కిరణ్ దారెటు..?

కిరణ్ దారెటు..?

రాష్ట్ర విభజన వ్యవహారంలో సీమాంధ్రుల వైపు నిలబడి మాట్లాడిన నేతల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందుంటారు. అంత పెద్ద కాంగ్రెస్ అధినేత్రిని సైతం ఎదిరించేందుకు సిద్ధపడ్డారు. తన సమైక్యవాదాన్ని నిర్మోహమాటంగా బయటపెట్టి ఆమె అగ్రహానికి గురయ్యారు. సోనియాగాంధీ కిరణ్ ను ఎంతగా ద్వేషిస్తున్నారంటే.. ఆమె కిరణ్ పేరును తన వద్ద ప్రస్తావించటాన్ని కూడా సహించటం లేదు. ఎపీ ముఖ్యమంత్రి.. సీఎం.. కిరణ్ అన్న మాటలేవీ ఆమె దగ్గర చర్చకు వచ్చి చాలాకాలమే అయ్యిందని చెప్పాలి. అధినేత్రి మనసు తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు సైతం యధా రాజా అన్నట్లు ప్రవర్తించటం మొదలుపెట్టారు.

దేవతలా కొలిచిన అమ్మతో ఇంత వైరం పెట్టుకున్న ముఖ్యమంత్రి కిరణ్ ఏం కోరుకుంటున్నారు. కలలో కూడా ఊహించని పదవినిచ్చి సత్కరించిన అధినేత్రికి ఆయన తిరుగుబాటు బహుమానంగా ఇవ్వటం సముచితమేనా అన్న చర్చ కాంగ్రెస్ లో ఓ పక్క భారీగానే సాగుతోంది. అసలు ఆయన ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కిరణ్ కు రాష్ట్రం విడిపోవటం సుతారమూ ఇష్టం లేదు. అందునా తన హయాంలో ఆ ప్రక్రియ జరగటాన్ని ఏమాత్రం ఆయన ఇష్టపడటం లేదు. చరిత్రలో తెలుగుజాతి ముక్కలవ్వటంలో తాను భాగస్వామ్యం అవుతున్నాన్న భావననే ఆయన ఇష్టం పడటం లేదు. మరి విభజన వ్యవహారంలో ఇంత పట్టుదలగా ఉన్న కిరణ్ ఏం కోరుకుంటన్నారు? విభజన జరిగాక మిగిలిన ముక్కకు ముఖ్యమంత్రి కావాలన్నదే ఆయన అంతిమ లక్ష్యమా అంటే కాదనే చెప్పాలి.

రాష్ట్ర విభజన జరగటానికి వీల్లేదన్న సింగిల్ అజెండానే ఆయనకు ఉందని చెబుతారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటంపై ఆయన అంత ఆసక్తి చూపించటం లేదు. ఆయన సన్నిహితులు పార్టీ పెట్టాలని పోరు పెడుతున్నా.. తన ఇమేజ్ దానికి సరిపోదన్న విషయం ఆయనకు తెలుసు. దానికి తోడు ఇప్పటివరకూ పెద్దగా సాయపడని ఆయనకు.. పార్టీ పెట్టేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించే వారు ఎవరన్నది ఒక ప్రశ్న అయితే.. అందుకు సిద్ధంగా కొంతమంది ఉన్నా.. ఆయన ఇష్టపడటం లేదు. రేపొద్దున వారందరికీ పనులు చేసి పెట్టాల్సి రావటమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

దీనికి తోడు.. ఈ మధ్య కిరణ్ సన్నిహితులు చేపట్టిన సర్వే కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవటం ముఖ్యమంత్రి వర్గీయుల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. సమైక్యం మీద ఇంత గొంతు చించుకున్నా.. తనను సమైక్య చిరుతగా గుర్తించేవారు లేకపోవటాన్ని కిరణ్ బాధ పడుతున్నా.. మరోవైపు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. తనపై కొత్త పార్టీ పెట్టాలన్న ఒత్తిడిని తాజా సర్వే తగ్గిస్తుందని భావిస్తున్నారు. మరి మీ తర్వాతి స్టెప్ ఏమిటి అంటే.. ప్రస్తుతానికి కాలంతో నడవటం మాత్రమే అంటూ తన సన్నిహితుల వద్ద ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చాలా వరకు మింగుడుపడని విధంగా తయారయ్యాయని చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు