11న ప‌వ‌న్ తో భేటీ అవుతా: ఉండ‌వ‌ల్లి

11న ప‌వ‌న్ తో భేటీ అవుతా: ఉండ‌వ‌ల్లి

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు పై జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తొలిసారిగా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించిన సంగ‌తి తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం మొండి చెయ్యి చూపిన‌పుడు తాను ఉద్య‌మం చేయ‌బోతుంటే....కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ బ్ర‌హ్మాండంగా ఉందంటూ  చంద్ర‌బాబు త‌న‌కు న‌చ్చ‌జెప్ప‌డంతో ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్నాన‌ని ప‌వ‌న్ అన్నారు. ఆ ప్యాకేజీలో భాగంగా కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది....అన్న విష‌యాలు త‌న‌కు స్ప‌ష్టంగా చెప్ప‌లేద‌ని, అర‌కొర స‌మాచారంతో త‌న‌ను మ‌భ్య‌పెట్టార‌ని ప‌వ‌న్ భంగ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఆధ్వర్యంలో తెలంగాణ‌ రాష్ట్ర సాధనకు ఏర్ప‌డిన జేఏసీ త‌ర‌హాలోనే, ఏపీలోని  మేధావులతో, రాజ‌కీయ నాయ‌కుల‌తో క‌లిసి ఓ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయ‌బోతున్నట్లు తెలిపారు. ఉండ‌వ‌ల్లి , జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ వంటి వారు అందులో భాగ‌స్వాముల‌వుతార‌ని, త్వ‌ర‌లోనే నే కార్య‌చరణ ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. తాజాగా, జేఏసీ ఏర్పాటు పై, ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఈ నెల 11న క‌ల‌వ‌బోతున్నాన‌ని ఉండ‌వ‌ల్లి  స్వ‌యంగా తెలిపారు. పవన్ ఏర్పాటు చేయ‌బోతోన్న జేఏసీలో భాగ‌స్వామి అయ్యేందుకు త‌న‌కెలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పారు. జేఏసీకి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తానని చెప్పారు. వివాదాలు, యుద్ధవాతావరణం సృష్టించే శక్తి తనకు లేదని, త‌న‌పై అలాంటి అంచనాలు పెట్టుకోవ‌ద్దని పవన్ తో చెప్పాన‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. తనతో ప‌వ‌న్ చాలా హుందాగా మాట్లాడార‌ని, చాలా ప‌రిప‌క్వ‌త క‌లిగిన పెద్దవాళ్ల తరహాలో మాట్లాడారని, త‌న ఆలోచ‌న‌ల‌ను ప‌వ‌న్ తో పంచుకుంటాన‌ని చెప్పారు. ప‌వ‌న్ తో భేటీ అనంత‌రం ఆయ‌న అభిప్రాయాలేమిటో తెలిశాక మిగ‌తా విష‌యాలు వెల్ల‌డిస్తాన‌న్నారు. ప‌వ‌న్ ఏర్పాటు చేయ‌బోయే జేఏసీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌న్నారు. అంతేకాకుండా, ఏపీలో మరో పాతికేళ్ల వరకూ ఉద్యమాల‌నేవి ఉండ‌వని, దాదాపుగా ఉమ్మ‌డి ఏపీలో సమైక్యాంధ్ర ఉద్యమమే చివ‌రిదని అభిప్రాయ‌ప‌డ్డారు. భ‌విష్య‌త్తులో ఏపీ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళతారని, వారి స‌మ‌స్య‌ల‌ను రాజ్యాంగ‌బ‌ద్ధంగానే ప‌రిష్క‌రించుకుంటార‌ని చెప్పారు. ఏదేమైనా, ప‌వ‌న్ తో ఉండ‌వ‌ల్లి భేటీ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English