అచ్చూ బాబు ఫార్ములానే తెర‌మీద‌కు తెస్తున్న కేసీఆర్‌

అచ్చూ బాబు ఫార్ములానే తెర‌మీద‌కు తెస్తున్న కేసీఆర్‌

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గ‌త కొద్దికాలం కింద తీసుకున్న అనూహ్య నిర్ణ‌యం ఒక‌టి గుర్తుండే ఉంటుంది. కొత్త నిర్ణ‌యం అని టీడీపీ నేత‌లు చెప్తుండ‌గా...ఇందులో అనేక మ‌త‌ల‌బులు ఉన్నాయని విప‌క్షం విమ‌ర్శించింది. ఇంత‌కీ ఆ నిర్ణ‌యం ఏంటంటే... రైతుల‌ను విదేశాల‌కు తీసుకువెళ్ల‌డం. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో కొంద‌రిని చంద్ర‌బాబు విదేశాల‌కు తీసుకువెళ్లారు. వారికి సింగ‌పూర్‌లో ప‌ర్య‌టించే చాన్స్ ఇప్పించారు చంద్ర‌బాబు. అయితే ఇప్పుడు బాబు ఫార్ములాను ఆయ‌న జూనియ‌ర్ అయిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అమ‌ల్లో పెడుతున్నారు.

రైతు స‌మ‌న్వయ స‌మితి పేరుతో సీఎం కేసీఆర్ మండ‌ల‌, జిల్లా, రాష్ట్ర స్థాయి వేదిక‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. రైతుల‌కు మేలు చేసేందుకు ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేసేందుకు, పంట‌ల విష‌యంలో మార్గ‌ద‌ర్శ‌కానికి కేసీఆర్ ఈ స‌మితుల‌ను తీర్చిదిద్దారు. ఇప్పుడు వీరికి విదేశీ ప‌ర్య‌ట‌న ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఇదే విష‌యాన్ని తాజాగా ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఏ సందర్భంలోనైనా ఎలాంటి సాయమైనా అందించడంలో తన ప్రత్యేకతను సీఎం కేసీఆర్ మరోసారి చాటుకున్నారు. రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సు సందర్భంగా ఓ రైతు కష్టాన్ని తీర్చిన సీఎం.. ఆ రైతు బిడ్డ విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ప్రకటించారు. అంతేకాదు రైతులు విదేశాల్లోని పంట‌ల తీరును తెలుసుకునేందుకు అక్క‌డ ప‌ర్య‌టించాల‌ని, ఇజ్రాయిల్ ప‌ర్య‌ట‌న‌కు ద‌శ‌ల వారీగా రైతుల‌ను తీసుకువెళ‌తాన‌ని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రైతుల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. `లక్షా 61వేల రైతు సమన్వయ సమితుల సైన్యమే రైతాంగ దుఖం తీర్చాలి. వారిని తీరానికి చేర్చే నావకావాలి. దిక్సూచి కావాలి. రైతు సమన్వయ సమితుల్లో పైరవీలకు ఆస్కారం ఉండొద్దు. చెక్కుల పంపిణీ వద్ద మీరుండాలి. రైతు సమితులతో స్థానిక సమితులు నిర్వీర్యమవుతాయని ఎవరో పేపర్ల రాసిండు. మనం ఏమైనా పంచాయతీ ఆఫీసులో కూర్చుంటామా? చెట్లు, చెలకలు పట్టుకొని తిరిగే మన పని పంచాయతీ వాళ్లు చేస్తారా? గొడ్డలిపెట్టు అని మాట్లాడుతున్నారు. రాజకీయం చేస్తున్నారు. దిక్కుదివాణం లేని రైతులను ఆర్గనైజ్ చేసి వారికి శక్తి ఇద్దామంటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు.` అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు