జ‌గ‌న్ అండ్ కోకు రూల్స్ చెబుతున్న పిల్ల‌లు

జ‌గ‌న్ అండ్ కోకు రూల్స్ చెబుతున్న పిల్ల‌లు

శోచనీయం అనే మాట‌ను రాజ‌కీయాల్లో త‌ర‌చూ వింటుంటాం. చాలా సంద‌ర్భాల్లో అవ‌స‌రం లేకున్నా.. ఈ ప‌దాన్ని నేత‌లు ఉప‌యోగిస్తుంటారు. తాజాగా జ‌న‌సేన విద్యార్థి విభాగం పెట్టిన ట్విట్ట‌ర్ పోస్టుల్ని చూసిన‌ప్పుడు.. ఏపీ విప‌క్ష‌మైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఈ ప‌దానికి అతికిన‌ట్లుగా స‌రిపోతుంద‌ని చెప్పాలి.  జ‌గ‌న్ పార్టీ రాజ‌కీయాలు మొద‌లెట్టి చాలాకాల‌మే అవుతోంది. ఆ పార్టీ అధినేత మొద‌లుకొని.. నేత‌ల వ‌ర‌కూ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా అధికార‌ప‌క్షం నుంచి త‌ర‌చూ రూల్ పొజిష‌న్ చెప్పించుకోవ‌టం క‌నిపిస్తుంటుంది.

స‌భ ఎలా జ‌ర‌గాలి? స‌భ‌లో రూల్ పొజిష‌న్ ఏమిట‌న్న విష‌యంపై త‌ర‌చూ వాద‌న‌లు జ‌ర‌గ‌టం.. అందులో ఏపీ అధికార‌ప‌క్షం పైచేయిగా ఉండ‌టం.. ఇప్ప‌టికీ జ‌గ‌న్ పార్టీకి రూల్స్ తెలీవా? అవ‌గాహ‌న లేదా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతుంటాయి. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి రాజ‌కీయాల్లో ఉన్నారు కాబ‌ట్టి ఏపీ టీడీపీ నేత‌లు రూల్స్ విష‌యంలో ప‌ట్టు ఉంద‌నుకోవ‌టం ఓకే.

కానీ.. సార్వ‌త్రిక ఎన్నిక‌లకు కాస్త ముందుగా పార్టీ పెట్టి.. స‌రైన నిర్మాణం జ‌ర‌గ‌ని జ‌న‌సేన పార్టీ సైతం జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కు రూల్ పొజిష‌న్ గురించి చెప్ప‌టం.. అవిశ్వాసంపై ఆ పార్టీ విద్యార్థి విభాగం పీకుతున్న క్లాస్ చూస్తే.. అయ్యో జ‌గ‌నా? అనిపించ‌టం ఖాయం. నిన్న కాక మొన్న మొద‌లైన జ‌న‌సేన విద్యార్థి విభాగం నుంచి జ‌గ‌న్ పార్టీ పాఠాలు నేర్చుకోవాల్సి రావ‌టం చూస్తే.. ఆ పార్టీ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా.. అడ్డ బ్యాటింగ్  చేసిన‌ట్లుగా మాట్లాడే వైఎస్ జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కు తాజాగా జ‌న‌సేన విద్యార్థి విభాగం విడుద‌ల చేసిన ఘాటు లేఖ‌ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. మోడీ స‌ర్కారు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో ఏపీకి ఎంత భారీగా న‌ష్టం వాటిల్లిందో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉండ‌టం.. మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని జ‌గ‌న్ పార్టీ ప్ర‌క‌టించ‌టం లాంటి ప‌రిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి.

ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చి.. జ‌గ‌న్ పార్టీ చెబుతున్న‌ట్లు అవిశ్వాస తీర్మానాన్ని లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టాల‌ని.. వారికి అవ‌స‌ర‌మైన ఎంపీల మ‌ద్ద‌తును తాను కూడ‌గ‌డ‌తాన‌ని.. అవిశ్వాస తీర్మానం పెట్ట‌టానికి ఒక రోజు ముందే తాను ఢిల్లీకి వ‌చ్చి వివిధ పార్టీల‌తో మంత‌నాలు జ‌రుపుతాన‌ని.. త‌క్కువ‌లో త‌క్కువ 60కి త‌గ్గ‌కుండా ఎంపీల మ‌ద్ద‌తు తీసుకుంటాన‌ని మాట్లాడ‌టం సామాన్య‌మైన విష‌యం కాదు.

ఇలాంటి వేళ‌.. ప‌వ‌న్ చెప్పిన డేట్‌కు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాల‌న్న మొండిత‌న‌మో.. మ‌రింకేమైనా కార‌ణ‌మో కానీ.. జ‌గ‌న్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి రాంబాబు తెర మీద‌కు వ‌చ్చి తాము మార్చి 21న అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్లుగా చెప్పారు. లోక్ స‌భ స‌మావేశాలు మార్చి 5న ప్రారంభ‌మ‌వుతున్న వేళ‌.. ఆ రోజు కాకుండా మార్చి 21 పెట్టాల్సిన అవ‌స‌రం ఏమిటంటూ ప్ర‌శ్న‌ల‌తో పాటు.. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప‌లు రూల్ పొజిష‌న్ల‌ను ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశారు.

జ‌న‌సేన విద్యార్థి విభాగం ట్వీట్ చేసిన ట్వీట్ల‌లో కీల‌క అంశాలు చూస్తే.. అవిశ్వాస తీర్మానం పెట్ట‌టానికి ఉండే రూల్ పొజిష‌న్ తో పాటు.. తాము కోరిన‌ట్లు మార్చి 5నే ఎందుకు పెట్టాలో చెప్ప‌టం క‌నిపిస్తుంది. ఇదంతా చూసిన‌ప్పుడు.. పార్టీ నిర్మాణ‌మే పూర్తి కాని పార్టీ చేత జ‌గ‌న్ పార్టీ పాఠాలు నేర్చుకోవ‌టానికి మించిన ఇబ్బందిక‌ర ప‌రిస్థితి మ‌రొక‌టి ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇంత‌కీ జ‌న‌సేన విద్యార్థి విభాగం ఏం చెప్పింది? అన్న‌ది చూస్తే..

+ అవిశ్వాసంపై ప‌వ‌న్ చెప్పింది త‌ప్పు అని.. రూల్ పొజిష‌న్ చూసుకోవాల‌ని చెబుతున్నామ‌ని.. అవిశ్వాసం అన్న మాట రాజ్యంగంలో లేద‌ని.. అది పార్ల‌మెంట‌రీ ప్రొసీజ‌ర్ లో భాగ‌మ‌ని.. పార్ల‌మెంట‌రీ ప్రొసీజ‌ర్ లోని మోష‌న్స్ లో ఉంటుంద‌ని త‌మ‌రు చెప్పారు. కానీ.. ప‌వ‌న్ రాజ్యాంగం గురించి ప్ర‌స్తావించ‌లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ప‌వ‌న్ నిర్దిష్టంగా లోక్ స‌భ ప్రొసీజ‌ర్స్ అండ్ గైడ్ లైన్స్ అని పేర్కొన్నారు.

+ ప‌వ‌న్ స‌వాలు చేశారు.. దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హుందాగా తీసుకుంటుంద‌ని మీరు (అంబ‌టిని ఉద్దేశించి) అన్నారు. కానీ.. ఆ రోజు జ‌రిగింది వేర‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ప్ర‌కాశం జిల్లా కందుకూరులో మీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌వాలు విసిరారు. దానికి మా నాయ‌కుడు ప‌వ‌న్ ప్ర‌తిస్పందించారంతే.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం తీర్మానం పెడితే తాను మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌ని.. అండ‌గా ఉంటాన‌ని చెప్పారు.

+ ఒక‌వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం కానీ పెట్ట‌క‌పోతే ఆ ప‌ని అధికార తెలుగుదేశం పార్టీ అయినా చేయాల‌ని చెప్పారు. దీనిపై మీరు అంత‌గా ఆవేశం చెందాల్సిన అవ‌స‌రం ఏమిటి

+  రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 75(3) ఏం చెబుతుందో ఒక్క‌సారి మ‌న‌వి చేస్తాం. మంత్రిమండ‌లిలోని మంత్రులంతా ఉమ్మ‌డిగా లోక్ స‌భ‌కు బ‌ద్ధులై ఉండాల‌ని చెబుతోంది.  స‌భా కార్య‌క్ర‌మాల‌ను న‌డిపించుకోవ‌టానికి స్వ‌నిబంధ‌న‌ల్ని రూపొందించుకోవ‌చ్చ‌ని ఆర్టిక‌ల్ 118 పార్ల‌మెంటులోని ఉభ‌య స‌భ‌ల‌కు అధికారం ఇచ్చింది.

+ లోక్ స‌భ రూల్స్ లోని రూల్ 198 మోష‌న్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అని స్ప‌ష్టంగా పేర్కొన్నారు. అయినా మీకు ఇంకా ఏమిటి అనుమానం? ఈ రూల్ కాపీని మీ ప‌రిశీల‌న‌కు జ‌త చేస్తున్నాం.

+ అంతేకాదు.. వివ‌రంగా ఉండే వీడియో లింక్ ను పంపుతున్నాం.

+ చివ‌ర‌గా ఏపీ విద్యార్థుల త‌ర‌ఫున మిమ్మ‌ల్ని కోరేది ఏమిటంటే.. అవిశ్వాస తీర్మానం పెట్ట‌టానికి మీ పార్టీ నేత‌లు 21 వ‌ర‌కుఎందుకు గుడువు పెట్టుకున్నారో కాస్త తెలియ‌జేయండి. మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ ను జాగ్ర‌త్త‌గా చూడండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు