మేం ఛండాలం చేశాం.. మీరు శుభ్రం చేయండి

మేం ఛండాలం చేశాం.. మీరు శుభ్రం చేయండి

త‌ప్పు చేయ‌టం మామూలే. యంత్రాలు త‌ప్పు చేస్తే తుక్కులో ప‌డేస్తారు. అదే మ‌నుషులు చేస్తే.. మ‌రోసారి అలాంటి త‌ప్ప‌లు చేయ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌మంటారు. తెలివైనోళ్లు త‌ప్పు చేస్తే స‌రి దిద్దుకోవ‌ట‌మే కాదు..చేసిన త‌ప్పును వేలెత్తి చూపించే అవ‌కాశ‌మే ఇవ్వ‌రు. కానీ.. మేధావులుగా చెప్పుకునే కొంద‌రు మాత్రం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా కేంద్ర మాజీ మంత్రి జైరాం ర‌మేష్ గా చెప్పాలి.

కోట్లాది మంది తెలుగోళ్ల ఆశ‌ల్ని.. ఆకాంక్ష‌ల్ని ప‌ట్టించుకోకుండా సోనియ‌మ్మ మీదున్న స్వామిభ‌క్తిని ప్ర‌ద‌ర్శించుకునేందుకు త‌పించిన ఆయ‌న‌.. విభ‌జ‌న బిల్లు డ్రాఫ్ట్ ను త‌యారు చేశారు. ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపికైన విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా ఆంధ్రోళ్ల‌కు ఎంత న‌ష్టం చేయాలో అంత న‌ష్టాన్ని చేసిన క్రెడిట్ జైరాందే.  తాను చేసిన ప‌నికి ఏపీ స‌ర్వ‌నాశ‌న‌మైపోయింద‌న్న భావ‌న అస్స‌లు లేని వ్య‌క్తుల్లో జైరాం ఒక‌రు. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగే న‌ష్టం గురించి తెలియంది కాదు. విభ‌జ‌న అనివార్య‌మైన వేళ‌.. అధినాయ‌క‌త్వం చెప్పిన‌ట్లుగా విభ‌జ‌న చ‌ట్టాన్ని రాశార‌నుకుందాం. ఏపీకి వ‌రాలు ఇచ్చే విష‌యంలో త‌ప్ప‌నిస‌రిగా చేయాల‌న్న మాట‌ను కాకుండా.. చేయొచ్చు.. ప‌రిశీలించొచ్చు.. అవ‌కాశాలు ఏమిటో చూడాలి లాంటి త‌ప్పుడు మాట‌ల‌తో డ్రాఫ్ట్ చేసిన దుర్మార్గం ఆయ‌న సొంతం.

తాజాగా ఏపీ విభ‌జ‌న హామీల అమ‌లుపై ఏపీలో రాజ‌కీయం వేడెక్కిన వేళ‌.. వ్యంగ్యంగా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు తీవ్రంగా మండిప‌డుతున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని లోపాల్ని ఎత్తి చూపిన వైనంపై స్పందించిన జైరాం.. మేం ఛండాలం చేశాం.. మీరు శుభ్రం చేయండంటూ వ్యాఖ్య‌లు చేయ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే విభ‌జ‌న విష‌యంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇలాంటి మాట‌లు పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఈ వాద‌న‌కు తగ్గ‌ట్లే ఏపీ మంత్రులు జైరాంను తూర్పార ప‌డుతున్నారు. ఆయ‌న బాధ్య‌తారాహిత్యానికి నిద‌ర్శ‌నంగా తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లుగా చెబుతున్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేలా చేసిన జైరాం.. చ‌ట్టంలో తాను పెట్టిన ప‌దాల కార‌ణంగా ఏపీకి దారుణ‌మైన అన్యాయం జ‌రిగింద‌ని వాపోతున్నారు. రైల్వేజోన్‌.. క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం.. విశాఖ - చెన్నై ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ ఇలా వేటిని త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌స్తావించ‌కుండా.. యూజ్ ఫ‌ర్ ఫీజిబిలిటీ.. విల్ అబ్జ‌ర్వ్‌.. ష‌ల్ ఎగ్జామిన్ లాంటి ప‌దాలు పెట్టి ఏపీకి భ‌విష్య‌త్తు లేకుండా చేశార‌ని మండిప‌డుతున్నారు.
 
చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు జైరాం చేస్తున్న వ్యాఖ్య‌లు స‌రిగా లేవంటున్నారు. ఇప్ప‌టికైనా చేసిన త‌ప్పున‌కు చెంప‌లేసుకొని.. ఏం చేయాలో చెబితే బాగుంటుందే త‌ప్పించి.. ఒళ్లు మండే మాట‌లు మాట్లాడితే ఆయ‌న‌కే కాదు.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించే కాంగ్రెస్  పార్టీకి తీవ్రంగా న‌ష్టం వాటిల్లుతుంద‌న్న వాస్త‌వాన్ని గుర్తిస్తే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు