కర్ణిసేన ఇప్పుడేం చేస్తోందో చూడండి

కర్ణిసేన ఇప్పుడేం చేస్తోందో చూడండి

‘పద్మావత్’ సినిమా విషయంలో కర్ణిసేన ఎంత గొడవ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో అసలేం చూపిస్తున్నారో తెలుసుకోకుండా షూటింగ్ మొదలైనప్పట్నుంచే గొడవ మొదలుపెట్టారు. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ మీద భౌతిక దాడి చేశారు. షూటింగ్ చేస్తున్న సెట్‌ను తగలబెట్టారు. రిలీజ్‌కు ముందు, తర్వాత కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు.

ఇంతా చేసి చివరికి సినిమా చూశాక యు-టర్న్ తీసుకున్నారు. ఇది రాజ్ పుత్‌ల గౌరవాన్ని పెంచే సినిమా అని.. వాళ్లను గొప్పగా చూపించారని.. ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయిన రాష్ట్రాల్లో ప్రదర్శనకు సహకరిస్తామని ప్రకటించారు. ఎలాగైతేనేమి కర్ణిసేన కళ్లు తెరుచుకుందని అనుకున్నారంతా.

కానీ ఇప్పుడు అదే కర్ణిసేన మరో సినిమా విషయంలో వ్యవహరిస్తున్న తీరు అందరికీ షాకింగ్‌గా ఉంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం ‘మణికర్ణిక’ విషయంలో సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ అభ్యంతరాలు వ్యక్తం చేయడం తెలిసిన సంగతే. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయికి.. ఒక బ్రిటిష్ వ్యక్తికి మధ్య ప్రేమాయణాన్ని చూపిస్తున్నారని.. ఇది అభ్యంతరకరమని మహాసభ అంటోంది. సినిమా చూడకుండానే వాళ్లు చేస్తున్న ఆరోపణలు ఆశ్చర్యం కలిగిస్తుంటే.. వాళ్లకు కర్ణిసేన మద్దతు పలకడం గమనార్హం.

బ్రాహ్మణులకు ఏదైనా ఇబ్బంది కలిగితే కర్ణిసేన ఊరుకోదని.. అలాగే కర్ణిసేనకు ఇబ్బందైనా బ్రాహ్మణులు ఊరుకోరని.. ‘పద్మావత్’ సినిమాకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు రక్తంతో సంతకం చేసిన పదివేల ఉత్తరాలు పంపారని.. ఈ నేపథ్యంలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని భావిస్తున్న ‘మణికర్ణిక’ను తాము కూడా వ్యతిరేకిస్తామని కర్ణిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కల్వి ప్రకటించాడు. ఐతే ‘పద్మావత్’ విషయంలో చివరికి యు-టర్న్ తీసుకోవడం ద్వారా తాము తప్పు చేశామని పరోక్షంగా అంగీకరించిన కర్ణిసేన.. ఇప్పుడు ‘మణికర్ణిక’ సినిమాలో కూడా ఏముందో తెలియకుండా చేస్తున్న ఆందోళనకు మద్దతు పలకడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English