రెడ్లలో కలకలం..

రెడ్లలో కలకలం..

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు వచ్చేసరికి అగ్రకులాలు అంటే... కమ్మ, రెడ్డి. జనాభా పరంగా రాష్ట్రంలో కమ్మ వర్గం మూడు శాతం ఉంటే... రెడ్డి వర్గం ఆరు శాతం ఉంది. వ్యాపార పరంగా ఎక్కువ క్రియాశీలకంగా ఉండే కమ్మ వర్గంలో  ఇతర విషయాలతో పోల్చి చూసినపుడు రాజకీయాల్లో ఐక్యత కొంచెం తక్కువ. వారి వ్యాపార ప్రయోజనాలు మొదటి స్థానంలో ఉండటమే దీనికి కారణం. అదే రెడ్లు రాజకీయ పరంగా ఎప్పుడూ ఒకే తాటిపై నిలబడి ఉంటారు. ఓటు విషయంలో ఆ ఓట్లు చీలవు. బహుశా రాష్ట్రంలో అత్యధికసార్లు వారు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఇదీ ఒక కారణం కావచ్చు.

అయితే, వారి రాజకీయ ఐక్యతకు తాజాగా ప్రమాదం ముంచుకొచ్చింది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక రెడ్డి అంటే వైఎస్సార్ అనే స్థాయికి వెళ్లింది. అయితే, రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో అది బద్దలైంది. రెడ్డి వర్గం వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో వారు జగన్ రెడ్డినే తమ ప్రతినిధిగా భావించారు. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాలతో మొత్తం సీన్ మారిపోయింది. జగన్ సమైక్యవాదం అందుకున్నా కూడా ఆ పార్టీ సమైక్య శంఖారావం మినహా ఆ దిశగా చేసిన కార్యక్రమాలేం పెద్దగా లేవు. అదే సమయంలో కాంగ్రెస్ చరిత్రలోనే చూడని స్థాయిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని ఎదిరించి నిలబడ్డాడు. జగన్ పదవి ఇస్తే సమైక్యరాష్ట్రాన్ని తెస్తా అంటుంటే... కిరణ్ మాత్రం పదవి పోయినా పర్లేదు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతాను అంటున్నాడు.

తొలుత చాలామంది అనుమానించినా ప్రతి చర్యలోనూ, లిఖితపూర్వకంగా, దొరికిన ప్రతి వేదికలోనూ కాంగ్రెస్ అధిష్టానాన్ని జగన్ కంటే దీటుగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు. దీంతో రెడ్లలో ఆలోచనా పరులు కిరణ్ వైపు చూస్తున్నారు. పైగా అవినీతి కోణంలో చూసినపుడు జగన్ ను రెడ్లలో తటస్తులు ఆమోదించడంలేదు. వారికి కిరణ్ రూపంలో కొత్త ప్రత్యామ్నాయం దొరికింది. దీంతో రెడ్లలో రాజకీయ విభజన ఆసన్నమైనంది. కాంగ్రెస్ మూర్ఖత్వంతో ఇబ్బంది పడిన సీమాంధ్ర రెడ్డి నాయకులు, జగన్ ఆధిపత్యాన్ని ఇష్టపడని రెడ్డి సీనియర్ రాజకీయవర్గం కిరణ్ వెంట నడుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తయితే ఏపీఎన్జీవోలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ వర్గాల మద్దతు సంపూర్ణంగా సంపాదించిన కిరణ్ కుమార్ రెడ్డి తనకు మద్దతునిచ్చే ప్రత్యేక వర్గాన్ని సృష్టించుకున్నాడు. దీంతో పాటు సీమాంధ్ర సీనియర్ రాజకీయ నేతల అండ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి కనుక పార్టీ పెడితే రాష్ట్రంలో రెడ్లు నిట్టనిలువుగా చీలిపోతారు. రాష్ట్ర విభజనతో తెలంగాణ-సీమాంధ్ర రెడ్లుగా చీలిపోయిన ఆ వర్గం... కిరణ్ పార్టీ పెడితే మళ్లీ సీమాంధ్రలో రెండుగా చీలిపోతుంది. ఇది జగన్ కు అతి పెద్ద థ్రెట్. కమ్మ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీకి అతిపెద్ద ప్లస్. ఈ చీలిక తెలుగుదేశానికి లాభించి రెడ్లకు అధికారాన్ని దూరం చేసే ముప్పు కూడా లేకపోలేదు! ఇవన్నీ ఇపుడు కలకలం సృస్టిస్తున్నాయి ఆ వర్గంలో. మరి కొన్ని నెలల్లోనే ఏమవుతుందో తేలిపోనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు