జ‌గ‌న్ ను ఇరుకున పెట్టేందుకే ప‌వ‌న్ పొగిడాడా?

జ‌గ‌న్ ను ఇరుకున పెట్టేందుకే ప‌వ‌న్ పొగిడాడా?

అవిశ్వాస తీర్మానంపై వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విసిరిన స‌వాల్ ను స్వీక‌రించ‌డానికి తాను రెడీ అని ప‌వ‌న్ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. జగన్ సవాల్‌ ను తాను స్వీకరిస్తున్నానని, అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్టి...ఆ క్రెడిట్ వైసీపీనే సంపాదించ‌వ‌చ్చ‌ని, దానితో ప్ర‌జ‌ల్లో ఆ పార్టీకి ఇంకా బ‌లం పెరుగుతుంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అయితే, ప్రెస్ మీట్ లో జ‌గ‌న్ ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్ హావ‌భావాల్లో ఒక ర‌క‌మైన వ్యంగ్యాత్మ‌క ధోర‌ణి క‌నిపించింది. కేవ‌లం జ‌గ‌న్ విసిరిన స‌వాల్ కు ప్ర‌తి స‌వాల్ విసిరేందుకే తాను ఈ ప్రెస్ మీట్ పెట్టాన‌ని ప‌వ‌న్ ప‌లుమార్లు నొక్కి వ‌క్కాణించం గ‌మనార్హం. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేకించి చాలెంజ్ విసిరారు కాబ‌ట్టి తాను ఈ స‌వాల్ ను స్వీక‌రిస్తున్నాన‌ని....తాను వెన‌క్కి త‌గ్గే వ్య‌క్తిని కాద‌ని ప‌వ‌న్ ఆవేశ‌పూరితంగా అన్నారు. సాధార‌ణంగా రాజ‌కీయాల్లో స‌వాళ్లు ....ప్ర‌తి స‌వాళ్లు స‌హజ‌మైన‌ప్ప‌టికీ.....జగ‌న్ స‌వాలును ప‌వ‌న్ చాలా సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు క‌నిపించింది. అవిశ్వాస తీర్మానం పెట్టేలా జ‌గ‌న్ ను ఫోర్స్ చేసి, జ‌గ‌న్, వైసీపీ ఎంపీల‌ను ఇరుకున పెట్టేందుకు జ‌గ‌న్ పై ప‌వ‌న్ ప్ర‌శంస‌లు కురిపించిన‌ట్లు క‌నిపిస్తోంది. ప్రెస్ మీట్ లో జ‌గ‌న్ ను పొగుడుతూ కామెంట్స్ చేసిన‌పుడు ప‌వ‌న్ ఎక్స్ ప్రెష‌న్స్ లో వ్యంగ్య ధోర‌ణిని వీడియోలో స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. ఎలాగూ జ‌గ‌న్ అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్ట‌రు....ఒక వేళ ద‌మ్ము ధైర్యం ఉంటే ప్ర‌వేశ‌పెట్టండి చూద్దాం......అని ప‌వ‌న్ అన్న‌ట్లు ఆ వీడియోలో స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు.
 
కేంద్ర ప్ర‌భుత్వం పై ఎదురుతిరిగే దమ్ము, తెగింపు, ధైర్యం గ‌ల‌ వ్యక్తి జ‌గ‌న్ అని, కేంద్రంపై ఆయ‌న ఎదురు తిరిగితే తాను అండగా ఉంటాన‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ స్టేట్ మెంట్ విన్న వైసీపీ అభిమానులంద‌రూ చాలా సంతోష ప‌డి ఉంటారు. జ‌గ‌న్ ను పొగుడుతూ ప‌వ‌న్ తొలిసారిగా పాజిటివ్ వ్యాఖ్య‌లు చేయ‌డం జ‌గ‌న్ అభిమానుల‌కు కూడా ఆనందం క‌లిగించి ఉంటుంది. అయితే, ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే అందులోని వ్యంగ్యాత్మ‌క ధోర‌ణి అర్థం కాదు. ``మీరు గొప్ప ద‌మ్ము, దైర్యం ఉన్న వ్య‌క్తి, గొప్ప బ‌ల‌మైన నాయ‌కులు మీరు. సెంట్ర‌ల్ కేబినెట్ మీద ఎదురు తిరగండి. మీకు అండ‌గా మేముంటాం. మీకోసం కావాలంటే మేము రోడ్ల‌మీద‌కు కూడా వ‌స్తాం. గుర్తుంచుకోండి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిగారు``అంటూ ప‌వ‌న్ సెటైరిక‌ల్ గా జ‌గ‌న్ పై వ్యాఖ్య‌లు చేశారు. ప్రెస్ మీట్ వీడియోలో ఆ కామెంట్స్ చేసిన‌పుడు ప‌వ‌న్ ఎక్స్ ప్రెష‌న్స్  లో జ‌గ‌న్ పై ఉక్రోశం స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఈ ర‌కంగా జ‌గ‌న్ పై వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా....త‌మ ఎంపీల చేత అవిశ్వాస తీర్మానం పెట్టించేలా జ‌గ‌న్ ను ప‌వ‌న్ ఫోర్స్ చేశార‌ని చెప్ప‌వ‌చ్చు. కావాల‌నే జ‌గ‌న్ ను ఇరుకున పెట్టాల‌నే యోచ‌న‌తోనే ఈర‌కంగా `పొగడ్త‌ల‌తో` ముంచెత్తిన‌ట్లు క‌నిపిస్తోంది. ఎప్పుడూ మీడియా స‌మావేశంలో ప్ర‌శాంతంగా వ్య‌వ‌హ‌రించే ప‌వ‌న్ ఈ సారి కొద్దిగా త‌త్త‌ర‌పాటుకు గుర‌య్యార‌ని చెప్ప‌వ‌చ్చు. పార్ల‌మెంటులో జ‌గ‌న్, వైసీపీ ఎంపీల‌ను ఇరుకున పెట్టి ...కేంద్రంతో వైరం తెచ్చుకునేలా చేయాల‌ని ప‌వ‌న్ యోచిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అంతేకాకుండా, తాను కేవ‌లం  మిత్ర‌ప‌క్షం హోదాలో టీడీపీకి మ‌ద్ద‌తు మాత్రమే ఇచ్చాన‌ని, ఆ పార్టీకి త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని, తాను ఆ పార్టీకి పార్ట్ న‌ర్ కాద‌ని  ప‌వ‌న్ చెప్ప‌డం చూస్తుంటే ఓ ర‌కంగా చంద్ర‌బాబును కూడా ప‌వ‌న్ ఇరుకున పెట్టార‌ని చెప్ప‌వ‌చ్చు. జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం అయిన టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి ఎంత‌వ‌ర‌కు మ‌ద్ద‌తునిస్తారో కూడా ఆరోజు తేలిపోతుంద‌ని ప‌వ‌న్ అనడంతో టీడీపీ ఎంపీలు కూడా అయోమ‌యంలో ప‌డింద‌ని చెప్ప‌వ‌చ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు