కోదండ‌రాం అమెరికా టూర్ వెనుక ...

కోదండ‌రాం అమెరికా టూర్ వెనుక ...

తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం త‌న పార్టీ ఏర్పాటుకు అన్ని ర‌కాల లెక్క‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారా? ఇందుకోసం త‌న‌కు కీల‌క మ‌ద్ద‌తుదారులుగా ఉన్న ఎన్నారైలతో భేటీ అయ్యేందుకు ఏకంగా అమెరికా వెళుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది తాజా ప‌రిణామాల‌ను చూస్తే.టీజేఏసీ చైర్మెన్‌ కోదండరాం సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌ నుండి అమెరికా బయలుదేరి వెళ్లారు.

ఇది కేవలం కోదండరాం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని టీజేఏసీ వర్గీయులు అంటున్నాయి. బంధువులకు సంబంధించిన వారి పెళ్లి ఉండడంతో అమెరికాకు వెళ్తున్నారని, అక్కడ ఎలాంటి రాజకీయ సమావేశాలు ఉండబోవన్నారు. ఉండేది వారం రోజులే అయినందున, ఎవరినీ కలిసే అవకాశం లేదన్నారు.  అయితే రాష్ట్రంలో రాజకీయం వాతావరణం వేడెక్కడం, రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం, మార్చి రెండోవారంలో పార్టీని ప్రారంభించబోతున్న క్రమంలో ఆయన అమెరికాకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీలంగా పాల్గొని రాష్ట్రం ఏర్పాటు అనంత‌రం జేఏసీ ద్వారా కేసీఆర్ స‌ర్కారు విధానాల‌పై కోదండ‌రాం మండిప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ పార్టీ ఏర్పాటుపై మొద‌ట త‌ట‌ప‌టాయించిన కోదండ‌రాం అనంత‌రం రాజ‌కీయ రంగంలోకి దిగేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న ఆస‌క్తిగా మారింది.

అమెరికా పర్యటనలో ఎన్‌ఆర్‌ఐలతో కోదండరాం సమావేశం కానున్నట్టు తెలిసింది. ఎన్‌ఆర్‌ఐల మద్దతు కోరనున్నారు. వారి సహాయంతో రాష్ట్రంలోని కొంతమంది నేతలను తమ వైపుకు తిప్పుకుంటారని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన చాలామంది అమెరికాలో ఉండటం, వారిలో ఎక్కువమంది తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాంకు మద్దతు ప్రకటించారు. వారి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఎక్కువమంది ఎన్‌ఆర్‌ఐలను కలుసుకునే అవకాశం ఉంది.

కాగా, కోదండరాం అమెరికాకు వెళ్లడానికి ముందు పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 200 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. వంద మంది టీజేఏసీకి చెందిన వారు కాగా, మరో వందమంది బయటవారిని తీసుకుంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అమెరికాకు వచ్చిన తర్వాత కోదండరాం వారందరితో సన్నాహాక మీటింగ్‌ను ఏర్పాటు చేశారని టీజేఏసీ నేతలు తెలిపారు. కాగా, పార్టీని ప్రారంభించబోతున్న రోజే తన పార్టీకి చెందిన పేరును, గుర్తును, విధివిధానాలను కోదండరాం ప్రకటించనున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయననే ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు