జ‌గ‌న్ దమ్ము, ధైర్యం ఉన్న లీడ‌ర్: ప‌వ‌న్

జ‌గ‌న్ దమ్ము, ధైర్యం ఉన్న లీడ‌ర్: ప‌వ‌న్

అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని, టీడీపీ, చంద్ర‌బాబు, ఆయ‌న పార్ట్ న‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్  మద్దతు తెల‌ప‌డానికి సిద్ధంగా ఉన్నారా.....అని వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, జ‌గ‌న్ స‌వాలుపై జ‌న‌సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. తాను అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాన‌ని అన్నారు. జగన్ సవాల్‌ ను తాను స్వీకరిస్తున్నానని ప‌వ‌న్ స్పష్టం చేశారు. ఈ విష‌యాన్ని తెల‌య‌జేసేందుకు  హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో ప్ర‌త్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ప‌వ‌న్ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఒక‌వేళ‌ పార్ల‌మెంటులో త‌మ ఎంపీల చేత‌ జ‌గ‌న్ అవిశ్వాస తీర్మానం పెట్టించ‌లేక‌పోతే, చంద్ర‌బాబు నాయుడు...టీడీపీ ఎంపీల‌తో అవిశ్వాస తీర్మానం పెట్టించాల‌ని ప‌వ‌న్ అన్నారు.

పార్లమెంటరీ గైడెన్స్ ప్రకారం ఒక్క ఎంపీతో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టించ‌వ‌చ్చ‌ని, త‌మ‌కు మ‌ద్ద‌తు లేద‌ని వైసీపీ చెబుతోంద‌ని, వైసీపీకి కావాల్సిన మద్దతును తాను కూడ‌గ‌డ‌తాన‌ని చెప్పారు. అవ‌స‌ర‌మైతే మార్చి 4వ తేదీన తాను ఢిల్లీకి వస్తానని, పార్ల‌మెంటు తొలి రోజునే జగన్‌ అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పారు. జగన్ దమ్ము, ధైర్యం గ‌ల‌ వ్యక్తి అని, కేంద్రంపై ఆయ‌న ఎదురు తిరిగితే అండగా ప‌వ‌న్ క‌ల్యాణ్, జ‌న‌సేన ఉంటాయ‌ని స్పష్టం చేశారు. దాదాపు 80మంది ఎంపీల మద్దతు తాను కూడగడతానని పవన్ చెప్పారు. టీఆర్ ఎస్ ఎంపీ క‌విత‌, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాద‌వ్, ముస్లిం లీగ్ వంటి వారు చాలామంది ఏపీకి మ‌ద్ద‌తు తెలిపారని గుర్తు చేశారు. ఢిల్లీకి అఖిల‌ప‌క్షాన్ని తాను తీసుకువ‌స్తాన‌ని చెప్పారు. సీపీఐ, సీపీఎం మ‌ద్ద‌తు త‌న‌కుంద‌ని, అవ‌స‌ర‌మైతే క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు కూడా వెళ్లి వారి మ‌ద్ద‌తు అడుగుతాన‌ని చెప్పారు. అవిశ్వాస తీర్మానం పెడితే దేశవ్యాప్తంగా ఏపీ ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల‌పై చర్చ జరుగుతుందని అన్నారు. ఇది ఒక పార్టీ స‌మ‌స్య కాద‌ని, మొత్తం తెలుగు జాతి స‌మ‌స్య అని ప‌వ‌న్ అన్నారు.

ప్ల‌కార్డులు ప‌ట్టుకొని పార్ల‌మెంటులో ఆందోళ‌న‌లు చేస్తే, విచిత్ర వేష‌ధార‌ణ‌ల్లో నిర‌స‌న తెలిపితే లాభం లేద‌న్నారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నారు. అవిశ్వాసానికి టీడీపీ మ‌ద్ద‌తునిస్తుందా లేదా అన్న‌ది తాను చెప్ప‌లేన‌ని, ఆ పార్టీకి తాను మిత్ర‌ప‌క్షం హోదాలో కేవ‌లం మ‌ద్ద‌తు మాత్రమే ఇచ్చాన‌ని, అంత‌మ‌కుమించి ఆ పార్టీకి త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని చెప్పారు. జ‌గ‌న్ అవిశ్వాస తీర్మానం పెడితే.....జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం అయిన టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి ఎంత‌వ‌ర‌కు మ‌ద్ద‌తునిస్తారో కూడా ఆరోజు తేలిపోతుంద‌ని ప‌వ‌న్ అన్నారు. అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్టి...ఆ క్రెడిట్ వైసీపీనే సంపాదించ‌వ‌చ్చ‌ని, దానితో ప్ర‌జ‌ల్లో ఆ పార్టీకి ఇంకా బ‌లం పెరుగుతుంద‌ని ప‌వ‌న్ సూచించారు. మొత్తానికి టీడీపీపై త‌న అసంతృప్తిని ప‌వ‌న్ న‌ర్మ‌గ‌ర్భంగా వెల్ల‌డిస్తున్న త్వ‌ర‌లోనే టీడీపీకి క‌టీఫ్ చెప్పే యోచ‌న‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి ప‌వ‌న్ ప్రెస్ మీట్ టీడీపీ గుండెల్లో గుబులు పుట్టించింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు