రాజీనామాకు సుజ‌నా రెడీ..దుబాయ్ నుంచి లైన్లోకి బాబు

రాజీనామాకు సుజ‌నా రెడీ..దుబాయ్ నుంచి లైన్లోకి బాబు

కేంద్ర బ‌డ్జెట్‌ సంద‌ర్భంగా రాజుకున్న అసంతృప్తి మంట‌ల సెగ తారాస్థాయికి చేరుతోంది. మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న బీజేపీ-టీడీపీల మ‌ధ్య విబేధాలు ఈ రోజు తారాస్థాయికి చేరాయి. దీంతో దుబాయ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లైన‌లోకి వ‌చ్చి త‌న‌దైన శైలిలో మార్గ‌ద‌ర్శ‌నం చేస్తున్నారు. మ‌రోవైపు మంత్రి సుజ‌నా చౌద‌రి రాజీనామాపై ఏపీ మంత్రి నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సుజ‌నా రాజీనామాకు రెడీగా ఉన్నార‌న్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్ నుంచి టీడీపీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ ఉభయ సభలు జ‌రుగుతున్న తీరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. లోక్ సభలో అరుణ్ జైట్లీ మాట్లాడే సమయంలో నినాదాలు చేయకుండా వెల్ లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించాలని సూచించారు. జైట్లీ ప్రసంగంలో ప్యాకేజీ ప్రస్తావన లేకపోతే మాత్రం నిరసన కొనసాగించాలని ఎంపీలను ఆయన ఆదేశించారు.

మంత్రి నారాయ‌ణ‌ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి అన్యాయంపై సుజనాచౌదరి మాట్లాడుతుంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడ్డుకోవడం అన్యాయమన్నారు. వామపక్షాల బంద్ కు టీడీపీ కూడా మద్దతిచ్చిందన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రానికి డీపీఆర్ పంపామన్నారు. సీఎం చంద్ర‌బాబు ఆదేశిస్తే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సుజనాచౌదరి సిద్దంగా ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. కాగా, ఏపీ అభివృద్ధి కోసం సుజనా చౌదరి పార్లమెంటులో మాట్లాడుతున్న సమయంలో విజయసాయిరెడ్డి అడ్డుకోవడం దుర్మార్గ‌మ‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు మండిప‌డ్డారు. బీజేపీ నేత‌లు మిత్ర‌ధ‌ర్మ పాటించ‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌న్న గంటా.. టీడీపీ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలకంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై భారతీయ జనతాపార్టీ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీజేపీతో పొత్తును కూడా వదులుకుంటామని ఆయన ఘాటుగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అందరికీ తెలుసునని తెలుగుదేశం సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ విభజనలో రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ కు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారన్నారు. రైల్వే జోన్ గురించి మాట్లాడటమే లేదన్నారు. విద్యా సంస్థల విషయంలో కూడా రాష్ట్రానికి నిధులు విదుల్చుతున్నారని సీఎం రమేష్ అన్నారు. అరకొర నిధులతో ఆ విద్యా సంస్థలు ఎప్పటికి పూర్తయ్యేనని సీఎం రమేష్ పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో విషయంలో కేంద్ర వ్యవహార శైలి సరిగా లేదని విమర్శించారు. కర్నాటకకు, బెంగళూరు మెట్రోకు నిధులు ఇచ్చి ఏపీని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. వారికో న్యాయమూ ఏపీకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English