పవన్ మరో చిరంజీవి: రాంగోపాల్ వర్మ

పవన్ మరో చిరంజీవి: రాంగోపాల్ వర్మ

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన అన్న చిరంజీవి ఇద్దరిపైనా ఒకేసారి విమర్శల వర్షం కురిపించాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ట్విటర్ వేదికగా ఆయన చిరంజీవి గతాన్ని తవ్వుతూ ప్రస్తుతం పవన్ తీరును ఆయనతో పోల్చారు.

అంతేకాదు... పవన్ కూడా మెల్లమెల్లగా చిరంజీవిలా మారుతున్నారని ఆయన అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తోక వదలి సొంతంగా అన్ని నియోజకవర్గాలకు పోటీచేస్తేనే పవన్ పోటుగాడు అని జనం నమ్ముతారన్న అర్థంలో ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ లోని నోవోటెల్ లో ఆయన జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు సింహం గర్జించినట్లుగా అనిపించిందని.. కానీ.. ఇప్పుడు అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ వెళ్తుండడం చూస్తుంటే ఆయన మెల్లగా చిరంజీవిలా మారుతున్నట్లు కనిపిస్తోందన్నారు. నొప్పింపక తానొవ్వక అంటూ ఎవరిపైనా విమర్శలు చేయకుండా పవన్ రాజకీయం చేస్తుండడంతో వర్మ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.

జయప్రకాశ్ నారాయణ్ , ఉండవల్లి వంటివారిని కలుపుకొంటూ వెళ్లడంతో ఆయన కొంత క్రెడిబులిటీ సాధించినా వచ్చే ఎన్నికల్లో పూర్తి విశ్వాసంతో అన్ని సీట్లకూ పోటీచేయకపోతే మాత్రం తన అన్న చిరంజీవి కంటే పెద్ద పొరపాటు చేసినవాడవుతాడని అన్నారు. అన్ని సీట్లకూ పోటీచేయాలని వర్మ అనడంతో టీడీపీతో కలిసి వెళ్లడం మానుకోవాలని సూచించినట్లు అర్థమవుతోంది.

కాగా వర్మ కొద్దిసేపటి కిందట జీఎస్టీ చిత్ర వివాదంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. వర్మ రూపొందించిన 'జీఎస్టీ' వెబ్ చిత్రం పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. చిత్రంలో ఆశ్లీలతపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఇదే సమయంలో మహిళలను కించపరిచేలా వర్మ మాట్లాడారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు మహిళా సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పోలీసు విచారణకు తన న్యాయవాదితో కలిసి వచ్చారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు