కెసిఆర్, జానా మౌనముద్ర

కెసిఆర్, జానా మౌనముద్ర

శ్రీశైలం కుడి, ఎడమ కాలువలు సీమాంధ్రలోనే ఉంటాయి. భద్రాచలం గోదావరి జిల్లాకు వెళ్తుంది. హైదరాబాద్ పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. వగైరా.. వగైరా.. వార్తలన్నీ వస్తున్నాయి. కెసిఆర్, జానా పూర్తి మౌనముద్ర వహించారేం? ఒక్క జైపాల్‌రెడ్డి మినహా తెలంగాణకు చెందిన నాయకులెవరూ విభజన వ్యవహారంపై మాట్లాడటం లేదు. జైపాల్‌రెడ్డి కూడా ఆంక్షలులేని తెలంగాణ ఇవ్వాలని అన్నారు. సీమాంధ్ర మంత్రులవలె తాము సమర్పించిన నివేదికలోని అంశాలను వివరించలేదు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెరాస తరపున హాజరైన కెసిఆర్ తాను చెప్పదలచుకున్నది ముక్తసరిగా చెప్పి బయటికి వచ్చారు.

కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేతో విడిగా సమావేశమైన కెసిఆర్ విలేఖరుల సమావేశంలో కూడా ఎక్కువసేపు మాట్లాడలేదు. షిండేతో చర్చించిన అంశాలను వివరించలేదు. దాంతో షిండేతో కెసిఆర్ రహస్యంగా ఏం చర్చించారో వెల్లడించాలని వివిధ పార్టీల నాయకులు ప్రకటనలు కూడా చేశారు. ఢిల్లీ సమావేశం తరువాత వరంగల్‌లో సోమవారం ఓ వివాహానికి హాజరైన కెసిఆర్ రాజకీయాలు ఏం మాట్లాడలేదు. ఆయనను పలకరించేందుకు విలేఖరులు ప్రయత్నించినప్పుడు ‘పెళ్లికి వచ్చాను. రాజకీయాలు మాట్లాడను’ అని తప్పించుకున్నారు. అఖిలపక్ష సమావేశం తరువాత జానారెడ్డి కూడా ఎక్కడా మాట్లాడటం లేదు.

సాధారణంగా ప్రతిరోజు ఏదో ఒక చోట విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వెల్లడించే జానారెడ్డి కూడా మీడియాకు దూరంగా ఉన్నారు. విభజన ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన పరిణామాల గురించి వారికి ముందే ఉప్పందిందా? లేక కొన్నాళ్లపాటు ఏమీ మాట్లాడవద్దని సోనియా నుంచి ఆదేశం అందిందా? తెలియడం లేదు. మరోవైపు జానాకు నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరుల నుంచి ఇంటిపోరు తీవ్రమైంది. అందువల్ల కూడా ఆయన కొంత వౌనంగా ఉన్నట్లు భావించాలి.

అసలు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు సమర్పించిన నివేదికలో ఏముంది? వివరాలు వెల్లడికాలేదు. అందరూ మౌనంగా ఉంటే దానిలో ఉన్న వివరాలు బయటికి వచ్చేదెట్లా? ఆ నివేదిక ఏమైనా రహస్య పత్రమా? తెలంగాణ కేంద్ర మంత్రులు తమ నివేదికలో కోరిందేమిటో కెసిఆర్‌కు తెలుసా? కెసిఆర్ వౌనముద్ర వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? దానికి కాంగ్రెస్‌లో తెరాస విలీనానికి ఏమైనా సంబంధం ఉందా? లేక తెరాస 2014 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తుందా? ఫామ్‌హవుస్ రహస్యం ఎప్పుడు బట్టబయలవుతుంది?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English