ఆ వీడియో నిజమే.. ఫేక్ కాదు

ఆ వీడియో నిజమే.. ఫేక్ కాదు

ఓ యువ‌కుడు వెనుక ట్రైన్ వ‌స్తుండ‌గా సెల్ఫీ వీడియో తీసుకోవ‌డం... క్ష‌ణాల్లో రైలు దూసుకొచ్చేయ‌డం... ఫోను కింద‌ప‌డిపోవ‌డం... ఆ వీడియో వైర‌ల్ కావ‌డం జ‌రిగి పోయింది. ఆ వీడియోను చూస్తే రైలు ఆ యువ‌కుడిని గుద్దేసిన‌ట్టే అర్థ‌మ‌వుతోంది. అయితే వీడియో అంతా ప్రాంక్ అని, ఆ యువ‌కుడికి ఏ ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఓ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ అస‌లేం జ‌రిగిందో...నిజానిజాలేంటో, ఆ యువ‌కుడు ఎవ‌రో వెలుగులోకి తెచ్చింది.

ఈ సెల్ఫీ వీడియో వైర‌ల్ అయ్యాక‌... ఆ కుర్రాడికి ఏదో జ‌రిగింద‌ని అంద‌రూ అనుకుంటున్న స‌మ‌యంలో... మ‌రో వీడియో వైర‌ల్ అయ్యింది. అందులో కూడా ఈ యువ‌కుడే. అత‌ని స్నేహితుల‌తో ఉన్న వీడియో అది. త‌న‌కేం కాలేద‌ని చెప్పాడు అందులో. దీంతో రైలు ఢీ కొట్టిన విష‌యం నిజం కాద‌నుకున్నారు అంతా. అంతా ప్రాంక్ అని తేల్చేశారు. కానీ అస‌లు విష‌యం ఏంటంటే... ఆ యువ‌కుడికి వ‌రంగ‌ల్ జిల్లా. పేరు శివ‌. హైదరాబాద్‌లోని బోర‌బండ‌లో ఉంటాడు. త‌న అన్న అయిన హోంగార్డుతో క‌లిసి రైలుతో సెల్ఫీ వీడియో దిగ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఈలోగానే ట్రైన్ వేగంగా వ‌చ్చి ఢీ కొట్టింది. ఆ ఘ‌ట‌న‌లో విసురుగా వెన‌క్కి ప‌డిపోయాడు. ఫోన్ కాస్త గాలిలో ఎగిరి కింద‌ప‌డింది. ఆ ఘ‌ట‌న‌లో శివ చేతికి, త‌ల‌కు గాయాల‌య్యాయి. విష‌యం తెలిసి వ‌చ్చిన రైల్వే పోలీసులు వారిని అరెస్టు చేసి, కేసు న‌మోదు చేశారు. త‌రువాత పూచీక‌త్తుపై వ‌దిలేశారు.  దెబ్బ‌ల‌న్నీ త‌గ్గిపోయాక‌... త‌న‌కేం జ‌ర‌గ‌లేదంటూ మ‌రో వీడియోలో క‌నిపించాడు శివ‌.

అంతేకాదు శివ బంధువు, మాదాపూర్ జిమ్ లో ప‌నిచేస్తున్న అత‌ని బావ కూడా ఈ విష‌యం నిజ‌మేన‌ని చెప్పాడు. ఆ రోజు ఆ ప్ర‌మాదం నుంచి బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌డం నిజంగా వ‌ర‌మేనంటున్నాడు. లేకుంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని ఆవేద‌న‌గా చెప్పాడు. ఇలాంటి పిచ్చి ప‌నులు ఎవ‌రినీ చేయ‌వ‌ద్ద‌ని కోరుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు