కిరణ్ భయపెడుతున్నాడా, భయపడుతున్నాడా..?

కిరణ్  భయపెడుతున్నాడా, భయపడుతున్నాడా..?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది డిఫరెంట్ స్టైల్. నాయకుడికి ఉండాల్సిన ధీరత్వం కంటే కూడా జాగ్రత్తే ఎక్కువగా కనిపిస్తుంది. ముందుజాగ్రత్త అన్న పేరుతో ఆయన నిత్యం ఎంత భయపడుతుంటారో ఆయన చేసే పనుల్ని చూస్తేనే అర్థమవుతుంది. పైకి తెగింపుతో మాట్లాడే ఆయనలో.. ‘‘ఏదైతే అది.. దాని సంగతి చూసుకుందాం’’ అనే తత్వం అస్సలు కనిపించదు. ‘‘అంత అవకాశం ఎందుకివ్వాలి. మనమే జాగ్రత్తగా ఉంటే పోలా’’ అనే తత్వమే కనిపిస్తుంది.
దాదాపు రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రికి వ్యవహరిస్తున్న ఆయనలో అభద్రతాభావం ఎక్కువ అంటే.. అవుననే చెప్పాలి. తన లక్ష్యానికి ఇబ్బందిగా ఉండే వారి విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటారో అన్న దానికి తాజాగా చోటు చేసుకున్న ఘటనలు ఆయనేంటో ఇట్టే చెప్పేస్తాయి.

కిరణ్ సమైక్యవాదాన్ని భుజాన వేసుకున్న నాటి నుంచి ఆయనలో జాగ్రత్త మరింత పెరిగిపోయింది. ముఖ్యమంత్రి పదవి వైపు చూస్తున్నారన్న భావన కలిగితే చాలు... ఆయన రియాక్ట్ అవుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సీఎం పదవి తనకు తృణప్రాయం అని చెప్పే ఆయన.. అదే పదవిని అంటిపెట్టుకొని ఉండటానికి ఆయన పడుతున్న పాట్లు ఆయనేంటో చెప్పకనే చెబుతాయి.

ముఖ్యమంత్రి రేసులో కన్నా లక్ష్మీనారాయణ.. సీఎం పదవికి స్పీకర్ మనోహర్ లాంటి వార్తలు.. ఇలాంటి భయంలో నుంచే పుట్టినవనుకోవాలి. ఎదుటివారిని భయపెడుతున్న కిరణ్.. వాస్తవానికి ఆయనే ఎక్కువగా భయపడుతుంటారు. గుండె ధైర్యంతో వ్యవహరించటం వేరు.. గుండె ధైర్యంగా ఉన్నట్లు వ్యవహరించటం వేరు. ముఖ్యమంత్రి రెండో కోవకు చెందిన వారు. చేతిలో అధికారం ఉంటే కొండ మీద కొతి సైతం దిగి వస్తుంది. అలాంటిది.. ‘‘నేను చాలా ధైర్యవంతుడ్ని‘‘ అన్న కలర్ వచ్చేలా చూసుకోవటం అంత కష్టమైనదేమీ కాదు.

ముఖ్యమంత్రిగా కిరణ్ తనకు తాను ఎప్పుడూ అనుకోలేదు కూడా. అలాంటి ఆయన సోనియమ్మ చలువతో ఏకంగా ముఖ్యమంత్రే అయిపోయారు. ఇక.. ఒకసారి పదవి రుచి చూసిన తర్వాత దాన్ని నిలుపుకోవటం కోసం ఎంతకైనా అన్నట్లు వ్యవహరించటం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. ఇందుకు కిరణ్ సైతం మినహాయింపు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియమ్మ పర్సనల్ గా తీసుకోవటంతో.. ఆ వ్యవహారం ఉరుకులు పరుగులు పెడుతోంది. మిగిలిన విషయాలేవైనా అయితే కిరణ్ సైతం సరేనని మ్యాగ్జిమమ్ హెల్ప్ చేసేవారేమో.

కానీ.. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉండటం.. ఫ్యామిలీ పరంగా కొన్ని కమిట్ మెంట్స్ తో పాటు.. ఇమేజ్ ని చెడగొట్టుకోవటానికి ఏ పొలిటికల్ ఫ్యామిలీ లీడరు ఇష్టపడరు. సీఎం కిరణ్ కూడా అదే పరిస్థితి. తన తండ్రి అమరనాథ్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి.  ఇప్పుడు మహా మహా నేతలుగా చెప్పే చంద్రబాబు కావొచ్చు.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కావొచ్చు. వారిద్దరూ కిరణ్ తండ్రికి ఫాలోయర్స్ అన్న విషయం మర్చిపోవద్దు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న తమ ఫ్యామిలీ అధికారంలో ఉన్న సమయంలో రాస్ట్రం రెండు ముక్కలుగా విడిపోవటం కిరణ్ కు పర్సనల్ గా ఇష్టం లేదు. అందుకే సోనియమ్మతో సైతం ఆయన ఢీ అనేందుకు రెఢీ అయ్యారు. ఆయన సోనియమ్మకు ఎంతగా దూరం అయ్యారంటే.. కిరణ్ పేరును సైతం ఆమె వినటానికి ఇష్టం లేనంతగా.

రాష్ట్ర విభజన కోసం సోనియమ్మ క్రోధానికి సైతం సిద్ధమైన కిరణ్... విభజన జరగకుండా ఉండేందుకు పావులు కదపటం మొదలుపెట్టారు. దానికి తోడు ‘భయంతో ముందస్తు చర్యలు’ తీసుకునే మనస్తత్వం పుణ్యమా అని సీఎం రేసులో ఉన్నారన్న సమాచారం తెలిసిన వెంటనే వారి వ్యవహారాన్ని బయటపెట్టటం ద్వారా తనకు మట్టి అంటకుండా చూసుకుంటున్నారు. అలా సమైక్యం నీడన.. తన పదవికి పోటీ పడుతున్న వారిపై విభజన వాదుల ముద్ర వేస్తూ.. వారిని భయపెడుతున్నారు.

మూడు నెలల ముఖ్యమంత్రిగా కన్నా పేరును  పార్టీ అధినాయకత్వం పరిశీలిస్తుందన్న సమాచారం అందుకున్న ఆయన.. అది బయటకు పొక్కేలా పావులు కదిపారు. తన మాదిరే స్పీకర్ స్థానం నుంచి సీఎం స్థానానికి ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న చిన్నపాటి సమాచారంతో ఆయన సంగతి తేల్చే పనిలో పడ్డారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సమైక్య ఉద్యమంలో ఉధృతంగా సాగినప్పుడు కానీ ఇప్పటి వరకూ స్పీకర్ మనోహర్ (గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే) బయటకు రాలేదు. తన పేరు అస్సలు ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. తనకు మాదిరే ముందస్తు జాగ్రత్తలో ఆరితేరిన మనోహర్ తనకు ముప్పు అయ్యే ప్రమాదం ఉందని భావించిన కిరణ్ చివరకు సమైక్య ద్రోహుల జాబితాలో పేరు వచ్చేలా చేయటంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు