పవన్ అడగటమే ఆల‌స్యం ఆ ఇద్ద‌రు ఓకే చేశారు

పవన్ అడగటమే ఆల‌స్యం ఆ ఇద్ద‌రు ఓకే చేశారు

జ‌నసేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నూత‌న ఆలోచ‌న వెంట‌నే ప‌ట్టాల మీదికి ఎక్కింది. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో జేఏసీ ఏర్ప‌డిన‌ట్లే...ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌జ‌ల ఆకాంక్ష కోసం కూడా మేధావులు క‌లిసి రావాల‌ని...అందుకోసం తాను లోక్‌స‌త్తా ర‌థ‌సార‌థి, మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌గా కొన‌సాగి ఆ పార్టీకి దూరంగా ఉంటున్న  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లతో కలిసి రాజకీయ జేఏసీ ఏర్పాటు చేస్తానని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆల‌స్యం త‌దుప‌రి అడుగులు ప‌డిపోయాయ‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే ఈ రెండు వైపుల నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డం విశేషం. ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఉండ‌వ‌ల్లి సంతోషం వ్య‌క్తం చేశారు. తనకు ఎలాంటి పరిచయం లేని పవన్ తన పేరును ప్రకటించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. జేఏసీ ఏర్పాటు, ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష కోసం ముందుకు సాగ‌డం వంటి అంశాల గురించి తెలియ‌జేస్తూ...బుధ‌వారం సాయంత్రం పవన్ కల్యాణ్ ఫోన్ చేశారని ఉండ‌వ‌ల్లి వివ‌రించారు. ఈ నెల 11న హైదరాబాద్‌లో భేటీ అవ్వబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. త‌ను మేధావిని కాద‌ని ప‌వ‌న్‌తో చెప్పానని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఏపీ ప్ర‌జ‌ల కోసం క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌ని ప్రక‌టించిన‌ట్లు వివ‌రించారు.

కాగా, లోక్‌స‌త్తా వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. లోక్‌స‌త్తా వ్య‌వ‌స్థాపకుడు జేపీని, ఆ పార్టీకి చెందిన రెండు రాష్ర్టాల క‌న్వీన‌ర్ బండారు రామ్మోహ‌న్‌రావును గురువారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌వ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు లోక్‌స‌త్తా కార్యాల‌యంలో ఈ భేటీ జ‌ర‌గ‌నుంది. కాగా, ప‌వ‌న్ అడ‌గ‌ట‌మే ఆల‌స్యం అన్న‌ట్లుగా ఇద్ద‌రు ప్ర‌ముఖులు స్పందించ‌డం విశేషమ‌ని చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English