ప‌వ‌న్ పోరుకు బాబు మ‌ద్దతిచ్చిన‌ట్లేగా!

ప‌వ‌న్ పోరుకు బాబు మ‌ద్దతిచ్చిన‌ట్లేగా!

ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రారంభించిన పోరుకు... అన్ని వైపుల నుంచి మ‌ద్ద‌తు వ‌స్తోంది. విప‌క్షాల నుంచే కాకుండా అధికార ప‌క్షం నుంచి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ పోరుకు మ‌ద్ద‌తు ద‌క్కింద‌నే చెప్పాలి. మొన్న‌టి బ‌డ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం అర‌కొర కేటాయింపుల‌తో స‌రిపెట్టిన విష‌యం తెలిసిందే. వేల కోట్ల మేర నిధులు ఇవ్వాల్సి ఉన్న చోట వంద కోట్ల నిధుల‌ను కూడా ఇవ్వ‌కుండా.. కేంద్రం నిజంగానే ఏపీకి తీవ్ర అన్యాయం చేసింది. అయితే త‌న మిత్ర‌ప‌క్ష‌మే కేంద్రంలో అధికారంలో ఉంద‌న్న భ‌రోసా, ఎప్ప‌టికైనా న్యాయం చేయ‌క‌పోతారా? అన్న న‌మ్మకంతో టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కూడా ఓపిగ్గానే ఉంటున్నారు. అయితే చివ‌రి బ‌డ్జెట్‌లో కూడా నిధుల కేటాయింపు మాట లేకుంటే... ఎలాగంటూ ఇప్పుడు బాబు కూడా నిర‌స‌న గ‌ళం విప్ప‌క త‌ప్ప‌లేదు. ఎన్నాళ్ల‌ని ఓపిక ప‌డ‌తామంటూ చంద్ర‌బాబు వ్య‌క్తం చేస్తున్న ఆవేద‌న‌తో ఇప్పుడు బీజేపీ నిజంగానే అయోమ‌యంలో ప‌డిపోయిందన్న వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఏపీ ప్ర‌జ‌లు కూడా కేంద్రం వైఖ‌రిపై నిప్పులు చెరుగుతున్నారు. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఏకంగా కేంద్రంపైకి భారీ పోరాటాన్నే ప్ర‌క‌టించారు. జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ క‌మిటీ (జేఎఫ్‌సీ) పేరిట ఓ కార్యాచ‌ర‌ణ క‌మిటీని ఏర్పాటు చేసిన ప‌వ‌న్‌... అస‌లు ఇప్ప‌టిదాకా ఏపికి ఎన్ని నిధులు ఇచ్చారో లెక్క‌లు చెప్పాలంటూ ఆయ‌న కేంద్రానికి దాదాపుగా అల్టిమేటం జారీ చేశార‌నే చెప్పాలి. అదే స‌మ‌యంలో కేంద్రం నుంచి ఇప్ప‌టిదాకా మ‌న‌కు ఎంత‌మేర నిధులు అందాయ‌న్న విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు స‌ర్కారు విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ రెండు నివేదిక‌ల‌ను త‌న క‌మిటీ ప‌రిశీలిస్తుంద‌ని, త‌ప్పు ఎవ‌రిదో తేలిపోతుంద‌ని, ఏపీకి అన్యాయం చేసిన వారెవ‌ర‌న్న విష‌యం రూడీ అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ క్ర‌మంలో ఈ నివేదిక‌ను బీజేపీ స‌ర్కారు ఇస్తుందో, లేదో తెలియ‌దు గానీ... చంద్ర‌బాబు స‌ర్కారు మాత్రం ఇప్ప‌టికే త‌న నివేదిక‌ను బ‌హిర్గతం చేశామ‌ని, ఒక్క ప‌వ‌న్ క‌ల్యాణే కాకుండా ఎవ‌రైనా చూసుకోవ‌చ్చ‌ని, అది ఆన్‌లైన్‌లోనే ఉంద‌ని కూడా టీడీపీ స‌ర్కారు ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉంటే... అస‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉద్య‌మంపై టీడీపీ ఎలా స్పందిస్తుంద‌న్న విష‌యంపై చాలా ఊహాగానాలే రాగా... వాట‌న్నింటినీ ప‌టాపంచ‌లు చేస్తూ చంద్ర‌బాబు... ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఫుల్ స‌పోర్ట్ ఇస్తూ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న  చేశారు. పవ‌న్ పోరుపై చంద్ర‌బాబు ఏమన్నార‌న్న విష‌యానికి వ‌స్తే... పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఏసీతో తెలుగుదేశానికి ఇబ్బంది లేదు. పవన్ పోరాటంలో అర్థం ఉంది. రాష్ట్రానికి మేలు జరగాలనే కాంక్షతో తనకు తోచిన విధానంలో పవన్ వెళ్తున్నారు. తెలుగుదేశం ఉద్దేశం కూడా రాష్ట్రానికి మేలు జరగాలనే. శ్వేత పత్రాలు అడిగితే సున్నిత పద్ధతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు ఏది అడిగినా ఇచ్చేందుకు మనకు అభ్యంతరం లేదు. కేంద్రం ఏం చేసిందనే దానిపై శ్వేతపత్రం భాజపానే ఇవ్వాలి. ఇటీవల భాజపా నేతలు కాగితం మీద పెట్టిన 27పేజీల లెక్కలు చెప్పారే తప్ప.... ఎంత మంజూరు చేశారో చెప్పలేదు. ఈ తేడా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి* అని చంద్ర‌బాబు చాలా క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌గానే ప‌వ‌న్ పోరుకు స‌పోర్ట్ ఇచ్చారు. నేటి ఉద‌యం జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో భాగంగా చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు