కొత్త వివాదం: పాలివ్వ‌టానికి సిగ్గొద్దు!

కొత్త వివాదం:  పాలివ్వ‌టానికి సిగ్గొద్దు!

సున్నిత‌మైన అంశాల్ని ఎంత సున్నితంగా చెబితే అంత మంచిది. నిజ‌మే.. స‌మాజంలో అంద‌రూ ఒకేలా ఉండ‌రు. ఒక్కొక్క‌రు ఒక్కోలా ఉంటారు. సామాజిక‌.. ఆర్థిక నేప‌థ్యాల న‌డుమ జీవ‌శైలిలో మార్పులు ఉంటాయి. కొన్ని మూఢ న‌మ్మ‌కాల విష‌యంలో స‌మాజాన్ని మార్చాల‌నుకోవ‌టం.. అపోహ‌ల్ని తొల‌గించాల‌ని భావించ‌టం త‌ప్పేం కాదు. కానీ.. ఆ పేరుతో అన‌వ‌స‌ర‌మైన సంచ‌ల‌నాల‌కుతెర తీయ‌టం స‌రైంది కాదు.

ఇప్పుడున్న వివాదాలు స‌రిపోవ‌న్న‌ట్లుగా ఇప్పుడో మ‌రో వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది. ప‌సిబిడ్డ‌ల‌కు పాలు ఇచ్చే విష‌యంలో సిగ్గు ప‌డ‌టం ఎందుకు? బ‌హిరంగంగా చ‌నుబాలు ఇస్తే త‌ప్పేంటి?   లాంటి ప్ర‌శ్న‌ల‌తో పాటు.. న‌లుగురిలో పిల్ల‌ల‌కు పాలు ఇస్తే.. పాలు త‌గ్గిపోతాయ‌న్న మూఢ‌న‌మ్మ‌కంపై ఫైట్ చేసేందుకు మ‌ల‌యాళ ప‌త్రిక ఒక‌టి మొద‌లెట్టిన ప్ర‌చారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

పిల్ల‌ల‌కు పాలు ఇవ్వ‌టాన్ని లైంగిక కోణం నుంచి ఎందుకు చూస్తార‌న్న మంచి ఉద్దేశంతో ప్ర‌శ్న వేసినా.. స‌మాజంలో అంద‌రూ ఒక‌లా ఉంటార‌న్న బేసిక్ పాయింట్ ను మ‌ర్చిపోవ‌టం ఒక ఇబ్బంది అయితే.. తాను ప్ర‌చారం చేయాల‌నుకున్న అంశంపై స‌ద‌రు మీడియా సంస్థ వేసిన ఫోటో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

బిడ్డ నోటికి చ‌నుబాలు అందించి.. చిరున‌వ్వుతో గ‌ర్వంగా కెమెరాను చూస్తున్న త‌ల్లిగా.. సినీ న‌టి.. ర‌చ‌యిత్రి గిలు జోసెఫ్ ను క‌వ‌ర్ పేజీ మీద వేయ‌టం ఒక క‌ల‌క‌ల‌మైతే.. ఇంకా పెళ్లి కాని గిలు ఫోటోను క‌వ‌ర్ పేజ్ మీద వేయ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్నను ప‌లువురు సంధిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బ‌హిరంగంగా పిల్ల‌ల‌కు పాలు ఇవ్వ‌టం త‌ప్ప లేద‌న్న అవ‌గాహ‌న కోస‌మే తాము ఫోటో వేసిన‌ట్లుగా స‌ద‌రు మ్యాగ్ జైన్ వివ‌ర‌ణ ఇస్తోంది.ఉద్దేశం మంచిదే అయిన‌ప్పడు.. గ్లామ‌ర్ కోసం పాకులాడ‌కుండా.. ఒక వాస్త‌విక ఫోటోను ఎందుకు ప‌బ్లిష్ చేయ‌ర‌న్న ప్ర‌శ్న‌ను చూస్తే విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు. ఇప్పుడున్న వివాదాలు స‌రిపోవ‌న్న‌ట్లుగా తెర మీద‌కు వ‌చ్చిన ఈ కొత్త వివాదం మ‌రెన్నాళ్లు సాగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు