జగన్ మనస్తత్వం రాజకీయాలకు పనికొస్తుందా?

జగన్ మనస్తత్వం రాజకీయాలకు పనికొస్తుందా?

జగన్ మనస్తత్వం రాజకీయాలకు పనికొస్తుందా... అన్న చర్చ వైఎస్సార్ సిపి వర్గాల్లోనే కాదు, ఆయన గూర్చి తెలిసిన వారితో పాటు, ఆయన వైఖరి గమనిస్తున్న రాజకీయవర్గాల్లో సైతం జరుగుతోంది. ఇంతకీ ఆయన మనస్తత్వం ఏంటి, దాని వల్ల పార్టీలో జరుగుతున్నదేంటి, అది జగన్ కు రాజకీయంగా మంచి చేస్తోందా, లేక కీడు చేస్తోందా అన్నది ఓ సారి పరిశీలిద్దాం.

ఆయన పార్టీలోనే కాదు, ఎక్కడికి వెళ్లినా సరే తన వ్యాపారాల్లో కాని, తాను పాల్గొనే సమావేశాలు, కార్యక్రమాలు ఇతరత్రా వాటిలో కూడా తాను మాత్రమే హైలెట్ కావాలనుకుంటాడు, ఆయన వలే అక్కడ మరెవరు క్లిక్ కాకూడదు, ఎట్రాక్షన్ గా కనపడకూడదు, అంతా తనే ఉండాలి. ఇది ఎంత వరకు ఉందంటే తన పార్టీ కార్యక్రమాలకు సినీ నటి రోజాను మేకప్ వేసుకుని అలా రావద్దంటూ ఆంక్షలు కూడా పెట్టాడట. ఇది నిజమో కాదో తెలియదు కాని బయటకు ఇలాంటి వార్తలు వెలుబడ్డాయి. నటుడు రాజశేఖర్ కు ఇదే తరహా అనుభవం ఎదురైంది అని అంటారు..

అందుకే ఆయనకున్న ఈ మనస్తత్వం ఆయన సొంత వ్యవహారాలు, వ్యాపారాలు, ఆయన ఇంటి వ్యవహారాల్లో అయితే ఓకే. కాని ప్రజలతో మమేకమై, ప్రజల ద్వారానే పైకి రావాల్సిన రాజకీయాల్లో ఇది బెడసి కొడుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. అందుకే ఆయన పార్టీలో కీలకంగా ఎదిగిన నేతలందరూ పార్టీకి దూరంగా ఉంటున్నారంటున్నారు, కాదు కాదు దూరంగా ఉంచుతున్నాడు జగన్ అన్న టాక్ వినిపిస్తోంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని అంతా తానై నడిపించిన వారు తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, వైవిసుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, శోభానాగిరెడ్డి ఇలా మరికొందరు ప్రముఖ నేతలు ఉన్నారు. వీరంతా ఎంతో కష్టపడి జగన్ వాయిస్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైఎస్సార్ సిపిలో ప్రముఖనేతలుగా మారారు. కాని జైల్లోంచి జగన్ రాగానే సీన్ మారింది. సోదరి షర్మిల అయితే కనిపించడమే లేదు. తల్లి విజయమ్మ ప్రాధాన్యం తగ్గింది. రోజాది అదే పరిస్తితి.

ఇక ఆయన మాటంటే జగన్ మాటే అనేంతగా వినపడే అంబటిరాంబాబు కూడా దూరంగా ఉంటున్నాడు. ఇక కీలక వ్యవహారాలు, సంధి ప్రయత్నాలు, డబ్బు వ్యవహారాలు చూసే వైవిసుబ్బారెడ్డిని కూడా జగన్ దూరం చేసాడు అంటున్నారు. భూమా దంపతుల విషయంలోను ఇదే పరిస్తితి. దీనికి తాజా ఉదహరణే పార్టీ కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకునేందుకు రెండు రోజుల క్రితం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీలోని ఈ ప్రముఖులే హాజరుకాలేదు.

వీరు జగన్ కంటే కూడా పార్టీలో ఎట్రాక్షన్ ఫిగర్స్ అయిపోతున్నారు అందుకే వారిని జగన్ దూరంగా ఉంచారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. వైవి సుబ్బారెడ్డి డబ్బులు వసూలు చేసాడన్న ఆరోపణలు రావడంతో ఆయనను దూరం చేసారు అంటున్నారు, ఇందులో నిజమెంతో తెలియదు.

మరి శోభానాగిరెడ్డి, భూమానాగిరెడ్డి, కొణతాలు, అంబటి రాంబాబు వంటి వారు ఎందుకు కనిపిచడం లేదు. అంటే మాత్రం ఆయన మనస్తత్వంపై వినిపిస్తున్న ఈ వార్తలు నిజమే అనిపిస్తాయి. పోని ఆయన బాబాయ్ ను కూడా ఎందుకు దూరం చేస్తున్నట్లు, చెల్లెలు ను కూడా ఎందుకు దగ్గరికి రానీయడం లేదు, ఇలా లోతుగా ఆలోచిస్తే మాత్రం జగన్ మెంటాలిటిపై వినిపిస్తున్న వార్తలు మాత్రం నిజమనే అనిపిస్తాయి.

జగన్ కు తన పార్టీకి సంబంధించినంత వరకు తను మాత్రమే పవర్ సెంటర్ గా వుండాలి. మరో పవర్ సెంటర్ వుండడం ఇష్టం లేదు. అదే విధంగా జిల్లా స్థాయిలో ఎటువంటి పవర్ సెంటర్లు వుండరాదు. నాయకులందరూ వారి వారి స్థానాలకే పరిమితం కావాలి. పక్క నియోజకవర్గాల వ్యవహారాలు పట్టించుకోరాదు. వాటిపై ఆధిపత్యం అడగరాదు. ఇలాంటి వన్నీ జగన్ సూత్రాలుగా తెలుస్తోంది.

ఇది జగన్ కు రాజకీయంగా ఎంతవరకు పని చేస్తాయి, ఎంత వరకు కీడు చేస్తాయి అంటే మాత్రం మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. ఎందుకంటే రాజకీయాల్లో బలం రావాలంటే బలమైన నేతలు ఉండాలి, అలాంటి నేతలను తయారు చేసుకోవాలి, ఒక కార్యక్రమం సక్సెస్ కావాలంటే అలాంటి నేతలే అవసరం. పైగా జగన్ ఒక్కని చరిష్మాతో ఆయన ముఖం చూసే ఆయన ఎవరిని నిలబెడితే ఆయననే దేవుడిగా భావించి జనం ఓట్లేయరు. తమ ప్రాంతం లో మంచి పేరు, ప్రతిష్ట ఉన్న వాళ్లకు మాత్రమే గెలిపిస్తారు. అలాంటిది తను తప్ప పార్టీలో మరో ప్రజాధరన, చరిష్మా ఉన్న నాయకుడు ఉండొద్దు అనుకుంటే దారుణమైన పలితాలు ఎదురుచూడక తప్పదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు