ఎవ‌రు చెప్పినా వెనక్కు తగ్గని టీడీపీ

ఎవ‌రు చెప్పినా వెనక్కు తగ్గని టీడీపీ

ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటానికి దిగిన టీడీపీ ఎంపీలు మంగళవారం పార్లమెంటులో ఆందోళన చేశారు. విభజన హామీల అమలు, విశాఖ రైల్వేజోన్, పోలవరం నిధుల విడుదల తదితర అంశాలపై ఉభయ సభల్లో నిరసన తెలిపారు. కేంద్రం స్పష్టమై ప్రకటన చేసేవరకు నిరసన కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించడంతో ఎంపీలు బుధవారం కూడా పార్లమెంటులో నిరసన తెలపనున్నారు.

    ఏపీ సమస్యలు, దక్కాల్సిన ప్రయోజనాలపై కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించేంత వరకు ఆందోళన కొనసాగించాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. మంగళవారం రోజంతా జరిగిన పరిణామాలపై సాయంత్రం ఎంపీలు చంద్రబాబుకు వివరించడంతో ఆయన ఈ రకంగా సూచించినట్లు తెలుస్తోంది.

    మరోవైపు మంగళవారం లోక్‌సభ, రాజ్యసభలోనూ టీడీపీ ఎంపీలు తమ గళం వినిపించారు. అంతకుముందు ప్రధాని మోదీతో టీడీపీకి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యి ఏపీ సమస్యలను ఆయనకు వివరించారు. రాష్ర్ట సమస్యలన్నీ పరిష్కరిస్తామని.. ఆందోళన చేయొద్దని, నిరసన ఆలోచన మానుకోవాలని మోదీ ఆయనకు సూచించారు. అయినా కూడా టీడీపీ ఎంపీలు మాత్రం తమ కార్యాచరణను మార్చుకోలేదు. లోక్‌సభలో టీడీపీ ఎంపీల నిరసన సమయంలో కాంగ్రెస్‌ సభ్యులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీకి అన్యాయం జరగడానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమని తెదేపా సభ్యులు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌-తెదేపా ఎంపీల మధ్య వాగ్వాదం నెలకొంది. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను కాసేపు వాయిదా వేశారు.

    రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించి ఏపీ విభజన హామీల అమలుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామన్నారు. ప్రత్యేక హోదాతో రావాల్సిన నిధులను ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఎలా ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నామని తెలిపారు. విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్ట్‌ (ఈఏపీ) నిధుల రూపంలో ఆ లోటును భర్తీ చేస్తామని చెప్పారు. రైల్వే జోన్‌ విషయంలో ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. జోన్‌ విషయంలో సానుకూల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు. అయితే... కేంద్ర మంత్రుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గకుండా నిరసనలు కొనసాగించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు