ఏపీలో ఆ 6 గురు రాజీనామా చేయాలి... ఎందుకంటే !

ఏపీలో ఆ 6 గురు రాజీనామా చేయాలి... ఎందుకంటే !

బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి అడుగ‌డుగునా అన్యాయం చేసింది. ఇది తెలియ‌క చేసిన పొర‌పాటు కాదు... బీజేపీ ఉద్దేశ పూర్వ‌క నిర్ల‌క్ష్యం. ఈరోజు ఏపీ ఇంత క‌ష్టాల్లో ఉందంటే... దానికి ఏకైక కార‌ణం బీజేపీయే అని ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ జేఏసీ క‌మిటీ ఏర్పాటు చ‌ర్చ‌ల్లో  పాల్గొంటున్న సీపీఐ నేత రామ‌కృష్ణ  అన్నారు. బీజేపీ అరాచ‌కాల‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబుకు ఆయ‌న ఒక లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన డిమాండ్ల‌లో ఇంపార్టెంట్ డిమాండ్‌... ఆరుగురి రాష్ట్ర నేత‌ల రాజీనామాలు.

ఎవ‌రా ఆరుగురు అంటే...  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హ‌రిబాబు, న‌ర్సాపురం ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు.  ఎమ్మెల్యేలు ఆకుల స‌త్య‌నారాయ‌ణ (రాజ‌మండ్రి అర్బ‌న్‌), కామినేని శ్రీ‌నివాస్ (కైక‌లూరు), పెన్మ‌త్స విష్ణుకుమార్ రాజు(విశాఖ ప‌ట్నం నార్త్‌), పైడికొండ‌ల మాణిక్యాల‌రావు (తాడేప‌ల్లిగూడెం). వీరంతా ఏపీ నుంచి పార్ల‌మెంటుకు, అసెంబ్లీకి ఎన్నిక‌యిన నేతలు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బీజేపీ చేసిన మోసాల‌కు వీరు స్థానిక బాధ్యులు. కేంద్రం త‌ప్పు చేస్తే చెప్ప‌క పోగా... సొంత రాష్ట్రం న‌ష్ట‌పోతున్నా కేంద్రానికి వ‌త్తాసు  పలికి రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. అన్యాయం చేశారు. జ‌న్మ‌భూమికి అన్యాయం చేశారు. ముంత మ‌ట్టి, చెంబు నీళ్లు ఇస్తే రాజ‌ధాని వ‌స్తుందా మోడీ అని నిల‌దీయాల్సిన నేత‌లు ఇంకా బీజేపీ న్యాయం చేసింద‌ని అంటున్నారంటే అది అరాచ‌కం.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ప‌దేళ్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇది సాక్షాత్తు పార్లమెంటులో చేసిన ప్ర‌క‌ట‌న‌. ప్ర‌జాస్వామ్యంలో పార్ల‌మెంటును మించిన వ్య‌వ‌స్థ ఏదీ లేదు. చ‌ట్టం కూడా ఇదే చెబుతుంది. కానీ మోడీ నియ‌మించిన ఆర్థిక సంఘం, పార్ల‌మెంటు త‌ల‌చుకుంటే ఒక్క క‌లం వేటుతో తొల‌గించ‌గ‌లిగిన ఆర్థిక సంఘం చెప్పింద‌ని రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదు అంటున్నారంటే..అది ఒక ఉద్దేశ‌పూర్వ‌క ద‌గా త‌ప్ప మ‌రోటి కాదు అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. క‌నీసం ఘ‌నంగా ప్ర‌క‌టించిన ప్యాకేజీ అయినా ఇచ్చారా అంటే అది లేదు. కేవ‌లం ఐదారు శాతం నిధులు ఇచ్చారంతే. ఈ అన్యాయాల‌కు ప్ర‌త్య‌క్ష సాక్షులు అయిన బీజేపీ రాష్ట్ర నేత‌లు... క‌ళ్లు తెరిచి మేము పార్టీని అడ‌గ‌లేక‌పోతున్నాం అని ఒప్పుకుని త‌క్ష‌ణం రాజీనామా చేసి పాపాలు క‌డుక్కోవాలి. విలువ‌లు కాపాడుకోవాలి అని ఆయ‌న సూచించారు.  ప్ర‌త్యేక హోదా పొందే అర్హ‌త రాష్ట్రానికి ఉంది. ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు. క‌చ్చితంగా ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం న్యాయం చేయాలి అని ఆయ‌న డిమాండ్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు