అందరి చూపూ చంద్రబాబు వైపే..

అందరి చూపూ చంద్రబాబు వైపే..

బీజేపీ, టీడీపీల మధ్య వ్యవహారం బెడిసికొడుతున్న సూచనలు కనిపిస్తుండడంతో జాతీయ పార్టీలు సహా అందరూ టీడీపీపై కన్నేస్తున్నారు. టీడీపీ కనుక బీజేపీ నుంచి వేరుపడితే తక్షణం టీడీపీని తమతో కలుపుకోవాలని కాంగ్రెస్, వామపక్షాలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే... అందులో భాగంగానే పార్లమెంటులో టీడీపీ ఎంపీల నిరసనకు మిగతా పార్టీల నుంచి మద్దతు దొరుకుతోంది.

    ఏపీ టీడీపీ ఎంపీలతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు  సోనియా కూడా మాట కలిపారు. అంతేకాదు.. వారు నిరసన తెలినిప్పుడు ప్లకార్డులు ఉల్టా పట్టుకుంటే దాన్ని చూసి సరి చేసుకోమని సలహా కూడా ఇచ్చారు. అయితే... టీడీపీ సైద్దాంతికంగా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ కావడంతో ఆ రెండిటి కలయిక అంత సులభం కాదు. ఆ కారణంగానే చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియక కాంగ్రెస్ పార్టీ మరీ నేరుగా సంప్రదించకుండా అనుకూల వాతావరణం కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? అన్న చర్చ కాంగ్రెస్ పెద్దల మధ్య వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. మునుపెన్నడూ లేని రీతిలో పొత్తు సాధ్యమా అన్న సంశయం మాత్రం కాంగ్రెస్ కు ఉన్నట్లు తెలుస్తోంది. పైగా రాష్ర్టాన్ని విభజించారన్న ముద్ర ఉండడంతో చంద్రబాబు ఓకే అనకపోవచ్చన్న అనుమానంతో ఇంకా దీనిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు సమాచారం.

    మరోవైపు వామపక్ష నేతలు కూడా చంద్రబాబును సంప్రదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా టీడీపీ ఎంపీల ఆందోళనకు మద్దతిచ్చారు. సీపీఎం కూడా టీడీపీ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇటీవలే కాంగ్రెస్ తో పొత్తు విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడంతో మళ్లీ టీడీపీ విషయంలో చర్చ జరగనప్పటికీ.. నేతలు తాజా పరిణామాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

    మరోవైపు పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆరెస్ కూడా ఏపీ పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కవిత ఇప్పటికే దీనిపై మాట్లాడారు. టీడీపీ ఎంపీల ఆందోళన, పోరాటం సహేతుకం అంటున్నారు. ఏపీకి న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే రెండు పార్టీల మధ్య కొంత మంచి సంబంధాలుండగా.. ఎన్నికల నాటికి పూర్తిగా పొత్తు కుదుర్చుకునేందుకు టీఆరెస్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెటిలర్లుఎక్కువగా ఉండే హైదరాబాద్ లో టీడీపీతో పొత్తు బాగా లాభిస్తుందని... కాంగ్రెస్ బలపడుతున్న నేపథ్యంలో టీడీపీతో కలిసి నడిస్తే మంచిదని టీఆరెస్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే... బీజేపీతో కలిసి ఉండడం.. విడిపోవడంతో సంబంధం లేకుండా ఈ మైత్రి ఏర్పడడానికి అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English