వైసీపీ గొంతులో టీడీపీ వెల‌క్కాయ‌

వైసీపీ గొంతులో టీడీపీ వెల‌క్కాయ‌

ఒక్కోసారి ఎదుటివారి బ‌ల‌హీన‌త ఇత‌రుల‌కు బ‌లం అవుతుంటుంది. దానినే న‌మ్ముకుని బ‌తుకుదాం అనుకుంటే అడ్డంగా దొరికిపోవ‌డం గ్యారంటీ. చంద్ర‌బాబు విష‌యంలో వైసీపీకి ఇలాగే బుక్క‌య్యింది. తెలుగుదేశం గ‌త ఎన్నిక‌ల ముందు నుంచే బీజేపీ కూట‌మిలో ఉంది. ఎన్నిక‌ల ముందు కూట‌మి కాబ‌ట్టి ప‌ర‌స్ప‌రం కొన్ని మొహ‌మాటాలు ఆబ్లిగేష‌న్లు ఉంటాయి. అందుకే కేంద్ర ప్ర‌భుత్వంలో టీడీపీ భాగ‌స్వామి అయ్యింది. అయితే, త‌ద‌నంత‌రం బ‌ల‌ప‌డిన మోడీ కొంత‌కాలం మిత్రుల ముందు త‌ల  ఎగ‌రేశాడు. అయితే, ట‌పీ మ‌ని తెంచుకోవ‌డానికి అదేమీ వ్యాపార సంబంధం కాదు కాబ‌ట్టి మోడీ నిర్ల‌క్ష్యాన్ని భ‌రిస్తూ వ‌చ్చింది తెలుగుదేశం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీలు ఏమీ నెర‌వేర్చే దిశ‌గా మోడీ ప్ర‌భుత్వం క‌ద‌ల‌లేదు. కొంత‌కాలం అంద‌రూ ఎదురుచూశారు. హోదాకి డైరెక్టుగా నో చెప్పేశారు. స‌రే గొడ‌వ‌లు పెట్టుకుంటే రాష్ట్రం అన్యాయం అవుతుంద‌న్న ఉద్దేశంతో ప్ర‌త్యేక ప్యాకేజీ ఏపీ ప్ర‌భుత్వం, ప్ర‌జ‌లు కూడా స‌రే అన్నారు. కానీ అది కూడా నెర‌వేర్చ‌డంలో బీజేపీ విఫ‌లం అయ్యింది.

చివ‌ర‌కు బీజేపీ ప్ర‌భుత్వంలో చివ‌రి బ‌డ్జెట్ (ముంద‌స్తు ఎన్నిక‌లొస్తే) అనుకుంటున్న దానిలో కూడా ఏపీని గాలికొదిలేశారు. అయితే, ఈ సంధి కాలంలో కేంద్రాన్ని ఏమీ అన‌కుండా చంద్ర‌బాబును వైసీపీ నిందిస్తూ వ‌చ్చింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌కు సంబంధించి కేంద్రంపై నిర‌స‌న తెల‌ప‌కుండా చంద్ర‌బాబు గ‌ట్టిగా ఏమీ దానిపై మాట్లాడ‌లేడు కాబ‌ట్టి బాబు ని నిందిస్తూ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది.

ఏ కార్య‌క్ర‌మం కూడా కేంద్రాన్ని టార్గెట్ చేసి నిధులు అడిగే దిశ‌గా నిర్వ‌హించ‌లేదు. అంటే రాష్ట్ర సంక్షేమాన్ని త‌న సింప‌తీ కోసం వాడుకోవ‌డానికి వైసీపీ ప్ర‌య‌త్నించింది. ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మోడీని క‌లుస్తున్నారే గాని రాష్ట్రం గురించి నిధుల గురించి అడ‌గ‌లేదు. మొత్తానికి ఏపీకి నిధులు అనే అంశాన్ని ప‌ట్టుకుని చంద్ర‌బాబును కొంత‌కాలం ఇరుకున పెట్టిన వైసీపీ తాజాగా అనూహ్యంగా ఇరుకున ప‌డింది. ఇటీవ‌లే బీజేపీ వైపు చూస్తున్న జ‌గ‌న్ కు ఇది సంక‌ట ప‌రిణామంగా త‌యార‌య్యింది.

రాష్ట్ర ప్ర‌జ‌ల్లో బీజేపీపై ఉన్న వ్య‌తిరేక‌త‌, నిధుల విష‌యంలో జ‌రిగిన అన్యాయం ప‌తాక స్థాయికి చేరిన నేప‌థ్యంలో ఓపిక న‌శించిన టీడీపీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీపై యుద్ధం మొద‌లుపెట్టింది. పార్ల‌మెంటులో టీడీపీ ఎంపీలు స‌మావేశాల‌ను అడ్డుకున్నారు. అయితే ఈ ప‌రిణామాన్ని ఊహించ‌ని వైసీపీ ఖంగు తిన్న‌ది. నిన్న టీడీపీ స్పీక‌ర్ పోడియం వ‌ద్ద కు వెళ్లి రోజంతా నిర‌స‌న తెలిపారు.
గాంధీ బొమ్మ వ‌ద్ద పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో నిర‌స‌న తెలిపారు. అయితే, నిర‌స‌న చేయ‌క‌పోతే మైలేజీ టీడీపీకి వెళ్తుంది. చేస్తేనేమో బీజేపీతో బంధం కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు విఫ‌లం అవుతాయ‌న్న భ‌యం ఒక‌వైపు ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎంపీలు కేవ‌లం నాలుగు నిమిషాలు పార్ల‌మెంటు త‌లుపు వ‌ద్ద ధ‌ర్నా చేసి విర‌మించారు. అనంత‌రం ఈరోజు టీడీపీ పార్ల‌మెంటులో ధ‌ర్నా చేస్తుంటే వైసీపీ ఎంపీలు బ‌య‌ట గాంధీ బొమ్మ వ‌ద్ద ధ‌ర్నాకు దిగి మోడీ కంట ప‌డ‌కుండా నిర‌స‌న తెలుపుతున్నారు.

అనూహ్య‌మైన ఈ సంఘ‌ట‌న‌ల‌తో వైసీపీ గొంతులో వెల‌క్కాయ ప‌డిన‌ట్ల‌యింది. ఇపుడు టీడీపీ ఎంపీల ధ‌ర్నా జాతీయ మీడియాలో బ్యాన‌ర్‌. చంద్ర‌బాబుకు మోడీ నుంచి మంత్రులు, వివిధ శాఖ‌ల నుంచి ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాజ‌కీయాల‌న్నీ అటుంచిదే ఈ సంద‌ర్భంలో అయినా ఆంధ్ర‌కు త‌గిన‌న్ని నిధులు వ‌స్తే క్షేమం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English