ప‌వ‌న్ స‌వాల్‌తో జ‌గ‌న్ ఇరుక్కున్న‌ట్లే

ప‌వ‌న్ స‌వాల్‌తో జ‌గ‌న్ ఇరుక్కున్న‌ట్లే

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారా? ప‌్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్న మైలేజీని త‌న సొంతం చేసుకోవాల‌ని భావించిన జ‌గ‌న్ ఈ బ‌రిలోకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాగ‌డం ఆయ‌న‌కే రివ‌ర్స్ అయిందా? ప‌వ‌న్ అనూహ్య స్పంద‌న‌తో జ‌గ‌న్ ఇర‌కాటంలో ప‌డిన‌ట్లేనా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

`ప్ర‌త్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానానికి వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉంది. మీ చంద్ర‌బాబును ఒప్పించండి ప‌వ‌న్‌` అంటూ వైఎస్ జ‌గ‌న్ స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. దీనికి ప‌వ‌న్ అదే రీతిలో స్పందించారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప‌వ‌న్ తాను అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇస్తున్నాన‌ని తేల్చిచెప్ప‌డ‌మే కాకుండా...జ‌గ‌న్ అవిశ్వాసం పెడితే తాను మ‌ద్ద‌తిస్తాన‌ని తెలిపారు.`ఒక్క ఎంపీ కూడా అవిశ్వాస తీర్మానం ప్ర‌తిపాదించ‌వ‌చ్చు. నేను వెనక్కి వెళ్లను.. మీకు దమ్ము, తెగింపు , ధైర్యం ఉంది. మీకు అండగా ఉంటా. మీరు ముందు అవిశ్వాసం పెట్టండి.. కుదిరితే రేపే మీ ఎంపీల ను సెక్రటరీ జనరల్ దగ్గరికి వెళ్ళమనండి..ఇదే బలమైన బడ్జెట్ సెషన్..  మళ్ళీ రాదు.. రేపే వెళ్తారా, 4వ తేదీన వెళ్తారా మీ ఇష్టం` అంటూ కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్లు ప‌వ‌న్ తేల్చిచెప్పారు.

అయితే ఈ స్పంద‌న‌ను జ‌గ‌న్ స‌హా ఆయ‌న టీం ఊహించ‌లేద‌ని అంటున్నారు. ప‌వన్‌ స‌వాల్ స్వీక‌రించ‌డు అనుకొని జ‌గ‌న్ స‌వాల్‌ చేస్తే...ప‌వ‌న్ ధీటుగా స్పందించి బాల్‌ను వైసీపీ అధినేత కోర్టులోకి తోసేశాడ‌ని చెప్తున్నారు. ఇప్పుడు ఈ స‌వాల్‌తో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీకి ఎదురు తిర‌గ‌లా అనే డైల‌మా వైసీపీలో ఉంద‌ని చెప్తున్నారు. మోడీ విష‌యంలో గ‌తంలో ఎప్పుడూ వ్య‌తిరేక దోర‌ణిలో ప్ర‌వ‌ర్తించని జ‌గ‌న్ ఇప్పుడు ఏకంగా  ఆయ‌న ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేలా తీర్మానం పెడితే...`ఎలాంటి ప‌రిస్థితులు` ఎదుర‌వుతాయో అనే సందేహాలు వైసీపీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక‌వేళ స్వీక‌రించ‌క‌పోతే...స‌వాల్ విసిరి తోక‌ముడిచిన వ్య‌క్తిగా జ‌గ‌న్ న‌వ్వుల పాలు అవుతార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కోర్టులో బాల్ నెట్ట‌డం ద్వారా ప‌వ‌న్ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారని...అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ఇర‌కాటంలో ప‌డ్డార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు