చంద్ర‌బాబు ప్లాన్ బి !

చంద్ర‌బాబు ప్లాన్ బి  !

బ‌డ్జెట్ వ‌చ్చేసింది. లెక్క‌లు తెలిశాయి. బీజేపీ లెక్క‌ల్లో ఆంధ్రా లేద‌ని కూడా తేలిపోయింది. ఏపీ ప్ర‌జ‌లు కోపంగా ఉన్నారు. వారు త‌మ ఫ్ర‌స్ట్రేష‌న్ మొత్తం అవ‌కాశం ఉన్న అన్ని మార్గాల్లో వెళ్ల‌గ‌క్కారు. సోష‌ల్ మీడియాలో బీజేపీపై తెలుగు ప్ర‌జ‌ల మూకుమ్మ‌డి దాడి జ‌రుగుతోంది. ప్ర‌తి బ‌డ్జెట్‌లో నిరాశకు గుర‌వ‌డంతో ఈ బ‌డ్జెట్ అయినా మిత్ర లాభం కింద నిధులు కేటాయిస్తుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం భావించింది. కానీ... బీజేపీకి చీమ కుట్టినంత బాధ కూడా ఏపీ గురించి లేద‌ని తెలిశాక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అప్సెట్ అయ్యారు. ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌ని వారితో స్నేహంపై పున‌రాలోచించుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. పార్టీ మీటింగ్ పెట్టారు. ఇది నేష‌న‌ల్ హాట్ టాపిక్ అయ్యింది. అయితే, బీజేపీ పెద్ద‌ల బుజ్జ‌గింపుతో త‌మ ప్ర‌త్యేక డిమాండ్లు తీరిస్తే క‌లిసుంటాం.. అని సాఫ్ట్ గా ఒక అల్టిమేటం ఇచ్చారు చంద్ర‌బాబు. అంతేనా, మ‌రిపుడు ఏం చేయాలి. ఇది రాష్ట్రం ముందున్న ప్ర‌శ్న‌. దీనికి చంద్ర‌బాబు ప్లాన్ బి సిద్ధం చేశార‌ట‌.

ఒక‌వైపు కేంద్రంపై ఒత్తిడి తేవ‌డం. ఇందులో భాగంగా ఈరోజు తాజాగా లోక్‌స‌భ‌లో తెలుగుదేశం ఎంపీలు విభ‌జ‌న హామీల‌పై చ‌ర్చ‌కు నోటీసు ఇచ్చారు. 193వ నిబంధ‌న కింద చ‌ర్చ చేప‌ట్టాల‌ని కోరారు. ఎంపీలు తోట న‌ర‌సింహం, కేశినేని నాని, నిమ్మ‌ల కిష్ట‌ప్ప తెలుగుదేశం పార్ల‌మెంటు ఎంపీల త‌ర‌ఫున ఈ నోటీసులు ఇచ్చారు. రాజ‌కీయంగా ఇలా కేంద్రంపై ఒత్తిడి తేవ‌డం ద్వారా నిధుల‌కు ప్ర‌య‌త్నించ‌డం ఒక‌టి. మ‌రోవైపు చంద్ర‌బాబు ఈరోజు క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో బ‌డ్జెట్ నుంచి ఏపీ ఎలా మేలు పొందాలో క‌లెక్ట‌ర్ల‌కు వివ‌రించారు.

దేశాన్ని ఉద్దేశించి కేటాయించిన వివిధ ప‌థ‌కాల‌ను ఏపీ స‌మ‌ర్థంగా వినియోగించుకోవ‌డం ద్వారా ఏపీ ప్ర‌జ‌ల‌కు కేంద్రం నిధులు చేరేలా కార్యాచ‌ర‌ణ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. క్షీర విప్ల‌వం, నీలి విప్ల‌వం కోసం కేంద్రం బ‌డ్జెట్‌లో ప‌ది వేల కోట్లు కేటాయించింది. ఇది ఏ రాష్ట్రమైన వాడుకోవ‌చ్చు. కాబ‌ట్టి ఏపీ వాటిని పూర్తి స్థాయిలో స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి అధికారులు ప్ర‌య‌త్నించాల‌ని బాబు సూచించారు. న‌రేగా (మ‌హాత్మాగాంధీ రూర‌ల్ ఎంప్లాయిమెంట్)కు కేంద్రం కేటాయించిన 55 వేల కోట్లలో రాష్ట్రం లో ప‌నులు వేగంగా అమ‌లు చేసి ఏడు వేల కోట్లు వాడుకోవ‌చ్చ‌ని బాబు అధికారులకు వివ‌రించారు. ఇలా జాతీయ స్థాయిలో పెట్టిన ప్ర‌తి ప‌థ‌కం నిధులు సాధార‌ణంగా ఏ రాష్ట్రమూ స‌గం కూడా వాడుకోదు. అయితే, మ‌న‌కు నేరుగా నిధులు రానంద‌న వాటిని తెచ్చుకోవ‌డానికి పోరాడ‌టంతో పాటు, ప‌రోక్షంగా ప‌థ‌కాల ద్వారా ఏపీ ప్ర‌జ‌ల‌కు కేంద్ర నిధులు అందేలా చూడాల‌ని ఈరోజు చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్ల‌కు దిశా నిర్దేశం చేశారు. బాబు చిత్త‌శుద్ధి బాగున్నా... దాదాపు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డిన నేప‌థ్యంలో ఇప్ప‌టికే బీజేపీని క్ష‌మిస్తే చంద్ర‌బాబుకు క‌లిగే లాభాల కంటే ప్ర‌మాదాలే ఎక్కువ ఉండే అవ‌కాశం ఉంది. మ‌రి చూద్దం ఈ నెల‌లో ఈ పోరాటం ఏ స్థాయికి వెళ్తుందో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు