విక్టిమ్ తో వివాహేత‌ర సంబంధం

విక్టిమ్ తో వివాహేత‌ర సంబంధం

తెలంగాణ ప్ర‌భుత్వం ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ త‌మ విధాన‌మని చెప్తుండ‌గా...మ‌రోవైపు ఇందుకు వ్య‌తిరేక‌మైన ప‌రిస్థితులు చోటుచేసుకుంటున్నాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఇటీవలే ఓ ఏఎస్పీ, సీఐ, ఓ కానిస్టేబుల్ ఇలాంటి వ్యవహారాల్లో దొరికిపోగా తాజాగా ఎస్సై వివాదంలో చిక్కుకున్నారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తన భార్యను మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ ఎస్సై లోబరుచుకున్నాడని, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మల్కాజిగిరి డీసీపీకి ఫిర్యాదు అందింది. ఈ ప‌రిణామం పోలీస్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

కరీంనగర్‌కు చెందిన జ్యోత్స్నాదేవి, కాప్రా మండలం మౌలాలి హెచ్‌బీ కాలనీకి చెందిన సతీశ్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో జ్యోత్స్నాదేవి గత ఏడాది నవంబర్ 23న జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనను భర్త సతీశ్ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఎస్సై నర్సింహులుకు ఫిర్యాదు చేసింది. ఎస్సై కేసు నమోదు చేయకుండా జ్యోత్స్న, సతీశ్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాడు. తర్వాత ఎస్సై నర్సింహులు తరుచూ జ్యోత్స్నకు ఫోన్‌ చేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత జ్యోత్స్నను నేరుగా తన ఇంటికి తీసుకెళ్లి భార్యకు పరిచయం చేశాడు!

అయితే, కొన్నాళ్లుగా భార్య ప్రవర్తనలో మార్పు రావడం, విడాకులు కావాలని తరుచూ గొడవ పడుతుండటంతో సతీశ్‌కు వారి వ్యవహారశైలిపై అనుమానం వచ్చి నిఘా పెట్టాడు. ఎస్సై నర్సింహులు క్రెడిట్‌కార్డు జ్యోత్స్న వద్ద దొరుకడం, ఆ కార్డుతో రూ.40వేలు షాపింగ్ చేయడంతో అనుమానం బలపడింది. దీంతో సతీశ్ బుధవారం మాల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మను కలిసి ఫిర్యాదు చేశారు. వారిద్దరి వ్యవహారం తనకు తెలువడంతో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని వాపోయారు. తనకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించడంతోపాటు న్యాయం చేయాలని వేడుకున్నారు. సతీశ్ ఫిర్యాదు నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు జవహర్‌నగర్ ఎస్సై నర్సింహులును హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీచేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

కాగా, ఎస్సై నర్సింహులుకు, తనకు మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని జ్యోత్స్నాదేవి పేర్కొన్నారు. తన భర్త సతీశ్ కొన్నాళ్లుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో న్యాయం చేయాలని తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని కోరానన్నారు. ఈ క్రమంలోనే స్నేహంగా ఉంటున్నామని, అంతకు మించి ఏమీ లేదన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు