తెలంగాణ వ్యవహారంలో కొత్త ​ ​మలుపులు

తెలంగాణ వ్యవహారంలో కొత్త ​ ​మలుపులు

తెలంగాణ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. కొత్త ఆలోచనలు, రకరకాల ఊహగానాలు, గందరగోళాలు, అనిశ్చితి, అస్తవ్యస్తం. ఇదీ పరిస్థితి. కేంద్రం ఏం చేస్తోంది. కిరణ్ ఏం చేయబోతున్నాడు తెలియక మంత్రులు, ఎమ్మల్యేలు, అధికారులు, సామాన్యజనం జుట్టు పీక్కుంటున్నారు. వీటన్నింటిన మధ్య కేంద్ర గూఢచార విభాగం అధిపతి ఆసిఫ్ ఇబ్రహీం సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటువల్ల రాష్ట్రంతో పాటు కేంద్రానికి కూడా కొత్త సవాళ్లు తప్పవని అన్నారు. వాటిని ఎదుర్కోవడానికి పోలీసు వ్యవస్థ సన్నద్ధం కావాలని ఆయన డిజిపిల సమావేశంలో కోరారు.  రాష్ట్ర విభజన ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో ఇబ్రహీం ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.   అంతేకాక జివోఎంతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.

విభజన ప్రక్రియ సజావుగా సాగాలంటే ఒకటి తరువాత ఒకటిగా అన్ని వ్యవస్థలు తమ విధులను నిర్వహించవలసి ఉంటుంది.  కేంద్రం బిల్లును అసెంబ్లీకి పంపినప్పుడు దాని పరిశీలనకు అసెంబ్లీని సమావేశపరచవలసి ఉంటుంది.  అసెంబ్లీని సమావేశపరచాలంటే అది ప్రోరోగ్ అయ ఉండకూడదు. గత సమావేశాల తరువాత అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదు.  ఇప్పుడు గనక ప్రోరోగ్ చేస్తే తిరిగి మరల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడానికి కొంతకాలం పడుతుంది. అప్పుడు  రాష్టప్రతి విధించిన గడువులోపల అసెంబ్లీ బిల్లును పరిశీలించే వీలుండదు. అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బిల్లును అడ్డుకోవడానికి ప్రోరోగ్ మంత్రాన్ని ప్రయోగించాలని చూస్తున్నారు.  ఈ  మధ్యలో  ఉపముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ రాష్ట్ర శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేయవద్దని గవర్నర్‌కు లేఖ రాశారు.

తెలంగాణ బిల్లును రాష్టప్రతి ఏ క్షణమైనా అసెంబ్లీలో చర్చకోసం పంపవచ్చని అందువల్ల సభలను ప్రోరోగ్ చేయవద్దని కోరారు. సభను ప్రోరోగ్ చేయడమంటే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను జాప్యం చేయడమే.  ఈ మధ్యలో అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా జాప్యం చేస్తున్నందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రులపై విరుచుకుపడ్డారు. వారు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రోరోగ్ చేయడం వంటి సాధారణ విషయాన్ని కూడా జాప్యం చేసి వివాదస్పదం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.  మరోవైపు జివోఎం సమావేశంలో  తెలంగాణపై  నివేదిక సిద్ధమైంది. కోర్ కమిటీ సమావేశంలో బిల్లుకు తుదిరూపం ఇచ్చే అవకాశం ఉంది.

ఈ లోపల కిరణ్‌కుమార్ రెడ్డి నుంచి ఏదైనా ప్రతిఘటన వస్తే ఎదుర్కోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పడింది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ  మాజీ పిసిసి అధ్యక్షుడు డిఎస్‌ను కలవడం విశేషం.  అయతే తనకుకాని, కన్నాకు కానీ ముఖ్యమంత్రి కావాలనే యోచన లేదని డిఎస్ ప్రకటన చేయడం గమనార్హం. అటు తిరిగి ఇప్పుడు బంతి మళ్లీ కిరణ్ కోర్టులోకి వచ్చింది. సమైక్య కిరణం ఎటువైపు తిరగుతుందనేదే ఆసక్తి కలిగిస్తున్న అంశం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు