని జ‌పించ‌టం.. గ‌త ప్ర‌భుత్వాల త‌ప్పుల్ని భూత‌ద్దంలో పెట్టి చూపించ‌టంతో పాటు.. అమిత్ షా మార్క్ ప్ర‌చారం.. పోల్ మేనేజ్ మెంట్ పుణ్య‌మా అని తాజా ఫ‌లితాలు వెలువ‌డిన‌ట్లు చెబుతున్నారు.

ఐదేళ్ల క్రితం ఎక్క‌డైతే డిపాజిట్లు ద‌క్క‌లేదో.. ఇప్పుడు అక్క‌డ ఏకంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన బ‌లానికి మించిన ప్ర‌జాప్ర‌తినిధులు బీజేపీ త‌ర‌ఫున విజ‌యం సాధించ‌టం గ‌మ‌నార్హం. క‌డ‌ప‌టి స‌మాచారం ప్ర‌కారం 41 స్థానాల్లో బీజేపీకి గెలుపు ప‌క్కా అని చెబుతున్నారు. ఇప్ప‌టికే 15 స్థానాల్లో విజ‌యం సాధించిన‌ట్లుగా అధికారులు ప్ర‌క‌టించ‌గా.. మ‌రో 26 స్థానాల్లో గెలుపు దిశ‌గా అభ్య‌ర్థులు దూసుకెళుతున్నారు. ఇక‌.. అధికార వామ‌ప‌క్షాల ప‌రిస్థితి దారుణంగా మారింది. వామ‌ప‌క్షాలు 13 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉండ‌గా.. మ‌రో 5 స్థానాల్లో విజ‌యం సాధించిన‌ట్లుగా అధికారులు ప్ర‌క‌టించారు. మిగిలిన పార్టీలేవీ సోదిలో లేకుండా పోవ‌టం గ‌మ‌నార్హం.

మార్పు.. అభివృద్ధి అన్న నినాదంతో ప్ర‌చారం చేసిన బీజేపీకి త్రిపుర ప్ర‌జ‌లు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. మొత్తం 59 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా..  ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన దాని కంటే ఎక్కువమంది ఎమ్మెల్యేల్ని బీజేపీకి త్రిపుర ప్ర‌జ‌లు అందించారు. మరి..వారు ఆశించిన అభివృద్ధి.. మార్పు ఎంత‌లా వ‌స్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు