ఆఖరి దశలో ఇన్నిమెలికలా?

ఆఖరి దశలో ఇన్నిమెలికలా?

తెలంగాణ బిల్లు అయిపోయినట్టే, విభజన ఆగదు, అందుకే కనీసం ప్యాకేజి అయినా కోరుకుందాం, విభజన ఆగిపోతుంది అని ఇంకా చెప్పడం సీమాంద్రులను మోసం చేసినట్టే అంటూ ఓ వైపు, విభజన ఖరారు అంటూ ఏకంగా ఆ ప్రక్రియ తేదీలను కూడా ప్రకటించడం మరో వైపు జరిగిన ఈ తరుణంలో ఉన్నట్టుండి ఇన్ని మెలికలు ఎలా వచ్చాయి. దశాబ్దాల తరబడి కేంద్ర రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ ఉద్దండులకు దేశంలోని ఒక రాష్ట్రానికి సంబందించిన ఈవిషయంలో ఇన్ని చిక్కుముడులుంటాయని తెలియదా... అదే నిజమైతే దేశ ప్రయోజనాలకు సంబందించిన ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఈ నేతలు చేస్తున్నదంతా తెలుగు ప్రజలను నిండా ముంచడానికేనా...ఇలా ఎన్నో అనుమానాలను మన పాలకులపై కలుగుతున్నాయి.
    
రాజ్యాంగం ప్రకారమే ఇన్ని మెలికలు పుట్టుకొచ్చాయి. అయినా సరే ఎవరడ్డు వచ్చినా సరే రాష్ట్రాన్ని విడగొడుతున్నాం అన్నారు, అంటే రాజ్యాంగం గూర్చి  తెలియకనే కేంద్రంలోని పెద్దలు ఇలా చేసారా... వారు నియమించిన ముఖ్యమంత్రి కేంద్రం విభజనపై ఎంతో వేగంగా ముందుకు పోతున్నా సరే, పోనీయండి, దానిని ఆపే ఆయుధం నావద్ద ఉంది అని ధీమాగా చెపుతున్నా కూడా అదేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా వారు చేయలేదా... అంటే అవును అని కొందరి నోట, కాదు తెలిసి చేసారని మరి కొందరి నోట వినిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ  ఏర్పాటు చేయకుండా, ఏర్పాటు చేసినంత క్రెడిట్ కొట్టుకోవడానికి ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న హైడ్రామా అంటున్నారు.

కారణం ఇన్ని మెలికలు పెడుతున్నది కాంగ్రెస్ ప్రత్యర్థులు కాదు, కాంగ్రెస్ పార్టీ వారే, కేంద్రమేమో రాష్ట్రకాంగ్రెస్ ను ఖాతరు చేయం అంటూ వీరోచితంగా ముందుకు పోవడం, ఒక పక్క,. అసలు  ఎలా ముందుకు పోతారో చూస్తాం అంటూ ఏపి కాంగ్రెస్ వారు దానికి అడ్డుపుల్లలు వేయడం అంటే వారిలో వారే నాటకాలు ఆడుతున్నారని అనుమానం కలగడం సహజం.  ఎందుకంటే ముఖ్యమంత్రి మంచోడు, పార్టీకి విధేయుడు, పార్టీ నిర్ణయాన్ని పాటిస్తాడు అని అధిష్టానం అంటుంటే ఆయనేం చేస్తున్నాడు.

ఏకంగా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తన అధికారాన్ని (అంటే పార్టీ ద్వారా తనకు వచ్చిన అధికారాన్ని) ఉపయోగించి అసలు అసెంబ్లీనే నడవకుండా ప్రొరోగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో ఇదెలా చేస్తారు, దానిని ఆపే సత్తానే కాదు, అది చేసినా సరే ముందుకు పోయే పవర్ మాకుంది అంటూ కేంద్రం నుంచి సిగ్నల్స్, ఓహో అలాగా అయితే ఏకంగా తన పవర్ ఉపయోగించి ఏకంగా అసెంబ్లీనే రద్దుచేస్తానని అప్పుడు మీరేం చేస్తారు అంటూ ప్రతి సవాళ్లు. కాంగ్రెస్ లోనే వారికి వారే ఒకరు తెలంగాణ ఇవ్వడానికి తెగ కష్టపడుతున్నట్లు, మరొకరు దానిని ఆపడానికి తెగ ఆపసోపాలు పడుతున్నట్టు తెగ నటనలో జీవిస్తున్నారు. సరే వారి నాటకం ఏదైనా సరే కాని విభజన విషయంలో ఇన్ని మెలికలు పుట్టుకొస్తుండం మాత్రం ఆలోచించదగ్గ విషయమే.

కాంగ్రెస్ వారి నాటకం మాట ఎలా ఉన్నా... మంత్రి టిజి వెంకటేష్ అసెంబ్లీని రద్దు చేస్తే ఇక గొడవే ఉండదు అన్నాడు, ఈ విషయాన్ని పదిరోజుల ముందే తాను చెప్పానని టిడిపి నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. అంటే ఇది నిజంగా విభజన విషయంలో చాలా పెద్ద మెలిక. ఇది ముఖ్యమంత్రి ముక్కుసూటిగా పోతే చేసేయొచ్చు అంటున్నారు. ఇక 371 డి... ఇది ఉండగా కుదరదని కొందరు, అవసరం లేదని మరికొందరు అంటున్నారు. వీటికి తోడు హైదరాబాద్, భద్రాచలం, శ్రీశైలం వంటి కొత్త మెలికలతో పాటు, సరిహద్దులు, అప్పులు, పంపకాలు, సాగునీరు, విద్యుత్, ఉపాది, విద్య ఇలా ఎన్నో అంశాల్లో రోజుకో కొత్త మెలికలు పుట్టుకొస్తున్నాయి.

వీటన్నింటి గూర్చి ఇంత తర్జన భర్జన పడడం, దానికోసం చమటలు కారేలా కష్టపడం, ఉద్యోగులు వారి జీతాలు వదులకుని ఉద్యమాలు చేయడం, సీమాంద్ర ప్రజలు రోడ్డెక్కడం, ఇవన్నీ ఎందుకు చెప్పండి. సీమాంద్రలోని ప్రజాప్రతినిధులందరికి కూడా సమైక్యం కావాలనే ఉంది. ఇటు జగన్ పార్టీ, టిడిపి, కాంగ్రెస్ అందరు సమైక్యం కోసమే తెగ కష్టాలు పడుతున్నాడు. వారంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తే అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలే కూలిపోతాయి, వారి చేతిలో ఉన్న అంత చిన్న పని చేయకుండా ఇంత కష్టాలు పెడుతున్నారంటే అర్థం ఏమిటి, దానిని ఏమని అనుకోవాలి, ఇదే కదా విభజన వాదులకు బలం చేకూరుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు