న‌న్ను బ‌చ్చా అంటే తేడా వ‌చ్చేస్తుంది

న‌న్ను బ‌చ్చా అంటే తేడా వ‌చ్చేస్తుంది

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ శాఖ‌మంత్రి కేటీఆర్ త‌న దూకుడు ఏ మాత్రం త‌గ్గించుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. విప‌క్షాల‌పై ఇటీవ‌ల గ‌తం కంటే ఎక్కువ‌గా విరుచుకుప‌డుతున్న కేటీఆర్ తాజాగా న‌ల్ల‌గొండ ప‌ర్య‌ట‌న‌లో కాంగ్రెస్ నేత‌ల‌పై మండిప‌డిన తీరు వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే.

ఆలీబాబా న‌ల‌భై దొంగ‌లు యాత్ర‌కు బ‌య‌ల్దేరారు అంటూ కాంగ్రెస్ టూర్‌ను ఎద్దేవా చేశారు. దీనిపై విప‌క్ష కాంగ్రెస్ కూడా స్పందించింది. సీఎల్పీ నేత జానారెడ్డి ఓ అడుగు ముందుకు వేసి కేటీఆర్ స్థాయికి దిగ‌జారి తాను మాట్లాడ‌లేనంటూ తేల్చిచెప్పారు. మిగ‌తా కాంగ్రెస్ నాయ‌కులు సైతం కేటీఆర్‌పై మండిప‌డ్డారు.

త‌న‌పై ఎదురుదాడి జ‌రుగుతున్న నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. స‌చివాలయంలో శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలతో మమేకమయ్యేందుకు చేస్తున్న జిల్లాల పర్యటనతో.. విపక్షాలకు ఏమిచెయ్యాలో తోచడంలేదని మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు. అందుకే విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు.

`ఇన్ని రోజులూ ఇదే విపక్షనేతలు ముఖ్యమంత్రి జిల్లాలు తిరుగడం లేదన్నారు. ఇప్పుడు సీఎం జిల్లాల పర్యటనలు చేస్తుంటే ఏమిచేయాలో వారికి అర్థంకావడం లేదు. అందుకే విమర్శిస్తున్నారు` అని పేర్కొన్నారు. `విపక్షనేతలు ఎన్నికల వాతావరణంలోకి వెళ్లారు. మేమూ అదే ధోరణిలో ఉంటే తప్పా? అని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. సూట్ వేసుకుంటే అమెరికా భాషంటారు. ప్రజల భాషలో మాట్లాడితే తప్పంటున్నారు. కాంగ్రెస్ నేతల గురించి నేను పూర్తి వాస్తవాలే మాట్లాడాను. ఉన్నమాటే అంటే అంత ఉలుకెందుకు? ఇంకోమారు బచ్చా అంటే ఏ సమాధానం చెప్తానో చూడండి` అని మంత్రి కేటీఆర్ త‌న‌దైన శైలిలో హెచ్చరిక‌లు జారీచేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు