కాంగ్రెస్ ఆహ్వానించినా..పార్టీ మార‌నంటున్న బాబు ఆప్తుడు

కాంగ్రెస్ ఆహ్వానించినా..పార్టీ మార‌నంటున్న బాబు ఆప్తుడు

తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి చేసిన ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి ఆయ‌న ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చారు. `రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మైతే సంతోషం. నాకంటే ఆయ‌న్ను స‌మ‌ర్థుడిగా భావించి ఒక‌వేళ ఆయ‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి న‌న్ను ప‌క్క‌న‌పెట్టినా నాకేం ఇబ్బంది లేదు` అంటూ సంచ‌ల‌న ఓపెన్ ఆఫర్ ఇచ్చారు చిన్నారెడ్డి. ఇది మీడియాలో హైలెట్ అయింది. అయితే తాజాగా దీనిపై రావుల స్పందించారు.

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీఅధినేత నారా చంద్ర‌బాబునాయుడు స‌న్నిహితుడనే పేరున్న రావుల పార్టీ మారడం ఆయ‌నకు ఇబ్బందిక‌ర‌మనే విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి. ఇప్ప‌టికే తెలంగాణ‌లో అడ్ర‌స్ గ‌ల్లంత‌యి పార్టీ శ్రేణులు ఏ మాత్రం భ‌విష్య‌త్‌పై భ‌రోసా లేని స్థితిలో బాబు న‌మ్మిన‌బంటు పార్టీకి గుడ్ బై చెప్తే ప‌రిస్థితి ఏమిట‌ని ప‌లువురు చ‌ర్చించుకున్నారు. ఈ నేప‌థ్యంలో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వనపర్తి శాసనసభ్యులు నేను కాంగ్రెస్‌లో వస్తే స్వాగతిస్తామని చెప్పినట్లు పత్రికలో వచ్చిందని కానీ అది జ‌రిగేది కాద‌ని రావుల స్పందించారు. తాను పార్టీ మారేది ప్ర‌చార‌మేన‌ని కొట్టి పారేశారు.

`1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి పార్టీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తిని. తెలుగుదేశం పార్టీలో జీవితకాల సభ్యుడిని. పదవుల కోసమో..పనుల కోసమో..పార్టీ మారాల్సిన దుస్థితి నాకు లేదు` అని టీడీపీ సీనియ‌ర్ తేల్చిచెప్పారు. ` అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన‌ కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్‌ ఆపితే మంచిది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకరావడానికి కంకణబద్దమై పనిచేస్తాం. పార్టీ మారాల్సిన అవసరం గానీ, అగత్యంగానీ నాకు లేదు.` అని ఆయ‌న వివ‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు