ఇయ‌ర్ ఫోన్స్ తో డ్రైవింగా? జైలు ప‌క్కా బాస్‌!

ఇయ‌ర్ ఫోన్స్ తో డ్రైవింగా?  జైలు ప‌క్కా బాస్‌!

చెవి ద‌గ్గ‌ర సెల్ పెట్టుకొని డ్రైవ్ చేయ‌టం నేర‌మ‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అలానే హియ‌ర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని డ్రైవ్ చేసినా అంతే నేర‌మే కాదు.. ఒక రోజు జైలుశిక్ష‌కు ఛాన్స్ ఉంద‌న్న విష‌యాన్ని తెలుసుకుంటే మంచిది. చ‌ట్టం ప్ర‌కారం హియ‌ర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవ్ చేయ‌టం నేరం. అయితే.. దీనిపై అవ‌గాహ‌న అంతంతే.

హియ‌ర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేయ‌టం వ‌ల్ల యాక్సిడెంట్లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ఇయ‌ర్ ఫోన్ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కూ డ్రంకెన్ డ్రైవ్ మీద వారాంతంలో డ్రైవ్ పెట్టే మాదిరి.. ఇటీవ‌ల హియ‌ర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవ్ చేసే వారు.. సెల్ మాట్లాడుతూ బండి న‌డిపే వారితో పాటు.. బండ్ల మీద పోలీస్‌.. ప్రెస్ అంటూ త‌మ‌కు అర్హ‌త లేకున్నా స్టిక్క‌ర్లు రాసుకొని వెళ్లే వాహ‌నాల్ని త‌నిఖీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ప‌లువురిపై కేసులు న‌మోదు చేశారు. ఈ త‌ర‌హా డ్రైవ్ కొత్త కావ‌టంతో హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసుల్లో ప‌లువురు షాక్ కు గుర‌య్యారు.
ఇయ‌ర్ ఫోన్లు వాడినా.. వాడ‌కున్నా.. చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకున్నారంటూ కేసులు న‌మోదు చేశార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. ఇలా కేసులు న‌మోదు చేసిన హైద‌రాబాద్ పోలీసులు ప‌లువురిని కోర్టుకు త‌ర‌లించారు.  ఇయ‌ర్ ఫోన్స్.. సెల్ డ్రైవింగ్‌.. అక్ర‌మ స్టిక్క‌ర్లే ల‌క్ష్యంగా నిర్వ‌హించిన డ్రైవ్ లో 19 మందిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. వారిలో ప‌ది మంది శుక్ర‌వారం కోర్టు ముందు హాజ‌రు కాగా.. వారిలో ప‌ది మందికి ఒక రోజు జైలు విధించ‌టంతో వారు షాక్ కు గుర‌య్యారు.

హియ‌ర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని బండి న‌డ‌ప‌టం చ‌ట్ట‌ప్ర‌కారం త‌ప్పే అయినా.. దానిపై అవ‌గాహ‌న లేక‌పోవ‌టంతో ఆ త‌ప్పు చేశామ‌ని.. దానికే ఒక‌రోజు జైలు శిక్ష విధిస్తారా? అని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. పోలీసులు కేసులు కట్టి కోర్టు వ‌ద్ద‌కు వెళ్లి చ‌లానా క‌డితే స‌రిపోతుంద‌న్న మాట‌తో కోర్టుకు వెళ్లిన వారికి.. అక్క‌డి కోర్టులు ఒక రోజు జైలు విధించ‌టంతో షాక్ తిన్నారు. కొంద‌రు ఉద్యోగులైతే భ‌యంతో వ‌ణికిపోయారు. ఒక రోజు జైలు అన్న కోర్టు తీర్పు త‌న కెరీర్‌.. త‌మ విదేశీ ప్ర‌యాణాల‌కు ముప్పుగా మారుతుందా? అన్న ప్ర‌శ్న‌ల‌తో వారు తీవ్ర నిరాశ‌.. నిస్పృహ‌కు గురి అయ్యారు. చిన్న‌పాటి త‌ప్పిదాల‌కు జైలు చూడాల్సిన దుస్థితి వ‌చ్చిందంటూ ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేయ‌టం క‌నిపించింది.

చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు అమ‌లు చేయాల‌నుకుంటే.. ముందుగా ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన త‌ర్వాత శిక్ష‌లు వేస్తే బాగుండేద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేశారు. ఏది ఏమైనా.. హియ‌ర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవ్ చేసే అల‌వాటుఉంటే మాత్రం వెంట‌నే ఆ అల‌వాటును మార్చెకోవ‌టం మంచిది. లేదంటే హైద‌రాబాద్ సిటీ పోలీసులు ఏ క్ష‌ణంలో అయినా మీ మీద కేసు న‌మోదు చేసే అవ‌కాశం ఉంది. అంతేనా.. ఒక రోజు జైలు ప‌డే ప్ర‌మాదం ఉంది సుమా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు