హిందుయేత‌ర ఉద్యోగులైతే ఏంటి.. కాస్త ఆగండి

హిందుయేత‌ర ఉద్యోగులైతే ఏంటి.. కాస్త ఆగండి

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విష‌యంలో హైకోర్టు బ్రేకులు వేసింది. (టీటీడీ) పరిధిలోని వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు తొలిగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఉద్యోగం కొనసాగింపుపై జారీచేసిన షోకాజ్ నోటీసులపై టీటీడీకి సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యత నోటీసులు అందుకున్న హిందూయేతర ఉద్యోగులపై ఉంటుందని న్యాయస్థానం స్పష్టంచేసింది. హిందూయేతరులు సంస్థ పరిధిలోని ఆలయాల్లో పనిచేయడానికి వీల్లేదనే అన్యమత ఉద్యోగులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. దీన్ని సవాల్ చేస్తూ ముస్లిం, క్రిస్టియన్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

కాగా, కొద్దికాలం క్రితం టీటీడీలో కొత్త క‌ల‌కలం మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఓ మహిళా ఉద్యోగి తన అధికారిక వాహనంలో చర్చికి వెళ్లిన వీడియోలు వైరల్‌గా మారింది. ఈ ఘటన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందుయేతర ఉద్యోగులు ఉన్నారంటూ ఆందోళన వ్యక్తమైంది. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ రంగంలోకి దిగింది. హిందువులమని చెప్పుకుంటూ (టీటీడీ)లో అక్రమంగా పని చేస్తున్న 44 మంది ఉద్యోగులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

`నిబంధనలకు విరుద్ధంగా టీటీడీలో ఉద్యోగాలు పొందిన మిమ్మల్ని ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ మూడు వారాల గడువు ఇచ్చింది. టీటీడీలో కొందరు హిందూయేతర ఉద్యోగులు ఉన్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఈ చర్యలు తీసుకుంది. తిరుమలలో అన్యమత ప్రచారం చేసే వారిపైనే కాదు... అన్యమతస్థులుగా ఉండి టీటీడీలో ఉద్యోగాలు పొంది విధులు నిర్వహిస్తున్న 44 మంది ఉద్యోగుల పై త్వరలో కఠిన చర్యలు తీసుకోబోతునట్టు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కూడా తెలిపారు. ఇప్పటికే ఈ విషయంలో పూర్తి వివరాలు సేకరించినట్టు ఈఓ స్పష్టం చేశారు. విజిలెన్స్ అధికారుల రిపోర్టు ఆధారంగా ఉద్యోగులను టీటీడీ నుంచి శాశ్వతంగా తొలగించే ప్రక్రియ మొదలు పెట్టినట్టు ఈఓ చెప్పారు. అయితే ఈ ఉద్యోగులను ఏ విధంగా టీటీడీ నుంచి బయటకు పంపాలి.. అలా పంపితే వచ్చే లీగల్ ఇబ్బందులపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నివేదిన ఇచ్చినట్టు ఈఓ అన్నారు.

కాగా, ఈ ఉద్యోగులు హైకోర్టును ఆశ్ర‌యించారు. హైందవేతర ఉద్యోగులను విధుల నుండి ఎందుకు తొలగించకూడదంటూ ఈఓ నోటీస్‌ జారీ చేయడంపై దాఖలైన‌ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్‌, న్యాయమూర్తి విజయలక్ష్మిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల‌ కిందట ఉద్యోగాల్లో చేరిన అన్యమతస్తులను ఇప్పుడు ఎలా తొలగిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. విధుల్లో చేరే సందర్భంగా తాము హైందవేతరలమేనంటూ ఇచ్చిన డిక్లరేషన్‌ను కూడా ప్రస్తావించింది. డిక్లరేషన్‌ తీసుకుని ఉద్యోగాలు ఇచ్చిన తరువాత ఇప్పుడెలా తొలగిస్తామనడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించింది. ఈవో ఇచ్చిన నోటీసులకు స్పందించి ఎవరైనా వివరణ ఇచ్చినా, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని స్పస్టం చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగాల్లో చేరేప్పుడు అన్యమత ప్రచారం చేయమని ఉద్యోగాల్లో చేరే సమయంలో హామి ఇచ్చారని, దానికి అనుగుణంగా ఆదేశాలు ఇవ్వాలని టీటీడీ తరపు లాయర్‌ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఉద్యోగులు ఎవరైనా ఆ హామీని ఉల్లంఘిస్తే వారిపై దేవస్థానం చర్య తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ కేసులో ఈఓ తమ వాదనతో కౌంటర్‌ దాఖలు చేయాలని బెంచ్‌ నోటీసులు ఇచ్చింది. విచారణను వాయిదా వేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు