చివ‌రి రోజు నరేంద్రమోడీపై ముప్పేట దాడి

చివ‌రి రోజు నరేంద్రమోడీపై ముప్పేట దాడి

ప్రధాని నరేంద్రమోడీపై పార్ల‌మెంటు స‌మావేశాల చివ‌రి రోజు ముప్పేట దాడి జ‌రిగింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కోసం టీడీపీ చిత్తూరు ఎంపీ ఎన్ శివప్రసాద్.. రోజుకో విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో తాంత్రికుడిగా శివప్రసాద్ అవతారమెత్తారు. మంత్రాలు చదువుతూ పార్లమెంట్ ఆవరణలో ఆయన పూజలు చేశారు. శ్రీవెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలను మోడీ మరిచిపోయారని పేర్కొన్నారు. తన ద్వారా స్వామి వారు.. ప్రధాని మోడీకి ప్రత్యేక ప్యాకేజీ సందేశం పంపామని చెప్పారని శివప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మోడీ ఆటలాడుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు.

మ‌రోవైపు సీఎం కేసీఆర్ స‌న్నిహితుడిగా పేరొందిన టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవ రావు ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదన్న మోడీ వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా రాజ్యసభలో మాట్లాడిన కేశవరావు కేంద్రం విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో రెండు నదులు పారుతున్నా నీటి వినియోగం విషయంలో రాష్ట్రానికి ఇప్పటికీ అన్యాయం జరుగుతోందన్న ఆయన తెలంగాణకు కేంద్రం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన నిధులను  మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రోవైపు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ప్రివిలిజ్ మోషన్ దాఖలు చేశారు. రాజ్యసభలో ప్రధాని మోడీ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో షేర్ చేయడంపై ఆగ్రహించిన ఆమె.. రాజ్యసభ చైర్మన్ కు కంప్లైంట్ చేశారు. అయితే ఇందులో తాను చేసిన తప్పేంటని రిజిజు మరో ట్వీట్ చేశారు. రాజ్యసభలో ఆమె ప్రవర్తనను చైర్మన్ వెంకయ్య నాయుడే తప్పుబట్టారని, ఇందులో తాను మహిళలను అవమానించేలా ఏం చేశానని ఆయన ప్రశ్నించారు. ఆమె అంతలా నవ్వినా.. ప్రధాని ఏకాగ్రత కోల్పోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారని మాత్రమే చెప్పానని స్పష్టంచేశారు. అటు కాంగ్రెస్ మాత్రం ఇది మహిళలను కించపరడమే అవుతుందని, ప్రధాని హద్దు దాటి మాట్లాడారని ఆరోపించింది. రాజ్యసభలో మాట్లాడుతున్న సందర్భంగా.. ఆధార్ కాంగ్రెస్ గొప్పతనం కాదని, 20 ఏళ్ల కిందటే అద్వానీ ఆధార్ గురించి మాట్లాడారని ప్రధాని మోడీ చెప్పారు. దీంతో రేణుకా చౌదరి పగలబడి నవ్వారు. దీనిపై చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే మోడీ మాత్రం కామ్‌గా ఉంటూనే.. ఆమెను అలా నవ్వనివ్వండి.. రామాయణం సీరియల్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి నవ్వు చూస్తున్నాను అని పంచ్ వేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English