రఫ్ అండ్ టఫ్ నాగ్ అదరగొట్టేస్తున్నాడుగా..

రఫ్ అండ్ టఫ్ నాగ్ అదరగొట్టేస్తున్నాడుగా..

రామ్ గోపాల్ వర్మతో మళ్లీ నాగార్జున సినిమా అన్నపుడు అందరూ చాలా తేలిగ్గా కొట్టిపారేశారు. కానీ కొన్ని నెలల కిందట అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నిజంగానే రామ్ గోపాల్ వర్మతో సినిమా మొదలుపెట్టేశాడు నాగ్. ఈ సినిమా మొదలయ్యాక కూడా ఎన్నెన్నో సందేహాలు. మధ్యలో ‘కడప’ వెబ్ సిరీస్ ట్రైలర్‌తో.. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో తీసిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమాతో వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయంలో నాగార్జునతో వర్మ తీస్తున్న సినిమా మీద సందేహాలు మరింత ముసురుకున్నాయి.

కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఆన్ లైన్లో హల్ చల్ చేస్తున్న ఫొటోలు చూస్తే మాత్రం జనాల ఫీలింగ్ మారుతోంది. ఫిబ్రవరి 16తో తమ కాంబినేషన్లో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ ‘శివ’ విడుదలై 29 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వర్మతో చేస్తున్న కొత్త సినిమాకు సంబంధించి ఆన్ లైన్ పిక్స్ కొన్ని నాగ్ ట్విట్టర్లో రిలీజ్ చేశాడు. అవి చూశాక సినిమాపై జనాల అభిప్రాయం మారుతోంది. ఇటీవలే ముంబయిలో తీసిన ఒక యాక్షన్ సీన్‌కు సంబంధించిన పిక్స్ అవి. అందులో ఒక చోట నాగ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ఒక రౌడీ చొక్కా పట్టుకుని అతడి తాట తీస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఇందులో నాగ్ కండలు చూస్తే షాకవ్వాల్సిందే.

ఓవరాల్‌గా నాగ్ లుక్ కూడా బాగుంది. నాగ్‌లో ఒక కొత్త యాటిట్యూడ్ కూడా కనిపిస్తోందిందులో. ఇలాంటి పిక్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతాయనడంలో సందేహం లేదు. కొన్ని రోజుల కిందటే ఈ సినిమాకు సంబంధించి నాగ్ ఒక పాపతో కలిసి గన్ పట్టుకుని ఉన్న ఫొటో కూడా చర్చనీయాంశమైంది. మరి ఈ ఫొటోల హడావుడేనా.. సినిమాలో కూడా కంటెంట్‌ ఉంటుందా అన్నది చూడాలి. ఈ చిత్రం ఏప్రిల్ లేదా మేలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English