విజయ్ మాల్యా.. నీరవ్ మోదీ.. రాహుల్ గాంధీ

విజయ్ మాల్యా.. నీరవ్ మోదీ.. రాహుల్ గాంధీ

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మొన్న రెండు సిటింగు స్థానాలను గెలవగానే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినంత హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఈశాన్యాన మూడు రాష్ట్రాల ఫలితాలు వచ్చి... రెండు చోట్ల కాంగ్రెస్ బోణీ కూడా చేయని సమయంలో దేశంలో లేకుండా పోయారు. ఫలితాలు ఇలా ఉంటాయని తెలిసే ఆయన పలాయనం చిత్తగించారన్న విమర్శలు వస్తున్నాయి.

హోలీ సందర్భంగా ఇటలీలో ఉన్న తన అమ్మమ్మతో గడపడానికి వెళ్తున్నానంటూ రాహుల్ గాంధీ మొన్నే విమానమెక్కేసిన సంగతి తెలిసిందే. ఓటమి సమయంలో మీడియాకు ముఖం చూపించుకోలేక, సీనియర్ నేతలకు సమాధానం చెప్పుకోలేక, తన నాయకత్వ వైఫల్యాలను అంగీకరించలేక ఇలా దేశం దాటిపోయారన్న విమర్శలు వస్తున్నాయి.

ఇప్పుడే కాదు, ఆయన అధ్యక్షుడు కాకముందు, ఉపాధ్యక్షుడిగా ఉంటూ అధ్యక్ష పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నప్పుడు కూడా పార్టీ పరంగా కీలక సందర్భాల్లో... పార్లమెంటులో కీలక సమయాల్లో కూడా ఆయన పలాయనవాదాన్నే ఎంచుకున్నారు.

గత ఏడాది జులైలో కాంగ్రెస్ పార్టీ 130వ వార్షికోత్సవం నిర్వహించుకుని రివ్యూ చేసుకున్నప్పుడూ ఆయన ఇటలీలోనే ఉన్నారు. అంతేకాదు... రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కాంగ్రెస్ పై ఆశలు పెంచుకుని ఏమైనా చేద్దామని ఆలోచిస్తున్న సమయంలోనూ ఆయన దేశంలో లేరు.

అంతకుముందు 2014లో మోదీ అద్భుత విజయం సాధించి కాంగ్రెస్‌ను చావచితగ్గొట్టి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ సమయంలోనూ రాహుల్ గాంధీ పార్లమెంటుకు ఆబ్సెంటయ్యారు. ఆ సమయంలో ఆయన సుమారు 50 రోజులకు పైగా విదేశాల్లో గడిపి రెండు బడ్జెట్ సెషన్లకూ హాజరుకాలేదు.

దీంతో బ్యాంకులను ముంచి దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీల్లానే రాహుల్ కూడా నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని ముంచి... కాంగ్రెస్ నాయకత్వంపై ఆశలు పెట్టుకున్న చిన్నాచితకా బీజేపీ వ్యతిరేక పార్టీల నమ్మకాన్ని వమ్ము చేసి కీలక సమయాల్లో పలాయనం చిత్తగించి నాయకులకు, మీడియాకు దొరక్కుండా దాక్కుంటున్నారన్న సెటైర్లు పడుతున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు