ఒక్క ప్ర‌క‌ట‌న‌తో కేసీఆర్ కుటుంబం ఉక్కిరిబిక్కిరి

 ఒక్క ప్ర‌క‌ట‌న‌తో కేసీఆర్ కుటుంబం  ఉక్కిరిబిక్కిరి

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో కొత్త ఒత్తిడి మొద‌లైంది. పార్టీ నేత‌లు సంద‌డి అని చెప్తున్న‌ప్ప‌టికీ....ఇది స్ప‌ష్ట‌మైన ఒత్తిడిన అని ఆ పార్టీ నేత‌లే అంటున్నారు. టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక్క ప్ర‌క‌ట‌న ఆ కుటుంబం అంద‌రినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంద‌ని అంటున్నారు. ఇదంతా రాజ్య‌స‌భ సీట్ల గురించి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యుల సీట్లు భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆ సీట్ల భ‌ర్తీకి టీఆర్ఎస్‌లోని నేత‌లు త‌మ‌దైన శైలిలో ఒత్తిడి చేస్తున్నారు.

పెద్దల స‌భ‌ సీట్ల భ‌ర్తీలో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ త‌నదైన శైలిని ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అన్ని మతాలు, కులాల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తాన‌ని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గొల్ల కురుమ‌లు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, రెడ్డిల‌కు ఈ ద‌ఫా చాన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించారు. దీంతో ఎవరికివారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా గొల్ల కురుమల నుంచి రాజ్యసభ సీటును ఆశిస్తున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. యాదవుల్లో పలువురు వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు రాజ్యసభ సీటును దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ అధినాయకత్వాన్ని, సీఎం కేసీఆర్‌ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరు ముఖ్యమంత్రిని కలిస్తే, మరొకరు మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవితను, మంత్రి హరీశ్‌రావును, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలుస్తున్నారు. దీంతో ఆయా నేత‌ల‌పై సానుకూల ఒత్తిడి మొద‌లైంద‌ని అంటున్నారు.

టీఆర్ఎస్‌కు మూడు రాజ్య‌స‌భ స్థానాలు ఖాయంగా ద‌క్కుతుండ‌టంతో రాజ్యసభ సీటు కోసం తెలంగాణ రాష్ట్ర స‌మితిలో పోటీ పెరిగింది. దీంతో నాయ‌కులు త‌మ‌దైన శైలిలో కేసీఆర్ సహా ఆయ‌న కుటుంబ స‌భ్యులను ఆశ్ర‌యిస్తూ టికెట్ ప్ర‌య‌త్నం చేస్తున్నారని అంటున్నారు. యాద‌వ సామాజికవ‌ర్గానికి ఖాయంగా కేటాయించే దానితో పాటు మరో రెండు స్థానాల కోసం కూడా పోటీ ఎక్కువగా ఉంది. టీన్యూస్‌ ఎండీ సంతోష్‌కుమార్‌, మంత్రి నాయిని నర్సింహారెడ్డిలకే కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ....ప‌లువురు నేత‌లు త‌మ ప్ర‌య‌త్నం ఆప‌డం లేద‌ని...పార్టీ పెద్ద‌ల‌ను ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌ను ఆశ్ర‌యిస్తున్నార‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English