ఎక్కువ ఆశ‌లొద్దు.. ప‌వ‌న్ జేఏసీలో జేపీ

ఎక్కువ ఆశ‌లొద్దు.. ప‌వ‌న్ జేఏసీలో జేపీ

విభ‌జ‌న హామీలు అమ‌లు విష‌యంతో పాటు.. ఏపీ ప్ర‌త్యేక హోదాతో పాటు.. ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రం నుంచి ఏపీకి ఎంత వ‌చ్చింద‌న్న విష‌యంపై లెక్క తేల్చేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌టం తెలిసిందే.

ఈ స‌మావేశం హైద‌రాబాద్ లోని ద‌స‌ప‌ల్లా హోట‌ల్లో జ‌రుగుతోంది. ఈ స‌మావేశానికి అన్ని పార్టీల‌కు ఆహ్వానం పంపారు.  ఈ స‌మావేశానికి జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌.. ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌.. చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌.. ప‌ద్మ‌నాభ‌య్య‌.. కొణ‌తాల రామ‌కృష్ణ‌.. సీపీఐ రామ‌కృష్ణ‌.. సీపీఎం మ‌ధు.. కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్ర‌రాజు.. గౌత‌మ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ స‌మావేశానికి తెలుగుదేశం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల‌ను కూడా ఆహ్వానించామ‌ని కానీ వారు రాలేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. వారెందుకు రాలేదో త‌మ‌కు తెలీద‌ని చెప్పిన ప‌వ‌న్‌.. సమావేశ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలో ఎవ‌రి పంథాలో వాళ్లు వెళుతున్న‌ట్లుగా ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. జేఎఫ్సీ స‌మావేశాలు జ‌రుగుతుంటాయ‌ని చెప్పారు.

ఈ స‌మావేశానికి హాజ‌రైన జేపీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.త‌మ మీద ఎక్కువ ఆశ‌లు పెట్టుకోవ‌ద్ద‌న్నారు. త‌మ‌ను ఆకాశానికి ఎత్తేయొద్ద‌ని..ఏపీకి వ‌చ్చే నిధుల విష‌యంలో జ‌రుగుతున్న అన్యాయంపై పోరాటంలో త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని జేపీ చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ ఉద‌యం ట్యాంక్ బండ్ వ‌ద్ద‌నున్న అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు