గ‌మ‌నికః న‌వ్వుపై జీఎస్టీ లేదు

గ‌మ‌నికః న‌వ్వుపై జీఎస్టీ లేదు

రాజ్యసభలో నవ్విన తనను రామాయణం సీరియల్‌లో శూర్పణఖతో పోల్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకురాలు,  రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ఎదురుదాడికి దిగారు. నవ్వుపై ఎలాంటి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) లేదని, తాను నవ్వడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకోవలసిన అవసరం అంతకన్నా లేదని ఆమె అన్నారు. తనకు వ్యతిరేకంగా మోడీ చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల ఆయన ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా విలేక‌రులతో మాట్లాడుతూ తన నవ్వుపై మోడీ వ్యాఖ్యలు చేసిన తరువాత దేశవ్యాప్తంగా గల మహిళల నుంచి తనకు పెద్ద ఎత్తున మద్దతు లభించిందని తెలిపారు. ‘నేను అయిదుసార్లు ఎంపీగా గెలిచాను. ప్రధానమంత్రి నన్ను ఒక ప్రతికూల పాత్రతో పోల్చారు. అయితే, ఈ రోజు మహిళలు మారిపోయారనే విషయాన్ని ఆయన మరచిపోయారు. తమ కోసం తాము ఎలా మాట్లాడాలో ఈ రోజు మహిళలకు తెలుసు. మహిళల పట్ల మోడీ ఆలోచనావిధానాన్ని ఆయన వ్యాఖ్యలు ప్రతిబింబించాయి’ అని రేణుకాచౌదరి అన్నారు. ‘నేను నా నవ్వుతో అధికారాన్ని సవాలు చేశాను. పార్లమెంటు చట్టాలు చేస్తుంది. అయితే, తమకు సమానులయిన మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలి, మహిళలు తమ స్వంత హక్కులతో ఇక్కడ ఉన్నారనే విషయాన్ని చట్టసభల సభ్యులకు బోధించవలసిన అవసరం మనకు ఏర్పడింది. పార్లమెంటు మన సమాజానికి ప్రతిరూపం’ అని రేణుకాచౌదరి పేర్కొన్నారు.

పనాజిలో లింగ వివక్షపై జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న ఆమె విడిగా విలేఖరులతో మాట్లాడుతూ తన ప్రజాజీవితం అంతా ప్రజల మద్దతుతోనే సాగుతూ వచ్చిందని తెలిపారు. ‘నీవు సరిగా ఉంటే, అంతటా అది ప్రతిధ్వనిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నదదే. ఎప్పుడు, ఎలా ఉండాలనేదానికి నియమాలు ఏమీ లేవు. నీవు నవ్వు. నవ్వుపై జీఎస్‌టీ లేదు. అయిదుసార్లు ఎంపీగా గెలిచిన నాకు నవ్వడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. పురాణాల్లోని ఒక ప్రతికూల పాత్రతో నన్ను పోల్చినందుకు నేను కలత చెందాను’ అని రేణుకాచౌదరి అన్నారు. సాధారణంగా తాను యాదృచ్ఛికంగా నవ్వుతుంటానని, అయితే ఈసారి తాను చేతనతోనే నవ్వానని ఆమె వివరించారు. తాను తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా కొన్నేళ్ల‌ క్రితమే అధికారాన్ని సవాలు చేశానని ఆమె అన్నారు. ‘నా తండ్రి నన్ను ఈ దేశ సిటిజన్‌గా పెంచారు. ఒక బాలుడిగానో, బాలికగానో కాదు’ అని రేణుకాచౌదరి అన్నారు.

కాగా, కాంగ్రెస్ సభ్యురాలు రేణుకాచౌదరిని రామాయణం సీరియల్‌లోని శూర్పణఖ పాత్రతో పోలుస్తూ రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా మలచుకుంది. మహాభారత యుద్ధంలో కౌరవుల నాశనానికి హేతువుగా నిలిచిన నిండుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడి దురాగతాన్ని ప్రతిబింబించే వాల్‌పోస్టర్‌ను రూపొందించి విడుదల చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడానికి సమాయత్తమయింది. మయసభలో దుర్యోధనుని అవస్థలు చూసి పక్కున నవ్విన ద్రౌపది నవ్వు చివరకు కౌరవుల నాశనానికి నాంది పలికినట్టుగా రేణుకాచౌదరి నవ్వు, తదనంతర పరిణామాలను మహాభారతంలోని దృశ్యాలతో పోలుస్తూ కాంగ్రెస్ పార్టీ విడుదల పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English